13 గ్రామాలతో భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేయాలి

13 గ్రామాలతో  భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేయాలి

దుబ్బాక, వెలుగు:  భూంపల్లి ఎక్స్​ రోడ్డును కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని తానే మొదటగా సీఎం కేసీఆర్ కు లేఖ ఇచ్చానని, మండల ఏర్పాటు పై రాజకీయాలు చేయొద్దని జిల్లా టీఆర్ఎస్  లీడర్లకు ఎమ్మెల్యే రఘునందన్​రావు కోరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 13 గ్రామాలతో కూడిన భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్​కు సిద్దిపేట కలెక్టరేట్, మల్లన్న సాగర్​ ప్రాజెక్ట్​ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వినతిపత్రాలు ఇచ్చానని,  తాను ఇచ్చిన మండల ఏర్పాటుపై సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం జిల్లా అధికారుల నుంచి రిపోర్టులు తీసుకోవడంతో పాటు మిరుదొడ్డి, దుబ్బాక గ్రామాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులను హైదరాబాద్​కు పిలిపించుకుని  మండల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారని చెప్పారు. టీఆర్ఎస్​లీడర్లు  నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టించొదని సూచించారు. మండల ఏర్పాటుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఇటీవల కొత్త మండలాల ప్రకటనలో భూంపల్లి పేరు కూడా వస్తుందనుకున్నామని, కానీ ప్రకటించకుండా ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బ తీశారని రఘునందన్ ​ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంపై వివక్ష లేకుంటే సీఎం ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే గా ఉన్న తనకు ఎక్కడ పేరు వస్తుందోనన్న దురుద్దేశంతోనే ప్రకటించలేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి  న్యాయంగా రావాల్సిన నిధుల కోసం దరఖాస్తు  ఇచ్చి దండం పెట్టి  అడుగుతామని,  ఇవ్వకుంటే గుప్తలు పట్టుకుని బరాబర్​తీసుకుంటామని హెచ్చరించారు. 

ప్రెస్​ క్లబ్​కు స్థలాన్ని కేటాయించాలి
దుబ్బాక, వెలుగు: నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ప్రెస్​ క్లబ్​కు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ జర్నలిస్టులు ఆదివారం దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డికి కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు  జర్నలిస్టులు ఇంగు శివకుమార్​, కాల్వ లింగం, అంబటి వెంకట్​ గౌడ్​, గుండెళ్లి లక్ష్మారెడ్డి, రాజమల్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ బర్త్​డేను పురస్కరించుకుని మున్సిపల్​ ఆవరణలో కేక్​ను కట్ చేశారు.