ఆ పార్టీ మంత్రులు, నాయకుల మాటలు నమ్మొద్దు: యడ్యూరప్ప

ఆ పార్టీ మంత్రులు, నాయకుల మాటలు నమ్మొద్దు: యడ్యూరప్ప

జహీరాబాద్/హైదరాబాద్, వెలుగు: కర్నాటకలోని కాంగ్రెస్​ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప విమర్శించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రైతులను పట్టించుకోకుండా ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన బీజేపీ సభలో, హైదరాబాద్ లోని బీజేపీ మీడియా సెంటర్ లో యడ్యూరప్ప  మాట్లాడారు.

కర్నాటక కు చెందిన కాంగ్రెస్ మంత్రులు, నాయకులు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నారని.. వారి మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దన్నారు. కర్నాటకలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక చేతులేత్తేశారని విమర్శించారు. కర్నాటకలో యువనిధి, గృహ లక్ష్మీ, గృహ జ్యోతి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ వంటి గ్యారంటీలను కాంగ్రెస్ ఇచ్చిందని..వాటిలో ఒక్కటి కూడా  అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక కర్నాటక ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.