
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.. అన్నట్లుగా కొందరు తినే వస్తువుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. మట్టి తినేవాళ్లు, పేపర్లు తినేవాళ్లు, బలపాలు తినే వాళ్లను చూశాం.. కానీ.. ఏకంగా చెంచాలు, టూత్ బ్రష్ లు మింగటం డాక్టర్లనే ఆశ్చర్యానికి గురిచేసింది. అలా ఎలా మింగావు బ్రో.. అంటూ నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారాయి.
విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో డీ-అడిక్షన్ సెంటర్ లో జరిగింది ఈ ఘటన. బాధితుడి కడుపులో నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 29 స్టీల్ స్పూన్లు, 19 బ్రష్ లు, 2 పెన్నులను అతి కష్టం మీద బయటకు తీశారు డాక్టర్లు.
ఈ అలవాటు వెనుక..
యూపీలోని హాపూర్ కు చెందిన సచిన్ (35) ను అతని కుటుంబ సభ్యులు డీ అడిక్షన్ సెంటర్ కు పంపించారు. ఇంట్లో చేస్తున్న పనులకు విసుగు చెంది పంపించగా.. అక్కడ కూడా అదే పని చేయడంతో డాక్టర్లు సర్జరీ ద్వారా మింగిన వస్తువులను తొలగించారు.
అయితే దీనికి ఇతను చెప్పిన కారణం ఏంటంటే.. డీ-అడిక్షన్ సెంటర్లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదనే కోపంతోనే ఇలా చేశానని చెప్పాడు. అక్కడ ఉన్న పేషెంట్స్ కు కొద్ది మొత్తంలోనే ఆహారం అందిస్తున్నారు. రోజు మొత్తంలో కొన్ని చపాతీలు, తక్కువ పరిమాణంలో కూర ఇస్తున్నారు. ఇంటి నుంచి ఏదైనా వచ్చినా మా వరకు రానివ్వటం లేదు. రోజుకు ఒకే ఒక బిస్కెట్ ఇస్తున్నారు. అందుకే కోపంతో ఇలా చేశానని చెప్తున్నాడు.
ఎలా మింగేవాడు..
ఎవరూ చూడకుండా సైలెంట్ గా బ్రష్ లు, స్పూన్లు, పెన్నులను జేబులో పెట్టుకుని బాత్ రూమ్ కు వెళ్తాడట. లోపలికి వెళ్లి.. వాటిని కట్ చేసి నోట్లో వేసుకుని.. కష్టం మీద కడుపులోకి పంపిస్తాడట. కొన్నిసార్లు మింగడం కష్టంగా ఉంటే నీళ్ల సాయంతో లోపలికి పంపించేవాడట.
తర్వాత కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఎక్స్ రే, సీటీ స్కాన్ తీయగా.. కడుపులో ఉన్న వస్తువులను చూసి షాకయ్యారు. అయితే ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో సర్జరీ చేసి స్పూన్లు, పెన్నులు, బ్రష్ లను బయటకు తీశారు. సైకాలజికల్ ప్రాబ్లమ్స్ కారణంగా.. కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారని డాక్టర్ శ్యామ్ కుమార్ చెప్పారు.