ఉత్తరకొరియా భూభాగంలోకి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్

ఉత్తరకొరియా భూభాగంలోకి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్

ప్రపంచంలోనే చిట్టచివరి కోల్డ్ వార్ సరిహద్దు అది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే ప్రాంతమది. అటువైపేమో అణు భయం పుట్టిస్తున్న దేశాధినేత.. ఇటువైపేమో కయ్యానికి కాలుదూసే అగ్ర దేశ అధ్యక్షుడు. కానీ ఇద్దరూ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కలిశారు. స్నేహ హస్తం అందించారు. ఇద్దరూ కలిసి ‘ఒక్క అడుగు’ వేశారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారు. ఆ ఇద్దరూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.

‘డీఎంజడ్’లో చర్చలు…

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. ​‘డీ మిలటరైజ్డ్ జోన్’(డీఎంజడ్)లోకి వెళ్లి న్యూక్లియర్ వెపన్స్ అంశంపై కిమ్​తో చర్చించారు. ఆదివారం తొలుత నార్త్, సౌత్ కొరియాల మధ్యలో ఉన్న డీఎంజడ్లోకి ట్రంప్ చేరుకున్నారు. కిమ్​కు షేక్​హ్యాండ్ ఇచ్చారు. తర్వాత ఉత్తరకొరియా భూభాగంలోకి కిమ్‌‌తో కలిసి ట్రంప్‌‌ అడుగుపెట్టారు. ఆ వెంటనే వెనక్కి మళ్లి దక్షిణ కొరియా భూభాగంలోకి వచ్చారు. మీడియాతో మాట్లాడారు. తర్వాత మీటింగ్​కు వెళ్లారు. డీఎంజడ్​లోని ‘ఫ్రీడమ్​హౌస్’​లో వీరిద్దరి భేటీ సుమారు గంటపాటు జరిగింది. ఈ భేటీలో ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్​కూడా పాల్గొన్నారు. అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయ్ ఇన్ మాత్రం ట్రంప్, కిమ్ చర్చల్లో పాల్గొనలేదు. చర్చలు సాగుతున్నంత సేపు ఆయన ఇంకో భవనంలో ఎదురుచూశారు.

చర్చల పునరుద్ధరణకు ఓకే…

ట్రంప్, కిమ్ మధ్య గత ఫిబ్రవరిలో వియత్నాంలో జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూక్లియర్ చర్చలను తిరిగి పునరుద్ధరించాలని తాజాగా రెండుదేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేయనున్నాయి.

మాట్లాడుకుందాం రండి….

జీ20 సదస్సు తర్వాత దక్షిణ కొరియా పర్యటనకు ట్రంప్‌‌ వెళ్లారు. ఆ దేశ ప్రెసిడెంట్ మూన్ జోయ్ ఇన్​తో చర్చలు జరిపారు. తర్వాత ‘మాట్లాడుకుందాం రండి’ అంటూ కిమ్​ను ట్విట్టర్​లో ఆహ్వానించారు.‘‘జపాన్ నుంచి దక్షిణ కొరియా వెళ్తున్నా (ప్రెసిడెంట్ మూన్‌‌తో కలిసి). అక్కడ ఉన్నప్పుడు, ఒకవేళ కిమ్ వస్తే ఆయన్ను సరిహద్దు/డీఎంజడ్ వద్ద కలుస్తా. ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తా. హలో చెబుతా’’ అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీ జరిగింది. మరోవైపు అమెరికా పర్యటనకు రావాల్సిందిగా కిమ్‌‌ను ట్రంప్‌‌ కోరినట్లు తెలిసింది. అయితే కిమ్‌‌ తన స్పందన చెప్పలేదని అధికారులు వెల్లడించారు. ఒకవేళ అమెరికాకు కిమ్ వెళ్తే.. ఆ దేశాన్ని నార్త్ కొరియా దేశాధినేత సందర్శించడం ఇదే తొలిసారి అవుతుంది.

వైట్ హౌస్ ప్రెస్​సెక్రెటరీని తోసేశారు…

ఓవైపు కిమ్​తో కలిసి ఉత్తరకొరియాలోకి ట్రంప్ ఎంటర్ అవుతుండగా, మరోవైపు వైట్ హౌస్ ప్రెస్​సెక్రెటరీ స్టెఫనీ గ్రీషమ్​పై నార్త్ కొరియన్ గార్డ్స్ కఠినంగా ప్రవర్తించారు. కిమ్,​ ట్రంప్​షేక్​హ్యాండ్ దృశ్యాన్ని ఫొటో తీసేందుకు మీడియా ప్రయత్నిస్తున్న సమయంలో గార్డులు అడ్డుకున్నారు. అమెరికా మీడియా రాకుండా అడ్డుపడ్డారు. స్టెఫనీని వెనక్కి నెట్టారు. దీంతో మీడియా ప్రతినిధులు, కొరియా గార్డ్స్ మధ్య కొంచెంసేపు గొడవ జరిగింది. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు ప్రయత్నించిన స్టెఫనీకి గాయాలయ్యాయి.

