సమ్మె…అమిత్ షా కుట్ర: మమత

సమ్మె…అమిత్ షా కుట్ర: మమత

సీపీఎంతో కలిసి మతం రంగు పూస్తున్నారు.. బెంగాల్ సీఎం మమత ఆరోపణ


సమ్మె విరమించకపోతే చర్యలు తీసుకుంటానని వార్నింగ్
డిమాండ్లు పరిష్కరించే వరకు స్ట్రయిక్‌ ఆగదన్న డాక్టర్లు
మమత రిజైన్ చేయాలన్న బీజేపీ

జూనియర్ డాక్టర్ల సమ్మె వెనుక బీజేపీ, సీపీఎం కుట్ర ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బయటి వ్యక్తులు మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లోకి వచ్చి సమస్య సృష్టిస్తున్నారని అన్నారు. ” జూనియర్ డాక్టర్ల సమ్మెను ఖండిస్తున్నా.  దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. సమ్మెకు బీజేపీ మతపరమైన రంగు పూస్తోంది. సీపీఎం సాయంతో హిందూ, ముస్లిం రాజకీయాలకు పాల్పడుతోంది.  ఆ రెండు పార్టీల లవ్ అఫేర్ చూసి షాక్ అయ్యా . మతపరమైన అల్లర్లు సృష్టించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా ఫేస్ బుక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు” అని ఆరోపించారు.  మూడురోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో ఆరోగ్య శాఖ చూస్తున్న సీఎం మమతా బెనర్జీ గురువారం  మధ్యాహ్నం కో ల్ కతా లోని  ఎస్ఎస్ కేఎం ఆస్పత్రిని సందర్శించారు.  జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి  వెంటనే విధుల్లోకి చేరాలని లేకుంటే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. తమకు న్యాయం చేయాల్సిందేనని జూనియర్ డాక్టర్లు మమత ఎదుటే  నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలకు అంతరాయం కలిగిందని,  ఆస్పత్రి ప్రాంగణాలను క్లియర్ చేయాలని పోలీసులకు మమత  ఆదేశించారు. రోగులు తప్ప క్యాంపస్ లోకి ఎవర్నీ అనుమతించరాదని హుకుం జారీ చేశారు.

కొనసాగుతున్న సమ్మె
మధ్యాహ్నం 2 గంటల్లోపు సమ్మె ఆపాలని లేకుంటే  చర్యలు తీసుకుంటానని పశ్చిమ బెంగాల్ సీఎం ఇచ్చిన డెడ్ లైన్ ను జూనియర్ డాక్టర్లు తిరస్కరించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని తేల్చి చెప్పారు. గురువారం డాక్టర్ల బృందం రాజ్ భవన్ లో గవర్నర్  కేసరీనాథ్ త్రిపాఠిని కలిసి  ఆందోళనకు దారి తీసిన పరిణామాలను వివరించారు. సీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తాం. గవర్నర్ తో మాట్లాడాం. ఆయన మా సమస్యలు విన్నారు. సీఎంతో మాట్లాడతానని చెప్పారు” అని జూనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. అన్ని ఆస్పత్రుల్లో పోలీసు భద్రత కల్పించాలి, డాక్టర్లపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. వృద్ధుడి మృతిని నిరసిస్తూ శనివారం కోల్ కతా లోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లపై 200 మంది దాడి చేశారు. ఇద్దరు డాక్టర్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనను నిరసిస్తూ మంగళవారం జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు, ఓపీ సేవలు, పాథోలాజికల్ యూనిట్లలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. డాక్టర్ల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది.

ఎస్ఎస్ కేఎం మెడికల్‌‌ కాలేజీ దగ్గర డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడు తున్న మమత

నిందలు సరికాదు: బీజేపీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెల్త్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. జూనియర్ డాక్టర్ల సమస్యను  పరిష్కరించకుండా మమతా బెనర్జీ నిందలు వేస్తున్నారని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు జయ ప్రకాశ్ మజుందార్ విమర్శించారు. ” ఆందోళన చేస్తున్న డాక్టర్లతో వ్యవహరించే తీరు ఇదేనా? సమస్య పరిష్కరించకుండా డాక్టర్లు, బీజేపీ నేతలు, ఇతరులపై నిందలు వేస్తున్నారు. ఇది సరికాదు. పరిస్థితిని ఆమె నియంత్రించలేకపోతే హెల్త్ మినిస్టర్ గా రిజైన్ చేయాలి” అని  ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్లపై దాడికి పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ నేతలేనని  సీనియర్ బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ ఆరోపించారు.

డాక్టర్లకు మమత లెటర్
జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లోని సీనియర్ డాక్టర్లకు సీఎం మమతా బెనర్జీ లెటర్ రాశారు.”పేషెంట్లపై కేర్ తీసుకోండి. జిల్లాల నుంచి పేదలు ఆస్పత్రులకు వస్తున్నారు. ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు కొనసాగిస్తే మిమ్మల్ని గౌరవిస్తాం . మీ సహకారానికి ధన్యవాదాలు” అని లేఖలో పేర్కొన్నారు.