
కోల్‌కతా: తూర్పు రాష్ట్రాలలో ప్రీమియం డెయిరీ బ్రాండ్ అయిన ఓసమ్ డెయిరీలోని 100 శాతం వాటాను రూ.271 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు దొడ్ల డెయిరీ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. తూర్పు మార్కెట్లలోకి వెళ్లడానికే దీనిని కొన్నామని తెలిపింది.
కొనుగోలుతో పాన్ -ఇండియా డెయిరీ కంపెనీగా ఎదుగుతామని దొడ్ల డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి అన్నారు. 2012లో ఏర్పాటైన ఓసమ్ డెయిరీకి బీహార్, జార్ఖండ్, ఇతర తూర్పు రాష్ట్రాలలో వెయ్యి పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి.
ఇది రెండు ప్లాంట్లలో రోజుకు దాదాపు 1.1 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది. ఇన్‌క్రెడ్ క్యాపిటల్ ఓసమ్కు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. దొడ్ల డెయిరీని 1995లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ సంస్థ మొదటగా కొన్ని రాష్ట్రాల్లోనే తన కార్యకలాపాలను ప్రారంభించినా, ఇప్పుడు 11 రాష్ట్రాలలో తన ఉత్పత్తులను అమ్ముతోంది.