గృహజ్యోతికి అర్హతలున్నోళ్లు కరెంట్​ బిల్లు కట్టొద్దు: సీఎం భట్టి

గృహజ్యోతికి అర్హతలున్నోళ్లు కరెంట్​ బిల్లు కట్టొద్దు: సీఎం భట్టి

ప్రజాపాలన ఆఫీసర్​ను కలిసి ‘జీరో బిల్లు’ పొందొచ్చు: డిప్యూటీ సీఎం భట్టి
స్కీమ్​పై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచన 

    వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం.. కరెంట్​ చార్జీలు పెంచం.. గత  ప్రభుత్వం కంటే ఎక్కువ విద్యుత్​ ఇస్తున్నం
    16,500 మెగావాట్ల పీక్‌‌ డిమాండ్‌‌ వచ్చినా సరఫరాకు రెడీ
    త్వరలో 5 ఎకరాల లోపు వాళ్లకు రైతుభరోసా సాయం
    ఈ నెల 12 నుంచి మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉండి,  అప్లయ్​ చేసుకున్న వాళ్లు కరెంట్​ బిల్లు వచ్చినా కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటికే అర్హులకు జీరో బిల్లులు (ఫ్రీ కరెంట్) ఇస్తున్నామని, ఎవరైనా అర్హులకు అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. శనివారం సెక్రటేరియెట్‌‌లో మీడియాతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. 

గృహజ్యోతి స్కీమ్​పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని అన్నారు. ‘‘గృహజ్యోతి  పథకం కింద 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్​ అందజేస్తున్నం. ప్రజాపాలనలో సరైన వివరాలతో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇది వర్తిస్తుంది. అన్నీ సరిగ్గా ఉండి, ఒక వేళ కరెంట్​ బిల్లు వస్తే.. అలాంటి వాళ్లు ఎంపీడీవో ఆఫీసులో ప్రజాపాల‌‌న ఆఫీసర్​ను సంప్రదించాలి. తెల్ల రేషన్ కార్డు, విద్యుత్తు స‌‌ర్వీసు నెంబ‌‌ర్ ను స‌‌రిగ్గా రాసి ఎంపీడీవో ఆఫీసులో వివరాలు సమర్పించి.. జీరో బిల్లు పొందాలి” అని డిప్యూటీ సీఎం సూచించారు. గృహజ్యోతి స్కీమ్​ కింద 200 యూనిట్ల వ‌‌ర‌‌కు ఉచితంగా  కరెంట్​ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు  40 లక్షల 33 వేల702 కుటుంబాలు గృహ‌‌జ్యోతి పథకం ద్వారా జీరో బిల్లులు పొందాయని ఆయన వెల్లడించారు. 

రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా..

రాష్ట్రంలో శుక్రవారం అత్యధికంగా 15,623 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌‌ వచ్చిందని, దీనికి తగ్గట్టుగా రికార్డు స్థాయిలో 303 మిలియన్‌‌ యూనిట్ల విద్యుత్‌‌ స‌‌ర‌‌ఫ‌‌రా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రానున్న వేస‌‌విలో  పీక్‌‌ డిమాండ్‌‌ 16,500 మెగావాట్లు వచ్చినా దానికి తగ్గట్టు కరెంట్‌‌ స‌‌ర‌‌ఫ‌‌రా చేయ‌‌డానికి ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉందని వెల్లడించారు. ‘‘ఎన్నిక‌‌ల టైమ్‌‌లో కాంగ్రెస్ కావాలా... కరెంట్ కావాలా.. కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండ‌‌దు.. అంటూ  తప్పుడు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయ‌‌కులు ఇప్పుడు ఏం స‌‌మాధానం చెప్తారు? కాంగ్రెస్ అధికారంలోకి వ‌‌చ్చిన  మూడు నెలల్లోనే ఎక్కువ విద్యుత్తును స‌‌ర‌‌ఫరా చేశాం.. కరెంటు స‌‌ర‌‌ఫ‌‌రా విష‌‌యంలో బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. ప్రజలు నిశ్చింతగా ఉండాలి. డిమాండ్‌‌కు తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

 వ్యవసాయ మోటార్లకు ఎట్టి ప‌‌రిస్థితిలో మీట‌‌ర్లు బిగించ‌‌బోమ‌‌ని ముందే చెప్పాం” అని పేర్కొన్నారు. అర్హులందరికీ గృహజ్యోతి వర్తిస్తుందని, విద్యుత్ చార్జీలు పెంచబోమని ఆయన అన్నారు. 2022 డిసెంబ‌‌ర్‌‌లో అప్పటి బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం 200 మిలియ‌‌న్ యూనిట్ల విద్యుత్తును స‌‌ర‌‌ఫ‌‌రా చేయ‌‌గా 2023 డిసెంబ‌‌ర్‌‌లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం 207.07 మిలియ‌‌న్ యూనిట్లు స‌‌ర‌‌ఫ‌‌రా చేసిందని వెల్లడించారు. ‘‘2023 జ‌‌న‌‌వ‌‌రిలో అప్పటి బీఆర్​ఎస్​ సర్కార్​ 230.54 మిలియ‌‌న్ యూనిట్లు స‌‌ర‌‌ఫ‌‌రా చేయ‌‌గా.. 2024 జ‌‌న‌‌వ‌‌రిలో 243.12 మిలియ‌‌న్ యూనిట్లు స‌‌ర‌‌ఫ‌‌రా చేశాం. 2023 ఫిబ్రవ‌‌రి నెల‌‌లో 263.38 మిలియ‌‌న్ యూనిట్లు స‌‌ర‌‌ఫ‌‌రా చేయ‌‌గా.. 2024 ఫిబ్రవ‌‌రిలో 272.85 మిలియ‌‌న్ యూనిట్లు స‌‌ర‌‌ఫరా చేశాం. 2023 మార్చి నెల‌‌లో 289.78 మిలియ‌‌న్ యూనిట్లు స‌‌ర‌‌ఫ‌‌రా చేయ‌‌గా.. 2024 మార్చిలో 297.21 మిలియ‌‌న్ యూనిట్ల విద్యుత్తును స‌‌ర‌‌ఫ‌‌రా చేశాం. రానున్న ఏప్రిల్‌‌, మే నెల‌‌లో విద్యుత్తు డిమాండ్ మ‌‌రింత పెరుగుతుంది. దీనికి అనుగుణంగా విద్యుత్తును స‌‌ర‌‌ఫ‌‌రా చేయ‌‌డానికి  ప్రభుత్వం రెడీగా ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. 

