కశ్మీర్ మీడియేషన్ : ట్రంప్ కామెంట్స్ ఖండించిన ఇండియా

కశ్మీర్ మీడియేషన్ : ట్రంప్ కామెంట్స్ ఖండించిన ఇండియా

కశ్మీర్ సమస్య – పరిష్కారంపై మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ను ఖండించింది భారత విదేశాంగ శాఖ. వాషింగ్టన్ డీసీలో సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశం సందర్భంగా ట్రంప్ చేసిన కామెంట్స్.. ఇండియా, పాకిస్థాన్ లో హాట్ టాపిక్ గా మారాయి.

జపాన్ లో ఇటీవల జీ20 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని మోడీ, తాను  ద్వైపాక్షిక చర్చలు జరిపామని గుర్తుచేశారు ట్రంప్. ఈ సమయంలో.. కశ్మీర్ విషయంలో మీడియేషన్ చేస్తారా అని మోడీ అడిగారని చెప్పారు ట్రంప్. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కశ్మీర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని.. మధ్యవర్తిత్వం వహించాలని కోరుతున్నారని చెప్పారు అమెరికా ప్రెసిడెంట్. ట్రంప్ కామెంట్స్ పై… అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది.

సోమవారం అర్ధరాత్రి భారత విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో స్పందించింది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిగా/సంధాన కర్తగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ప్రధాని మోడీ కోరలేదని .. ఈ వార్తలు నిజం కాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.

“పాకిస్థాన్ తో ఉన్న సమస్యలు రెండు దేశాల మధ్య సంబంధాలతోనే పరిష్కారం అవుతాయన్నది మా ప్రభుత్వం ధృఢమైన అభిప్రాయం. పాకిస్థాన్ , ఇండియా మధ్య ఎటువంటి చర్చలు జరిగినా.. అది సరిహద్దు ఉగ్రవాదానికి ముగింపు పలికేలా సాగుతుంది. షిమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్ .. ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి దారి చూపుతాయి” అని చెప్పారు రవీష్ కుమార్.