తమిళనాడుకు కావేరి నీళ్లు ఇవ్వొద్దు: కర్నాటక జల సంరక్షణ సమితి

తమిళనాడుకు కావేరి నీళ్లు ఇవ్వొద్దు: కర్నాటక జల సంరక్షణ సమితి
  • బెంగళూరు బంద్ ప్రశాంతం

బెంగళూరు: తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల చేయాలన్న కావేరి వాటర్ మేనేజ్​మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలను నిరసిస్తూ ‘కర్నాటక జల సంరక్షణ సమితి’ మంగళవారం బెంగళూరు బంద్ చేపట్టింది. అయితే, బెంగళూరు బంద్​కు పాక్షిక స్పందన లభించింది. పబ్లిక్ సర్వీసులన్నీ ఓపెన్​గానే ఉన్నాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల దాకా బంద్ నిర్వహించారు. కర్నాటక జల సంరక్షణ సమితి నేతృత్వంలో పలు రైతు సంఘాల నాయకులు మైసూర్ బ్యాంక్ సర్కిల్​లో నిరసన తెలిపారు. టౌన్ హాల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని భావించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

ఇక్కడి రైతుల కడుపుకొట్టొద్దు

ఫ్రీడమ్ పార్క్ వద్ద పలువురు రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. వారితో ట్రాన్స్​పోర్ట్ మినిస్టర్ రామలింగా రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లీడర్లు మంత్రికి ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కావేరి నీళ్ల విడుదలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. తర్వాత పలు రైతు సంఘాల లీడర్లు మీడియాతో మాట్లాడారు. తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల చేయొద్దన్నారు. రాష్ట్ర రైతుల పొట్ట కొట్టొద్దని కోరారు.  కర్నాటక అనుకూల రైతు సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్​కు పిలుపునిచ్చాయి.

రాజకీయం చేస్తున్నారు: సిద్ధరామయ్య

కావేరి జలాల ఇష్యూను బీజేపీ, జేడీఎస్ లీడర్లు రాజకీయం చేస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. వారికి ప్రజల, రైతుల సమస్యలు పట్టవని మండిపడ్డారు. తమిళనాడుతో నీటి పంపకాల విషయంలో ఇబ్బందులు తలెత్తొద్దనే కావేరి నదిపై మేకదాతు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని కోరుతున్నామన్నారు. ఈ సమస్యకు ఇదొక్కటే పరిష్కారమని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.