సమ్​థింగ్ స్పెషల్…

..ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అంతకుముందు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్.. కొరియాకు వెళ్లారు. అయితే అప్పటికి వారు మాజీ ప్రెసిడెంట్​.

..ఉత్తరకొరియా, దక్షిణకొరియా, అమెరికా దేశాల అధినేతలు ఒకేచోట కలవడం ఇదే తొలిసారి.

..నార్త్ కొరియా అధినేత కిమ్ తో ఇప్పటివరకు ట్రంప్ మూడుసార్లు భేటీ అయ్యారు.

హ్యాండ్ షేక్​ ఆఫ్ పీస్…

‘‘మిమ్మల్ని మరోసారి కలవడం సంతోషంగా ఉంది. ఇక్కడ మనం కలుస్తామని ఎన్నడూ అనుకోలేదు’’ అని కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ట్రంప్​తో షేక్​హ్యాండ్​ను ‘హ్యాండ్ షేక్​ఆఫ్ పీస్’గా ఆయన అభివర్ణించారు. ‘‘వైట్​హౌస్​కు ఎప్పుడైనా రావొచ్చని యువ నేత కిమ్​ను ఆహ్వానించాను. ప్రపంచానికి ఓ గొప్ప రోజు ఇది. ఎన్నో గొప్ప విషయాలు జరుగుతు న్నాయి. ఈ క్షణం ఇక్కడ ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. మా మధ్య గొప్ప ఫ్రెండ్​షిప్ ఉంది. మొదటి నుంచీ ఒకరంటే ఒకరం ఇష్టపడుతున్నాం’’- డొనాల్డ్ ట్రంప్

ముచ్చటగా మూడోసారి..

ట్రంప్‌తో కిమ్‌ గతేడాది తొలిసారి సింగపూర్‌లో సమావేశమై చర్చించారు. తర్వాత ఈ ఏడాది ఫిబ్ర వరిలో వియత్నాంలో రెండోసారి భేటీ ఆయ్యారు. ముచ్చటగా మూడోసారి ఆదివారం కలిశారు.

డీ మిలటరైజ్డ్ జోన్ (డీఎంజడ్) కథ ఇదీ..

..1950–53 మధ్య జరిగిన కొరియా వార్​తర్వాత రెండు దేశాల మధ్య డీ మిలిటరైజ్డ్ జోన్​(డీఎంజడ్) ఏర్పాటు చేశారు. నాటి యుద్ధంలో దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా నేతృత్వంలోని యూఎన్ దళాలు, ఉత్తరకొరియాకు చైనా దళాలు మద్దతుగా నిలిచాయి.

..డీఎంజడ్ నాలుగు కిలోమీటర్ల వెడల్పు, 240 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

..దక్షిణ కొరియా రాజధాని సియోల్‌‌కు 50 కిలోమీటర్ల దూరంలో, నార్త్ కొరియా క్యాపిటల్ ప్యాంగ్‌‌యాంగ్‌‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.రెండు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం ఇందులోకి హెవీ వెపన్లను తీసుకెళ్లకూడదు.

..ఏ సమయంలోనైనా, ఏ దేశం నుంచైనా వెయ్యి మందికి మించి సైనికులు అందు లోకి రాకూడదు. రెండు దేశాలు పెట్రోలింగ్ జరపొచ్చు. ‘అసలు సరిహద్దు’ను మాత్రం దాటకూడదు. డీఎంజడ్లో సరిహద్దు వెంబడి ల్యాండ్ మైన్లను అమర్చారు.

..డీఎంజడ్ ‘నో మ్యాన్ ల్యాండ్’ కావడంతో అక్కడికి ఎవరూ వెళ్లరు. దీంతో అక్కడ అడవులు అభివృద్ధి చెందాయి. ఇప్పుడది ఎన్నో అరుదైన జంతువులు, చెట్లకు నిలయం.

..2002లో నాటి అమెరికా ప్రెసిడెంట్ జార్జి డబ్ల్యూ బుష్ ఇక్కడికి వచ్చారు. తిరిగి వెళ్లిన నెల రోజుల తర్వాత నార్త్ కొరియాను ‘యాక్సిస్ ఆఫ్ ఈవిల్’ అని మండిపడ్డారు.

..గతంలో ట్రంప్ వెళ్లేందుకు ప్రయత్నించారు. హెలికాఫ్టర్​లో వచ్చిన ఆయన వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగారు.