పండుగ ఖర్చులతో జాగ్రత్త..నెల జీతంలో 30 శాతం కన్నా ఎక్కువ కేటాయించొద్దు : సీఈఓ అదిల్‌‌‌‌‌‌‌‌ శెట్టి

పండుగ ఖర్చులతో జాగ్రత్త..నెల జీతంలో 30 శాతం కన్నా ఎక్కువ కేటాయించొద్దు : సీఈఓ అదిల్‌‌‌‌‌‌‌‌ శెట్టి
  • అనవసర ఖర్చులకు దూరంగా ఉంటేనే మంచిది

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు : పండుగ సీజన్ ఇప్పటికే మొదలయ్యింది. దసరా కూడా వచ్చేసింది. చుట్టాలతో, బంధువులతో కలిసి జరుపుకునే సంబరాలు, వేడుకలు స్టార్టయ్యాయి. ఇలాంటి టైమ్‌‌‌‌‌‌‌‌లో అనవసర ఖర్చులు కూడా జరుగుతుంటాయి. పండుగలు ఆర్థిక భారాన్ని మోపకూడదు. అందుకే శాలరీలో ఎంత మేర పండుగల కోసం కేటాయించాలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు.  నెలవారీ జీతంలో 30 శాతాన్ని అత్యవసరం కాని వస్తువులను (డిస్క్రిషనరీ గూడ్స్‌‌‌‌‌‌‌‌) కొనడానికి  కేటాయించాలని బ్యాంక్‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాట్‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌ సీఈఓ అదిల్‌‌‌‌‌‌‌‌ శెట్టి పేర్కొన్నారు. ఇంత కంటే ఎక్కువ ఖర్చు చేస్తే అత్యవసరం అయ్యే వస్తువులను కొనడానికి ఇబ్బంది పడతారని వెల్లడించారు. 50–30–20 రూల్‌‌‌‌‌‌‌‌ గురించి ఆయన మాట్లాడారు.  

‘ఈ రూల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఒక వ్యక్తి నెల శాలరీలో 50 శాతం  అవసరాల కోసం, 30 శాతం కోరుకున్నవి కొనుక్కోవడానికి, 20 శాతం సేవింగ్స్‌‌‌‌‌‌‌‌కు కేటాయించాలి అని శెట్టి వివరించారు. ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఎలా ఖర్చు చేయాలో ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వెల్త్‌‌‌‌‌‌‌‌ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రివర్ధన్ కుప్పాల వెల్లడించారు. యాన్యువల్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌లో 1–3 శాతాన్ని  ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయించాలని చెప్పారు. ‘ముందుగా ప్లాన్ చేసుకొని, ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌ కోసం డబ్బులు సేవ్ చేసుకుంటే  ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పండుగలు జరుపుకోవచ్చు’ అని ఆయన వివరించారు. 

ఖర్చులపై లిమిట్‌

ఎడాపెడా ఖర్చులు చేయొద్దని  ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌లు వార్నింగ్ ఇస్తున్నారు. ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌ కోసం  యాన్యువల్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌లో 1–3 శాతం కేటాయించినప్పటికీ ఇందులో కేవలం ఒక శాతం మాత్రమే ఖర్చులు చేయాలని  చక్రివర్ధన్ పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గుతాయని, ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఉండవని వివరించారు. అంతేకాకుండా అప్పులు చేసి మరీ పండుగలు జరుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. ‘ముందుగానే పొదుపు చేయడం, జాగ్రత్తగా ఖర్చులు చేయడంపై మీ ఫోకస్ ఉండాలి.

క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డులపై కాదు’ అని చక్రివర్ధన్ వెల్లడించారు. ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ‘మాల్‌‌‌‌‌‌‌‌ లేదా మార్కెట్లకు వెళ్లినప్పుడు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి ఆకర్షితులవుతారు.  చూడడానికి చాలా బాగున్నా  మీకు పెద్దగా అవసరం లేని వస్తువులను కొనడానికి ఎగబడకండి. అందుకే  మీకు అవసరమయ్యేవి కొనాలి. కావాలనుకున్నవి కాదు’ అని వివరించారు.

ఈ రూల్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఫాలో కావాలి..

1)  ఎక్కువ కాలం మన్నేవి, అవసరమనుకున్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉదాహరణకు  ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ వస్తువులు కొనడం వలన చాలా వర్క్‌‌‌‌‌‌‌‌ను సులభంగా చేసుకోవచ్చు. మరోవైపు లగ్జరీ బ్యాగ్‌‌‌‌‌‌‌‌లు వంటి వాటి వలన పెద్దగా అవసరం ఉండదు.
2) చాలా మంది అనవసరమైన వస్తువులను కొనడానికి ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ఇతరులు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఖర్చు పెట్టొచ్చని అనుకోవద్దు. అలా చేయడం మంచి పద్ధతి కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
3) సౌకర్యంగా ఉండి, మంచి క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లు, ఆఫర్లు ఇచ్చే  డిజిటల్ పేమెంట్స్ విధానాలను వాడుకోవాలి.