రిలయన్స్‌‌ వాటా అమ్మనివ్వకండి

రిలయన్స్‌‌ వాటా అమ్మనివ్వకండి

వాటి ఆస్తుల వివరాలు బయటపెట్టించండి

కోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ తన పెట్రోకెమికల్స్ బిజినెస్‌‌లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌‌కోకు అమ్మకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును శుక్రవారం కోరింది. రిలయన్స్‌‌తోపాటు దీని బిజినెస్‌‌ పార్ట్‌‌నర్‌‌ బ్రిటిష్‌‌ గ్యాస్‌‌ (బీజీ)లో వాటాల అమ్మకానికి ముందే వాటి ఆస్తుల వివరాలను వెల్లడించేలా చేయాలని విన్నవించింది. పన్నా–ముక్త అండ్‌‌ తపథి (పీఎంటీ) ప్రొడక్షన్‌‌ షేరింగ్‌‌ కాంట్రాక్టులను ఇవి ఉల్లంఘించాయని తెలిపింది. దీంతో అంతర్జాతీయ కోర్టు తమకు4.5 మిలియన్‌‌ డాలర్ల ఆర్బిట్రేషన్ అవార్డు మంజూరు చేసిందని తెలిపింది. ఈ మొత్తాన్ని ఇవి ఇప్పటి వరకు చెల్లించలేదని ఫిర్యాదు చేసింది.   ఈ రెండు కంపెనీలు డబ్బును సమకూర్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. రిలయన్స్‌‌ తన ఆస్తులను అమ్ముకుంటూపోతే, అవార్డు మొత్తాన్ని ఎలా చెల్లించగలుగుతుందని ప్రశ్నించింది. దీనికి ఇది వరకే 2.88 లక్షల కోట్ల అప్పులు ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. దీనిపై స్పందించిన కోర్టు.. ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌‌ వేయాలని రిలయన్స్‌‌, బీజీలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఫిబ్రవరి ఆరో తేదీకి వాయిదా వేసింది. అప్పులను తగ్గించుకోవడానికి రిలయన్స్‌‌ 15 బిలియన్ డాలర్ల విలువైన వాటాను ఆరామ్‌‌కోకు అమ్ముతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య గత కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ప్రొడక్షన్‌‌ షేరింగ్‌‌ కాంట్రాక్టు రూల్స్‌‌ను ఉల్లంఘించి రిలయన్స్‌‌, బీపీలు విపరీతంగా సంపాదించాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయమై 2010 నుంచి న్యాయపోరాటం చేస్తోంది. వడ్డీతో కలిపి తమకు రూ.30 వేల కోట్లు చెల్లించాలని కోరింది. ఆంధ్రా సముద్రతీరంలోని కేజీ డీ–6 బ్లాక్ నుంచి కూడా రిలయన్స్ అక్రమంగా గ్యాస్‌‌ను వెలికితీసిందని ఆరోపించింది. ఇందుకు పరిహారంగా రెండు బిలియన్ డాలర్ల అవార్డు మంజూరు చేయాలని కోర్టులను కోరింది. పీఎంటీ అర్బిట్రేషన్‌‌ అవార్డుపై తాము కోర్టుకు వెళ్లామని, ఇంకా తుది తీర్పు రాలేదని రిలయన్స్ వాదిస్తోంది.