రాష్ట్రంలో మొట్టమొదటి గాడిదల ఫామ్..రైతుకు కాసుల పంట

రాష్ట్రంలో మొట్టమొదటి గాడిదల ఫామ్..రైతుకు కాసుల పంట

వ్యవసాయంతో నష్టాలు రావడంతో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రైతులు కొత్త బిజినెస్ ను ఎన్నుకున్నారు. మిగతావారికి భిన్నంగా గాడిదల ఫామ్ ఏర్పాటు చేశారు. గాడిదల పాల అమ్మకంతో మంచి లాభాలు వస్తాయని రైతులు కుటుంబసభ్యులు అంటున్నారు. 

రాష్ట్రంలో మొదటి గాడిదల ఫామ్

వ్యవసాయం కలిసి రాలేదు.. చేసిన వ్యాపారాలు నష్టాన్ని మిగిల్చాయి. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండకు చెందిన పులిదండ నగేశ్ ఏదైనా కొత్త బిజినెస్ చేయాలని ఆలోచించాడు. కొడుకు అఖిల్ సాయంతో గాడిదల ఫామ్ ను ఏర్పాటు చేశాడు. దేశంలో ఇప్పటివరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోనే గాడిదల ఫామ్ లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇదే మొదటిది. బిజినేపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమానికి దగ్గరలో 28 ఎకరాల పొలాన్ని తండ్రికొడుకులు నగేశ్, అఖిల్ లీజుకు తీసుకున్నారు. ఇందులో 50 గాడిదలను పెంచుతున్నారు.మార్కెట్ లో నాణ్యమైన గాడిద పాలు లీటరుకు రూ.1500 వరకు రేటు పలుకుతోంది.

గాడిదల కోసం డాక్టర్

రాజస్థాన్ నుంచి ఈ గాడిదలను కొనుగోలు చేశారు. ఒక్కోదానికి 65 వేల నుంచి లక్ష రూపాయల వరకు రేటు పెట్టారు. వారం రోజుల్లో మరో 50 గాడిదలు ఇక్కడికి రానున్నాయి. వీటికి రక్షణగా ఆరు ఎకరాల పొలం చుట్టూ ఐదు లక్షలతో కంచె ఏర్పాటు చేశారు. వీటిని చూసుకునేందుకు రెండు కుటుంబాలకు అవసరమైన వసతి కల్పించారు. గాడిదలకు దాణా వేసి.. పాలు పిండేందుకు ప్రత్యేక షెడ్  నిర్మించారు. మరో 20 ఎకరాల భూమిని లీజ్కు తీసుకొని గాడిదలకు అవసరమైన వివిధ రకాల గడ్డిని పెంచుతున్నారు. పాల ఉత్పత్తి..గాడిదల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు పశువుల డాక్టర్ ను  ఏర్పాటు చేశారు.

గాడిదల పాలతో మంచి ఆదాయం

గాడిదల పాలను ఎక్కువగా ఆయుర్వేద మందులకు.. కాస్మోటిక్ సబ్బుల తయారీకి ఉపయోగిస్తారు. వీటిని తయారు చేసే అంతర్జాతీయ కంపెనీలు ఏజెన్సీల ద్వారా గాడిదపాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏజెన్సీలు గాడిద పాలను ఉత్పత్తి చేసే వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటాయి. ఒక గాడిద రోజుకు అర లీటరు నుంచి లీటరున్నర వరకు పాలు ఇస్తోందని నగేశ్ తెలిపారు. ఖర్చులు పోను మంచి ఆదాయం వస్తోందంటున్నారు. 

గాడిద పాలు ఆరోగ్యానికి మంచివి

ఈ ఫామ్ ను చూసేందుకు చుట్టూపక్కల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహిస్తే డెయిరీ ఏర్పాటుకు రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. గాడిద పాలు ఆరోగ్యానికి మంచివంటున్న నగేశ్, అఖిల్ ఈ వ్యాపారంపై మంచి లాభాలు కూడా వస్తాయంటున్నారు.