డీపీఓ ఆఫీసులో దోరేపల్లి సర్పంచ్​ ఆందోళన

డీపీఓ ఆఫీసులో  దోరేపల్లి సర్పంచ్​ ఆందోళన

నారాయణపేట, వెలుగు :  రూ.18 లక్షలు అప్పు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఆ బిల్లులు ఇవ్వకుండా సతాయిస్తున్నారని, వెంటనే పైసలివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నారాయణపేట జిల్లా మద్దూర్​ మండలం దోరేపల్లి సర్పంచ్​ చంద్రకళ డీపీఓ ఆఫీసులో ఆందోళన చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. భర్తతో కలిసి బైఠాయించిన సర్పంచ్​ మాట్లాడుతూ పనులు చేసి ఏడాదిన్నరవుతున్నదని, ఎప్పుడూ ఏదో వంకతో అధికారులు తప్పించుకుంటున్నారన్నారు. అన్నీ రెడీ చేస్తే 4 నెలలు ట్రెజరీ ఫ్రీజింగ్​అని ఆపారని, తరువాత చెక్​పై సంతకం చేయకుండా ఉప సర్పంచ్​ రాములమ్మ తిప్పలు పెట్టిందన్నారు. తాను కాంగ్రెస్ ​సర్పంచ్​అయినందున ఎమ్మెల్యే కావాలనే ఇలా చేయిస్తున్నాడని ఆరోపించారు. తనను టీఆర్​ఎస్​లో చేరాలని బెదిరిస్తున్నారన్నారు. సస్పెండ్​చేస్తామని పనులు చేయించారని, బిల్లులు అడిగితే వాయిదాలు వేస్తున్నారన్నారు.

సంతకాలు చేయకపోవడంతో..

ఉపసర్పంచ్​ చెక్​లపై సంతకాలు చేయకపోవడంతో కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తే అడిషనల్​కలెక్టర్​కు పంపించి విచారణ చేయిస్తానని చెప్పారని, ఇంతవరకూ చేసిందేమీ లేదన్నారు. బిల్లులు ఇచ్చే వరకు బయటికి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. డీపీఓ మురళి బయట ఉండడంతో చంద్రకళతో ఫోన్​లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా సర్పంచ్​వినలేదు. కొద్దిసేపటి తర్వాత డీపీఓ రాగా సర్పంచ్, ఆమె భర్త ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఉపసర్పంచ్​పై విచారణ చేయాలని మద్దూర్​ ఎంపీడీఓను ఆదేశించామని, రిపోర్టు రావాల్సి ఉందన్నారు. అయితే ఆయన రిపోర్ట్ ​పంపానని చెప్పాడని, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని, కాళ్లు మొక్కుతామని డీపీఓ వెంటపడ్డారు. డీఎల్​పీఓను మంగళవారం విచారణకు పంపిస్తామని, రిపోర్టు వచ్చాక బిల్లులు పాస్​ చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి పంపించారు.