పాక్, జర్మనీలపై కేంద్రం ఫైర్

పాక్, జర్మనీలపై కేంద్రం ఫైర్

న్యూఢిల్లీ: సొంత ప్రయోజనాల కోసం టెర్రరిజాన్ని ఇగ్నోర్ చేస్తే శాంతికి ముప్పు తప్పదని పాకిస్తాన్, జర్మనీలను ఇండియా హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఇటీవల పాకిస్తాన్, జర్మనీ విదేశాంగ మంత్రులు బిలావల్ భుట్టో, అనలీనా బీర్బాక్ సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చేసిన కామెంట్లపై మండిపడింది. క్రాస్ బార్డర్ టెర్రరిజం వల్ల కలిగే ప్రమాదాన్ని పాక్, జర్మనీ గుర్తించడంలేదంటూ మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తప్పుపట్టారు.

జమ్మూకాశ్మీర్ దశాబ్దాలుగా ఇంటర్నేషనల్ టెర్రరిజం వల్ల బాధిత ప్రాంతంగా మారిందన్నారు. దేశంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో విదేశీ పౌరులు కూడా బాధితులుగా మారారన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. టెర్రరిజం పట్ల ఇండియా ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని ఇటీవల యూఎన్​ జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చిచెప్పిన విషయాన్ని కూడా బాగ్చి గుర్తుచేశారు.