మాట తప్పకుంటే బీజేపీ అభ్యర్థే సీఎంగా ఉండేవారు

మాట తప్పకుంటే బీజేపీ అభ్యర్థే సీఎంగా ఉండేవారు

మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్టును ఆరే కాలనీలోనే నిర్మించాలన్న సీఎం ఏక్ నాథ్ షిండే నిర్ణయంపై  మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.  తన మీద ఉన్న కోపాన్ని ముంబై ప్రజలపై చూపించొద్దన్నారు. మెట్రో షెడ్ ప్రతిపాదనను మార్చొద్దని ఆయన సూచించారు. ముంబై పర్యావరణంతో ఆటలాడొద్దని ఉద్దవ్ విజ్ఞప్తి చేశారు. మెట్రోకార్‌ షెడ్‌ ప్రాజెక్టు ఆరేలో కాకుండా కంజుర్‌మార్గ్‌లోనే ఉంచాలని  ఆయన కోరారు.  కంజుర్‌మార్గ్‌ ప్రైవేటు స్థలం కాదన్న ఉద్దవ్.. ఆరేను పర్యావరణవేత్తలతో కలిసి రిజర్వు ఫారెస్ట్‌గా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ అడవిలో అనేక వణ్యప్రాణులు ఉన్నాయన్నారు. 

2019 ఎన్నికల సమయంలో  ఇచ్చిన మాటను కేంద్ర మంత్రి అమిత్ షా నిలబెట్టుకోలేదని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.  శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఎన్నికల ముందు ఒప్పందం చేసుకున్నామని ఉద్దవ్ గుర్తు చేశారు. అయితే ఎన్నికలయ్యాక మాట తప్పారని ఉద్దవ్ గుర్తు చేశారు.  గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే మహా వికాస్ అఘాడీ పుట్టేదే కాదన్నారు.  ఎన్నికల సమయంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందం కొనసాగి ఉంటే ..ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన వ్యక్తే ఉండేవారని చెప్పుకొచ్చారు.