నేను చెప్పేవరకూ ఆధార్ కార్డు చూపించొద్దు

నేను చెప్పేవరకూ ఆధార్ కార్డు చూపించొద్దు

సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలను బ్లాక్ మ్యాజిక్‌తో పోల్చారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (జాతీయ జనాభా రిజిస్టర్)కు సహకరించొద్దని మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. తానే నేరుగా చెప్పే వరకు ఏ ఒక్కరూ ఆధార్ కార్డు సహా ఏ డాక్యుమెంట్‌నూ చూపించొద్దని సూచించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  నదియాలో మంగళవారం ఆమె ఓ సభలో మాట్లాడారు. ఎన్నార్సీ భయంతో అస్సాంలో 100 మందికి పైగా మరణించారని, పశ్చిమ బెంగాల్‌లో 31 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారామె. రాష్ట్రంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అధికారులు వచ్చి ఏవైనా వివరాలు అడిగితే చెప్పవద్దని ప్రజల్ని కోరారు మమత. కుటుంబం గురించి తెలియజేసే వివరాలను కానీ, ఆధార్ కార్డు గానీ అడిగితే చూపించవద్దన్నారు.

తన తల్లి బర్త్ సర్టిఫికేట్ లేదని, తనను భారత్ నుంచి బయటకు పంపుతారా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మమతా బెనర్జీ. సీఏఏపై కొన్ని పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, ఈ కొత్త చట్టంతో పౌరసత్వం రాదని, భారత పౌరులను కూడా విదేశీయులుగా మారుస్తుందని ఆరోపించారు. ప్రధాని మోడీ లాగా తాను ఎన్నికలప్పుడు మాత్రమే చౌకీదార్ అని చెప్పుకోనని, ఏడాది పొడవునా ప్రజల క్షేమం గురించి పని చేస్తానని చెప్పారామె.