ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులు సెల్‌ఫోన్లు వాడకుండా నిషేధం

ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులు సెల్‌ఫోన్లు వాడకుండా నిషేధం

మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ కూడా ఒక నిత్యవసర వస్తువు అయిపోయింది. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అందరూ మొబైల్​తోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆఖరికి తినే సమయంలో కూడా దాన్ని పక్కన పెట్టడం లేదు. ఒక చేత్తో తింటూ మరో చేత్తో దాన్ని ఉపయోగిస్తున్నారు. క్రమక్రమంగా పిల్లలు కూడా దీనికి బానిసలు అయిపోతున్నారు. రీల్స్, వీడియోలు, సోషల్ మీడియా అంటూ మొబైల్ వినియోగానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులు తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధిస్తున్నట్లు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) గురువారం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాల ఆవరణలోకి మొబైల్ ఫోన్‌లను తీసుకురాకుండా చూసుకోవాలని సూచించింది. ఒకవేళ తీసుకొచ్చినా.. వాటిని లాకర్‌లో ఉంచి, పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులకు మొబైల్ ఫోన్‌లను తిరిగి ఇచ్చేలా ఏర్పాటు చేయాలని పాఠశాల యాజమాన్యాలకు తెలిపింది. 

ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా

ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా తరగతి గదులు, ఆట స్థలాలు, ప్రయోగశాలలు మరియు లైబ్రరీలు వంటి ప్రదేశాలలో మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా ఉండాలని ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోరింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయడానికి పాఠశాలల్లోనే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నియమ నిభంధనలు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తాయని డిఓఇ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రూల్స్ అమలు చేయాలని కోరుతున్నారు.