ప్రజలు అడిగే సవాళ్లకు కేటీఆర్ కు జవాబు చెప్పే ధైర్యం లేదా ?

V6 Velugu Posted on Sep 14, 2021

  • అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు తప్పదు.. నియంతలను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది
  • కేసీఆర్ కుటుంబానికి అలాంటి గతే పడుతుంది
  • మాజీ ఎమ్మెల్యే సంపత్ అరెస్టుపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రజలు అడిగే సవాళ్లకు మంత్రి కేటీఆర్ కు జవాబు చెప్పే ధైర్యం లేదా ? అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు తప్పదని.. నియంతలను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణదని, కేసీఆర్ కుటుంబానికి కూడా త్వరలోనే అలాంటి గతే పడుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ ను గృహ నిర్బంధం చేయడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
‘‘మంత్రి కేటీఆర్ ఆలంపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తే ఒక మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేస్తారా..? ఇదేమన్నా రాజుల పాలనా..? కేటీఆర్ కు ప్రజలు అడిగే సవాళ్లకు జవాబు చెప్పే ధైర్యం లేదా ? నియోజక వర్గంలో మూడేళ్ల క్రితం వీరాపురం దగ్గర మంత్రులు చేసిన శంకుస్థాపన చేసిన హ్యాండ్లూమ్ పార్క్ విషయాన్ని సంపత్ గుర్తు చేశారు.. ప్రజా సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తేవడం మాజీ ఎమ్మెల్యే గా ఆయన కనీస బాధ్యత.. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఒక రాచరిక పాలనలా చేస్తోంది. ఇంతటి అణచివేత దేశంలోఎక్కడా లేదు..’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు తప్పదని, తెలంగాణ చరిత్ర తెలుసుకొని కేసీఆర్ కుటుంబం నడుచుకోవాలన్నారు. 
సిరిసిల్ల, గజ్వెల్ లాంటి నియోజక వర్గాలకు మంత్రులు వెళ్తుంటే ప్రతిసారి కాంగ్రెస్ నాయకులను, అరెస్టులు, గృహ నిర్బందాలు చేయడం అలవాటుగా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తిరుగుబాటు చేసి తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. 
 

Tagged Revanth reddy, telangana congress, , pcc chief revanth reddy, EX MLA Sampath Kumar, revanth reddy latest comments, alampur ex mla sampath kumar, revanth reddy questions, ts congress.t.congress

Latest Videos

Subscribe Now

More News