కుక్క చేసిన పని.. భేష్

కుక్క చేసిన పని.. భేష్
  • ట్రెక్కింగ్ చేస్తూ ఇద్దరు మృతి.. రెండ్రోజులు
  • మృతదేహాలకు కాపలా కాసిన డాగ్
  • మృతులను గుర్తించడంలో పోలీసులకు సహాయం
  • హిమాచల్ ప్రదేశ్ లోని బీర్ బిల్లింగ్ లో ఘటన 

షిమ్లా: ట్రెక్కింగ్ కు వెళ్లిన ఇద్దరు యువతీ, యవకులు మంచులో కూరుకుపోయి మరణించారు. వారి వెంట వెళ్లిన కుక్క రెండు రోజుల పాటు మృతదేహాలకు కాపలా కాసింది. మరణించిన వారిని గుర్తించడంలో రెస్క్యూ బృందాలకు సహాయం చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని బీర్ బిల్లింగ్ లో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిని పంజాబ్ కు చెందిన అభినందన్ గుప్తా (30), పుణెకు చెందిన ప్రణీత(26)గా గుర్తించారు. సముద్రమట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న బీర్‌‌ బిల్లింగ్‌‌ ప్రాంతం ట్రెక్కింగ్‌‌, పారాగ్లైడింగ్‌‌ కు ప్రసిద్ధి పొందింది. గుప్తా గత నాలుగేండ్లుగా ఇక్కడే ఉంటూ ట్రెక్కింగ్‌‌ చేస్తున్నాడు.

కొత్తగా వచ్చేవారిని తనవెంట తీసుకెళ్తుంటాడు. ప్రణీత కొన్ని వారాల క్రితమే ఇక్కడికి వచ్చింది. మొత్తం నలుగురు సభ్యుల బృందం బీర్‌‌ బిల్లింగ్‌‌లో ట్రెక్కింగ్ చేసేందుకు కారులో బయలుదేరింది. మధ్యలో వాతావరణం అనుకూలించకపోడంతో నడవడం ప్రారంభించారు. కొంతదూరం వెళ్లేసరికి అందులోని ఇద్దరు తమ వల్ల కావడం లేదంటూ వెనక్కి వచ్చేశారు. తనకు రూట్ తెలుసని గుప్తా చెప్పడంతో ప్రణీత అతడితో కలిసి ప్రయాణాన్ని కొనసాగించింది.

వీరి వెంట ఓ జర్మన్ షెపర్డ్ కుక్క కూడా ఉంది. కొంత దూరం వెళ్లాక వీరు మంచులో కూరుకుపోయారు. అపస్మార స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ కు వెళ్లిన ఇద్దరు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కిందకు వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కొంత దూరంలో కుక్క అరుపులు వినిపించి అటువైపు వెళ్లగా మృతదేహాలు లభించాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.