
- అత్యవసర విచారణ అక్కర్లేదన్న సుప్రీం
న్యూఢిల్లీ: హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫైల్ అయిన పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాటిపై తగిన సమయంలో విచారణ చేపడతామని గురువారం తెలిపింది. ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం హిజాబ్ తప్పనిసరి కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేధిస్తూ కర్నాటక సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది విద్యార్థులు సుప్రీంకు వెళ్లారు. ఆ పిటిషన్లను వెంటనే లిస్టింగ్ చేసి, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయని, హిజాబ్ వేసుకుంటే విద్యాసంస్థల్లోకి రానివ్వడం లేదని వాదించారు. స్పందించిన సుప్రీం చీఫ్‌జస్టిస్ ఎన్వీ రమణ ‘‘హిజాబ్ కు పరీక్షలకు సంబంధం లేదు. ఈ సమస్యను సంచలనం చేయొద్దు” అని సూచించారు. కాగా, ఈ కేసులో ఇంతకుముందు కూడా అత్యవసర విచారణకు సుప్రీం నో చెప్పింది.