- 2 వేల వస్తువులపై బాదుడే
- ఈ చర్య దురదృష్టకరమన్న ఇండియా
- పెద్దగా ప్రభావం ఉండదంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అన్నంత పనీ చేసింది. రెండు నెలల క్రితం ప్రకటించినట్టుగానే మనదేశానికి ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ)ను తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ కొత్త నిర్ణయం ఈ నెల ఐదో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. తమ మార్కెట్లకు ఇండియా సమానమైన, హేతుబద్ధమైన అవకాశాలు కల్పించడంలో విఫలం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది. జీఎస్పీ రద్దు వల్ల ఇక నుంచి ఇండియా 5.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.38,964 కోట్లు) విలువైన ఎగుమతులపై సుంకాలు చెల్లించాలి. అమెరికా మార్కెట్లకు ఇండియా సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు కాబట్టి జీఎస్పీని తొలగించడానికి ఇదే తగిన సమయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.
జీఎస్పీ కింద ఇండియాకు ఇస్తున్న ప్రత్యేక పన్ను ప్రయోజనాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఈ దేశం మార్చి ఐదునే ప్రకటించింది. కొత్త నిబంధనలు మే తొలివారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఇండియాలో మే 23న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వస్తున్నందున, కొత్త ప్రభుత్వం వచ్చే దాకా సుంకాల విధింపును అమలు చేయవద్దన్న కాంగ్రెస్ సభ్యుల సూచనకు ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్ గత నెల అప్పటి ఇండియా వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభుతో ఈ–కామర్స్, డేటా రక్షణ, స్థానికంగా నిల్వ చేయడం, మేధోసంపత్తి హక్కులు వంటి అంశాలపై చర్చించారు.
ప్రభావం పరిమితమే..
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) లెక్కల ప్రకారం.. 2018లో ఇండియా 324.7 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. వీటిలో 51.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు పంపింది. వీటిలో 6.35 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులకు మాత్రమే అమెరికా పన్ను మినహాయింపులు ఇచ్చింది. 1921 అమెరికా సుంకాల విధానం ప్రకారం ఈ మినహాయింపులు వర్తించాయి. జీఎస్పీని రద్దు చేయడం వల్ల ఇండియా వాణిజ్యరంగంపై స్వల్పంగానే ప్రభావం ఉంటుందని ఈ సంస్థ తెలిపింది. మోడీ ప్రభుత్వం కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
ఇదిలా ఉంటే, ఇండియా నుంచి వచ్చే క్రిస్టలిన్ సిలికాన్ ఫొటోవోల్టెక్ (సీఎస్‌పీవీ) ఉత్పత్తులపై, వాషర్లపై రక్షణ చర్యలను కూడా ఉపసంహరించుకుంది. డబ్ల్యూటీవో సభ్యత్వం కలిగిన వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించడానికి అగ్రరాజ్యం జీఎస్పీ విధానాన్ని అమలు చేస్తోంది. ఫలితంగా అమెరికాకు ఎగుమతి అయ్యే రెండు వేల రకాల వస్తువులపై సుంకాలు వసూలు చేయడం లేదు. జీఎస్పీ వల్ల అత్యధికంగా ఇండియానే లబ్ధి పొందుతున్నట్టు ఒక స్టడీలో తేలింది.
అమెరికాతో కలిసి ముందుకు నడుస్తాం
జీఎస్పీని రద్దు చేసినట్టు అమెరికా అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఇండియా స్పందించింది. జీఎస్పీని ఉపసంహరించుకున్నప్పటికీ అమెరికాతో కలిసి పనిచేస్తామని, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ప్రకటించింది. ఆర్థిక ఒప్పందాల విషయంలో ఇరుదేశాలు కాలానుగుణంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
ఇండియా వంటి వర్ధమాన దేశాలకు జీఎస్పీ ఇవ్వడం ఎంతమాత్రం వివక్షాపూరితం కాదని స్పష్టం చేసింది. ఇండియా తమకు న్యాయబద్ధమైన అవకాశాలు ఇవ్వడం లేదని అమెరికాకు చెందిన డెయిరీ, వైద్య పరికరాల తయారీ సంస్థలు ట్రంప్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. స్టెంట్స్ వంటి వైద్యపరికరాల ధరలకు పరిమితులు విధించడాన్ని కొన్ని కంపెనీలు తప్పుబట్టాయి. అమెరికా చేసిన కొన్ని విజ్ఞప్తులపై తాము సానుకూలంగా స్పందించినా ఆ దేశం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాణిజ్యమంత్రిత్వశాఖ విచారం ప్రకటించింది. ఇలాంటి విషయాల్లో జాతి ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. జీఎస్పీ రద్దుపై ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు గణేశ కుమార్ గుప్తా మాట్లాడుతూ అమెరికా ఎక్కువ సుంకాలు వసూలు చేయడం వల్ల నష్టపోయే ఎగుమతిదారులను ఇండియా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.