కొత్త వైద్యులొస్తున్నారు..201 మంది డాక్టర్ల సెలెక్షన్ లిస్ట్ విడుదల

కొత్త వైద్యులొస్తున్నారు..201 మంది డాక్టర్ల సెలెక్షన్ లిస్ట్ విడుదల
  • ఆయుష్ వైద్య సేవలు మరింత బలోపేతం: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ఎంఎన్‌‌జే కేన్సర్ హాస్పిటల్‌‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన సెలెక్షన్ లిస్ట్​ను శనివారం మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆయుష్‌‌లో156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఎంఎన్‌‌జేలో45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ఈ నియామకాలతో ఆయుష్ వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆనందం వ్యక్తం చేశారు.

 రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల 630 యోగా ఇన్‌‌స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేసినట్టు, మరో 200కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. 

కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేన్సర్ వైద్య సేవలను విస్తరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎంఎన్‌‌జే కేన్సర్ హాస్పిటల్‌‌లో కొత్తగా 45 మంది డాక్టర్ల నియామకంతో వైద్య సేవలు మరింత సమర్థవంతం కానున్నాయని ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో కేన్సర్ వైద్య సేవల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. 

కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కేన్సర్ కేర్ సెంటర్లు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సెంటర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోగులు హైదరాబాద్‌‌కు ప్రయాణించాల్సిన అవసరం ఉండదని, జిల్లా స్థాయిలోనే ఉన్నత వైద్య సేవలు అందుతాయని మంత్రి వివరించారు.