యూనియన్లు లేకుండా చేస్తామనడం నియంత ధోరణికి నిదర్శనం

యూనియన్లు లేకుండా చేస్తామనడం నియంత ధోరణికి నిదర్శనం
  • ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరు: జస్టిస్​ చంద్రు
  • ఆర్టీసీ సమ్మెపై సీఎం తీరు విస్మయం కలిగించింది
  • యూనియన్లు లేకుండా చేస్తామనడం సరికాదు
  • యూనియన్లతో పాలకులు మాట్లాడాలని సూచన

ముషీరాబాద్‌‌, వెలుగు: యూనియన్లు లేకుండా చేస్తామని పాలకులు అనడం వారి నియంత ధోరణికి నిదర్శనమని జస్టిస్‌‌ చంద్రు అన్నారు. యూనియన్లతో సంప్రదింపులు జరపబోమని సీఎంలు భీష్మించుకు కూర్చోవడానికి వీల్లేదని చెప్పారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు జయలలిత లక్షల మంది ఉద్యోగులను తొలగించడాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా సీఎం కేసీఆర్‌‌ మొండికేయడాన్ని ఆయన గుర్తుచేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌‌ తీరు విస్మయం కలిగించిందని, ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చూస్తామని హెచ్చరించడం సరికాదన్నారు.  

ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విధ్వంసమవుతున్న ప్రజాస్వామ్య పునాదులు -– పరిరక్షణ మార్గాలు’ సదస్సులో జస్టిస్​ చంద్రు మాట్లాడారు. కేసీఆర్ నియంతలాగా పాలిస్తున్నారని, అలాంటి సీఎంపైనా కేసు పెట్టవచ్చని చెప్పారు. ప్రజా వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరన్నారు. పాలకులు యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడటం ఏమిటని, కచ్చితంగా యూనియన్లతో మాట్లాడాలని చెప్పారు. దేశంలో కార్మిక సంఘాలు ఉంటాయని స్పష్టం చేశారు.
చదువే కాదు ధైర్యం కూడా ఉండాలి
సమాజంలో అడుగడుగునా ప్రజా శత్రువులు ఉన్నారని, వారి ఆట కట్టించేందుకు ప్రజా పోరాటాలను, ఓటుహక్కును ఆయుధాలుగా మలుచుకోవాలని జస్టిస్​ చంద్రు పిలుపునిచ్చారు. జైభీమ్ సినిమాలో విలన్లు గురుమూర్తి, ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, సమాజంలో మాత్రం ఇంకా పెద్ద పెద్ద శత్రువులు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆర్గనైజేషన్స్ తోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తనతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నాయని, వాటి వెనుక ఎవరున్నారో ఆలోచించాలన్నారు. ‘‘జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు సమ్మె చేశారనే కారణంతో లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తే వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. వారిలో ఒక్కరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ధైర్యంగా ముందుకు రాలేదు” అని అన్నారు. అంబేద్కర్‌ చెప్పినట్టు ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ దారిలో అందరూ నడవాలన్నారు.   జై భీమ్ సినిమా ఒక సినిమాలాగే మిగిలిపోలేదని, 142 దేశాలతో పాటు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు తనకు కొత్త గుర్తింపును తెచ్చిందని జస్టిస్​ చంద్రు అన్నారు.  సంఘ్‌ పరివార్‌, బీజేపీ వ్యక్తులతో సెన్సార్‌ బోర్డులు నిండిపోయాయన్నారు.