ఎన్నికల్లో ఓడిపోయామన్న..ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపించకండి: మోదీ

ఎన్నికల్లో ఓడిపోయామన్న..ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపించకండి: మోదీ
  • నెగిటివిటీని పక్కనపెట్టేసి సహకరించాలి: మోదీ
  • బిల్లుల చర్చలకు సహకరించాలి
  • పార్లమెంట్​ వింటర్ సెషన్​ను ఉపయోగించుకోండి
  • తొమ్మిదేండ్లు తిట్టింది చాలని ప్రతిపక్షాలకు ప్రధాని హితవు

న్యూఢిల్లీ :  మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్, కోపం పార్లమెంట్​లో చూపించొద్దని ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నెగిటివిటీని పక్కనపెట్టేసి ముందుకు సాగాలని హితవు పలికారు. శీతాకాల సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘రాజస్థాన్, చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​లో ఓడిపోయామన్న కోపం ఇక్కడి చూపించకండి. వింటర్ సెషన్​ను చర్చల కోసం ఉపయోగించుకోండి. మీకు ఇదొక మంచి అవకాశం. తొమ్మిదేండ్ల నుంచి తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో అయినా పాజిటివ్​గా ఉండండి. ఓటమి నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగాలి. ప్రతికూల ధోరణి వదిలేయాలి”అని ప్రతిపక్షాలకు మోదీ సూచించారు.

నెగిటివిటీని తిరస్కరించారు

‘‘దేశ ప్రజలు నెగిటివిటీని తిరస్కరించారు. ఎప్పుడు సెషన్స్ ప్రారంభమైనా అపోజిషన్ లో ఉన్న ఫ్రెండ్స్​తో మాట్లాడుతూ ఉంటాం. వారి సహకారం కూడా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్న.. వింటర్ పార్లమెంట్ సెషన్ సజావుగా సాగేందుకు సహకరించాలి. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి దేశంలో.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. దేశ పునాదులను మరింత బలోపేతం చేయడానికి ఇదొక వేదిక. బిల్లులపై సమగ్ర చర్చకు మేము సిద్ధం. అందుకు అనుగుణంగా ప్రతిపక్షాలు సిద్ధం కావాలి”అని మోదీ అన్నారు. అపోజిషన్ లీడర్లకు తాను మంచి సలహాలే ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు.

పోస్ట్​ ఆఫీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పోస్ట్ ఆఫీస్ సవరణ బిల్లు–2023ని రాజ్యసభ సోమవారం ఆమోదించింది. 125 ఏండ్ల నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టానికి సవరణ చేస్తున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. స్టేట్ సెక్యూరిటీ, ఫారిన్ స్టేట్స్​తో పాటు ఫ్రెండ్లీ రిలేషన్​షిప్ కొనసాగించేందుకు చట్టాన్ని సవరిస్తున్నారు. పబ్లిక్ ఆర్డర్, ఎమర్జెన్సీ, పబ్లిక్ సేఫ్టీ లేదా ఏదైనా అనుకోని ఘటన సంభవించినప్పుడు పార్సిల్​లోని ఏ వస్తువు అయినా తెరవడానికి, సీజ్ చేయడానికి, ట్రాన్స్ పోర్టు ఆపేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. న్యాయవాద వృత్తిని ఒకే చట్టం ద్వారా క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో అడ్వకేట్ సవరణ బిల్లు తీసుకొచ్చారు.  కేంద్ర న్యాయశాఖ మంత్రి  లోక్​సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో దళా రుల పాత్రకు ఈ బిల్లు ఫుల్​స్టాప్ పెడుతుందని వివరించారు.

రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ ఎత్తివేత

‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తన నివేదిక సమర్పించింది. మహువాను సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే, ఈ నివేదిక మాత్రం సోమవారం నాటి ఎజెండాలో లిస్ట్ చేయలేదు. ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్​ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు.