బ్రేకప్​తో కుంగిపోకూడదు

బ్రేకప్​తో కుంగిపోకూడదు

కలిసి ఉన్నన్ని రోజులు ప్రేమ మధురంగానే ఉంటుంది. కానీ, విడిపోయాకే అది  కఠినంగా మారుతుంది.  ఇది ప్రేమికులను ఎంతో బాధలోకి నెట్టేస్తుంది. విడిపోవడానికి ఎన్నో కారణాలున్నా బ్రేకప్​ బాధనే మిగులు స్తుంది.  కొందరిలో ఆ బాధ కొన్ని రోజులే ఉంటుంది. ఇంకొందరిలో మాత్రం ఏండ్లు గడిచినా ఆ బాధ పోదు. పాత సంగతులను తలుచుకుంటూ కుంగిపోతారు. జీవితం నాశనమైపోయింది అనుకుంటారు. కానీ, అది చాలా తప్పు అంటున్నారు సైకాలజిస్టులు. కొన్ని టిప్స్​ పాటిస్తే ప్రేమగాయాల నుంచి బయటపడొచ్చు అని కూడా చెప్తున్నారు. 

ఎక్కువ ఆలోచించొద్దు
కలకాలం కలిసి ఉంటారని ఎక్కువ ఊహిం చుకున్న జంట విడిపోతే  దాని ఎఫెక్ట్​ ఇద్దరి మీదా ఉంటుంది.  బ్రేకప్​ గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. అలా ఆలోచించడం అంటే స్ట్రెస్​ను పెంచుకోవడమే. అది జీవితాన్ని గందరగోళంలోకి నెడుతుంది.  అసలు ప్రాబ్లం ఏంటో అర్థమయ్యాక, ఫెయిల్​ అయిన ప్రేమ గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్లడమే బెటర్​ అంటున్నారు. 

తొలిప్రేమ అయితే   
ఫస్ట్​లవ్​కు ప్రయారిటీ ఉండటం సహజం.  అలాంటి లవ్​ కూడా బ్రేకప్​ అయితే... రోజులు గడుస్తున్నా కూడా దాని పెయిన్​ వెంటాడుతుంది.  కానీ, ఆ లవ్​  మళ్లీ తిరిగి రాదని తెలిశాక  దాన్ని జ్ఞాపకంగా చూడాలి. అంతేకానీ, ఏడుస్తూ కూర్చుంటే మిగిలేవి కష్టాలే తప్ప.. ప్రేమ కాదు. 

పని చేసుకోవాలి 
బ్రేకప్​ అయిన లవ్​ గురించే ఆలోచిస్తూ.. తమ గురించి తాము ఆలోచించుకోవడం మానేస్తే కుదరదు. ప్రేమ తాలూకు గాయాలకు సరైన ఆయింట్మెంట్..  ‘ఎవరి పని  వాళ్లు  చేసుకుంటూ పోవడమే’.  మనసులో ప్రేమ బాధను మోస్తుంటే కంట్లో నీళ్లు నిండుతాయేమో! కానీ, కడుపు నిండదు.

ఎలిమినేట్​ 
కొత్త ఆలోచనలే మైండ్​ను ఫ్రెష్​గా ఉంచుతాయి. తిరిగి రాదనుకున్న ప్రేమ గురించి ఆలోచిస్తే మైండ్​ ఆ విషయాల చుట్టూనే తిరుగుతుంది.  అందుకే ఆ గుర్తులేవైనా ఉంటే మైండ్​ నుంచి తీసేయాలి.  కొత్త విషయాల మీద ఫోకస్​ చేయాలి. పోయిన ప్రేమ గురించి ఆలోచించే కంటే...  ఫ్యూచర్​ గురించి ఆలోచించడం బెటర్​.

రాసుకోవాలి 
 సరైన ఆలోచనలను పేపర్​ మీద రాసుకోవాలి. అదే మైండ్​ మ్యాపింగ్​. ఏఏ పనులు చేయాలి? ఇది వరకు చేసిన తప్పులేంటి? చేయకూడని పనులేంటి? లాంటివి ఆలోచించి క్లియర్​గా మ్యాపింగ్​ చేసుకోవాలి. అప్పుడు  ఎవరి మీద వాళ్లకు కాన్ఫిడెన్స్​ వస్తుంది. ‘‘జీవితంలో ఏమి కోల్పోయినా.. కష్టపడి తిరిగి సాధించొచ్చు. కానీ జీవితాన్నే  కోల్పోయే పరిస్థితులు ఈ బ్రేకప్​ వల్ల తెచ్చుకోవద్దు” అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.