గద్వాల జిల్లాలో ఇండ్లు పూర్తయినా పంచుతలే

గద్వాల జిల్లాలో ఇండ్లు పూర్తయినా పంచుతలే
  • 2,500 ఇండ్లకుగాను 45 ఇండ్లు పూర్తి
  • గోన్​పాడు వద్ద  ఓపెనింగ్ కి ముందే  ఇండ్లు పడావు 
  • అప్లికేషన్లు తీసుకొని మరిచిపోయిన్రంటున్న  జిల్లా వాసులు
  • ఎనిమిదేండ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపాటు

గద్వాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆత్మగౌరవ చిహ్నంగా చెప్పుకుంటున్న డబుల్​బెడ్​ రూం ఇండ్లు గద్వాల జిల్లాలో పందులకు ఆవాసంగా మారుతున్నాయి. నిర్మాణం పూర్తయిన ఇండ్ల చుట్టూ కంప చెట్లు మొలిచి  అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పగిలిన కిటికీల అద్దాలు.. విరిగిపోయిన డోర్లు, నెర్రెలు వారిన గోడలు, ధ్వంసమైన డ్రైనేజీ పైపులు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రారంభం కాక ముందే వాటిలో ఉండలేని పరిస్థితి నెలకొన్నది. ఇంత జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు డబుల్​ఇండ్ల పంపిణీ ఊసే ఎత్తడం లేదు. అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారని, తర్వాత సప్పుడు చేస్తలేరని జిల్లా వాసులు వాపోతున్నారు. గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ​గద్వాల మీటింగ్​లో  జిల్లాకు 2,500 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు.  

2,500 కు 45 పూర్తి..

జిల్లాలోని గద్వాల నియోజకవర్గానికి 1,300 , అలంపూర్ నియోజకవర్గానికి 1,200 డబుల్​బెడ్​రూం ఇండ్లను  రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో ఇప్పటి వరకు 45 ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. గద్వాల టౌన్ దగ్గరలోని దర్గా  వద్ద 560 చివరి దశలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ లెక్కన 10 శాతం కూడా ‘డబుల్’  ఇండ్లు పూర్తి కాలేదని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. పూర్తయిన  45 ఇండ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో అవి అధ్వానంగా తయారయ్యాయి. 

అప్లికేషన్లు తీసుకున్నరు.. పంచుడు మరిచిన్రు..

గత ఏడాది ‘డబుల్’ ఇండ్లు పంచుతమని  ఆఫీసర్లు అప్లికేషన్లు తీసుకున్నారు. దాదాపు నెలరోజుల పాటు ఈ ప్రక్రియ నిర్వహించి  అంతా డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తామని ప్రకటించారు.  ఏమైందో ఏమో..  మధ్యలోనే ప్రాసెస్ ను నిలిపివేశారు.   దరఖాస్తు పెట్టుకున్న అర్హులు ‘డబుల్’ ఇండ్లు ఎప్పుడిస్తరో అని ఎదురుచూస్తున్నారు.

560 ఇండ్లకు వసతులు లేవ్​​ 

నిరుపేదల ఇండ్ల పట్టాలు  లాక్కొని దర్గా వద్ద 560 ‘డబుల్’ ఇండ్లను కడుతున్నారు.  వాటి నిర్మాణం ప్రస్తుతం ఆఖరి దశలో ఉంది.  కానీ ఇంకా అక్కడ సైడ్ డ్రైన్స్, వాటర్ లైన్, కరెంట్​, రోడ్లు, సెఫ్టిక్​ ట్యాంకు తదితర సౌలతులు కల్పించకపోవడంతో వాటిని ఇప్పుడు లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది.

కేటాయింపుల్లో ఇప్పటికే కొన్ని ఇండ్లు రిజర్వ్​

దరఖాస్తులు, డ్రా పద్ధతితో సంబంధం లేకుండా ఇప్పటికే కొన్ని ‘డబుల్’  ఇండ్లను అధికారులు రిజర్వ్ చేశారు. గద్వాల మండలం  గోన్​పాడు సమీపంలో నిర్మించిన 25 ఇండ్లలో5  ఇండ్లను స్థలం ఇచ్చిన వారికి ఇవ్వాలని అగ్రిమెంట్​ఉన్నది. దీంతో అక్కడ 20 ఇండ్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వారికి పంచే అవకాశం ఉంది. 560 ‘డబుల్’ ఇండ్లలో కూడా నిరుపేదల ఇండ్ల పట్టాలను లాక్కొని ఆ  స్థలాల్లో  ఇండ్లు కట్టారు. వారు కోర్టుకు వెళ్లడంతో ముందుగా స్థలాలిచ్చిన వారికి ఇండ్లు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. ఇలా కోర్టుకెళ్లిన వారు 500 మందికి పైగా ఉన్నారు.  

టెండర్ పిలిచిన పనులు చేస్తలేరు

‘డబుల్’ ఇండ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచినా వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. అయిజలో 200, అలంపూర్ లో 200, మద్దూర్ 50, వడ్డేపల్లిలో 25 ఇండ్లకు టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్లు ఇండ్ల  నిర్మాణం ప్రారంభించలేదు. ఓ వైపు కట్టిన కూలిపోతుండడం, మరో వైపు టెండర్లు పూర్తయినా కొత్త ఇండ్లు కట్టకపోవడంతో  నిరుపేదల ‘డబుల్’ ఇల్లు కల కలగానే మిగిలిపోయేలా ఉన్నది. 

45 ఇండ్లు పూర్తయ్యాయి

గోనుపాడు దగ్గర 25 ఇండ్లు, క్యాతుర్ దగ్గర 20 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది.  దర్గా దగ్గర 560 ఇండ్లు  చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే అవి పూర్తి చేసి పేదలకు పంచుతాం. – రవీందర్, డీఈ , పంచాయతీరాజ్