గ్రీన్‌‌ ఎనర్జీలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతం

గ్రీన్ ఎన‌‌ర్జీ  జనరేషన్‌‌లో తెలంగాణను మోడ‌‌ల్ గా నిలుపుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, త్వరలోనే పాలసీని తీసుకువస్తామని తెలిపారు. సోలార్‌‌, విండ్‌‌, హైడ‌‌ల్‌‌, పంప్డ్ స్టోరేజీ, సింగ‌‌రేణి కాల‌‌రీస్‌‌లో నిరుప‌‌యోగంగా ఉన్న బొగ్గు బ్లాక్‌‌లు, ఓవర్‌‌ బర్డెన్‌‌, ఓపెన్‌‌ కాస్ట్‌‌ల‌‌లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయ‌‌డానికి ప్రణాళిక‌‌లు చేస్తున్నామని వివరించారు. భారీ, మ‌‌ధ్య త‌‌ర‌‌హా సాగునీటి రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ను అందుబాటులోకి తెస్తామని, దాని ద్వారా మ‌‌త్స్య సంప‌‌ద‌‌కు ఎలాంటి న‌‌ష్టం ఉండ‌‌దని చెప్పారు. ఇరిగేషన్ మెయిన్‌‌ కాలువలు,  కాలువల ప‌‌క్కన ఉన్న బండ్స్‌‌పైనా సోలార్ పవర్ ఉత్పత్తి చేయ‌‌డానికి స్టడీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

కొండలు, గుట్టల‌‌కు రైతు బంధు ఇవ్వం

కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వొద్దని నిర్ణయించుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ‘‘గ‌‌త ప్రభుత్వం కొండలు, గుట్టలు ఉన్న బడాబాబులకు రైతుబంధు పేరిట రూ.20 వేల కోట్లకు పైగా ఇచ్చిన‌‌ట్టు ఇటీవ‌‌ల పేప‌‌ర్లలో చదివిన. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు భరోసా (రైతుబంధు) ఇస్తున్నాం. ఇప్పటికే ఒకటి, రెండు, మూడు ఎకరాలలోపు వ్యవసాయ భూములున్న రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాం.  ప్రస్తుతం 4 ఎకరాల లోపు వాళ్లకు ఇస్తున్నాం. త్వరలో 5 ఎకరాల లోపు వాళ్లకు ఇస్తాం. వ్యవసాయం చేసే వాళ్లకే పెట్టుబడి సాయం అందిస్తాం” అని పేర్కొన్నారు.  

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్‌‌కు లేదు

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన‌‌ప్పటికీ వాటిని అధిగ‌‌మించి 6 గ్యారంటీల‌‌ను క‌‌చ్చితంగా అమ‌‌లు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీల‌‌ను అమ‌‌లు చేయ‌‌ని బీఆర్ఎస్‌‌కు కాంగ్రెస్‌‌ను విమ‌‌ర్శించే అర్హత లేదు. కాంగ్రెస్ ప్రక‌‌టించిన గ్యారంటీల‌‌కు బ‌‌డ్జెట్ లో నిధులు కూడా కేటాయించాం. గ‌‌త బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం 7ల‌‌క్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక వ్యవ‌‌స్థను చిన్నాభిన్నం చేసినా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం నిబ‌‌ద్ధతతో ఆర్థికవ్యవ‌‌స్థను గాడిలోకి తీసుకువ‌‌చ్చి 3 లక్షల 69 వేల 200 మంది రెగ్యులర్‌‌ ఉద్యోగుల‌‌కు, 2 లక్షల 88 వేల పెన్షనర్లకు మార్చి ఫస్ట్‌‌కే సాలరీలు ఇచ్చింది. ఇది కాంగ్రెస్‌‌ ప్రభుత్వ ఆర్థిక క్రమ‌‌శిక్షణ‌‌కు నిద‌‌ర్శనం” అని చెప్పారు. గత ప్రభుత్వం ఆశ, అంగన్ వాడీ కార్యకర్తలకు, మ‌‌ధ్యాహ్న భోజ‌‌నం ఆయాలకు నెలల త‌‌ర‌‌బ‌‌డి జీతాలు ఇవ్వలేదని, తాము ప్రతినెల వారికి జీతాలు ఇవ్వాల‌‌ని ప్రాధాన్యంగా పెట్టుకొని చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు.

12న ఇందిరా క్రాంతి స్కీమ్​ ప్రారంభం

రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం పదేండ్లు నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ఈ నెల 12న ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గుర్తుచేశారు. కాళేశ్వరం, కొన్ని విద్యుత్ ప్రాజెక్టులను తాము నిరర్థక ఆస్తులుగా వదిలేయమని తెలిపారు.