ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ బెడ్‌‌‌‌రూం ఇండ్లు..లబ్ధిదారులకే పెండింగ్ పనుల బాధ్యత

ఇందిరమ్మ లబ్ధిదారులకు డబుల్ బెడ్‌‌‌‌రూం ఇండ్లు..లబ్ధిదారులకే పెండింగ్ పనుల బాధ్యత

 

  • యూనిస్ట్​ కాస్ట్​లో బ్యాలెన్స్​డబ్బులు లబ్ధిదారులకే 
  • ముందు ఇళ్లు..తర్వాత మౌలిక వసతుల కల్పనపై దృష్టి 
  • కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం కొత్త ఆలోచన

నల్లగొండ, వెలుగు:  గత ప్రభుత్వం నిర్మించి మధ్యలోనే వదిలేసిన డబుల్​బెడ్​ రూమ్​ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో ఎవరైనా ఆసక్తిచూపిస్తే వాళ్లకు పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.  చాలా చోట్ల శ్లాబ్‌‌‌‌లు, గోడల నిర్మాణం కంప్లీట్​చేసినవే ఉండగా, మరికొన్ని చోట్ల ఇంటి నిర్మాణాలు పూర్తిచేసి, మౌలిక వసతులు లేక పంపిణీ  చేయలేదు. 

పెండింగ్​ పనులకు ప్రభుత్వ నిధులు

డబుల్​బెడ్​రూమ్​ ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షలు కాగా, పట్టణ ప్రాంతాల్లో రూ.5.40 లక్షలు కేటాయించారు.  వివిధ స్టేజీల్లో ఆగిపోయిన పెండింగ్ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.  ఒక ఇంటికి ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చు పెడితే.. బ్యాలెన్స్​రూ. లక్ష తో పెండింగ్​ వర్క్​ చేయించుకునే బాధ్యత లబ్ధిదారులదేనని చెబుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తియ్యాకే బ్యాలెన్స్​రిలీజ్​ చేస్తారు.   

మౌలిక వసతులు తర్వాతే

ముందుగా ఇళ్లు పంపిణీ చేసిన తర్వాత మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తారు. మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల జిల్లాలకు నిధులు కూడా రిలీజ్​ చేసింది. దీంతో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన బాధ్యత కూడా లబ్ధిదారులకే ఇవ్వాలని డిసైడ్​అయ్యింది. 

సూర్యాపేట, నల్గొండ జిల్లాలో నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 

నల్లగొండ జిల్లాలోని మూడు డివిజన్​ల పరిధిలో మొదటి, రెండు విడతల్లో కలిపి 3,588 ఇళ్లు శాంక్షన్​ చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి 2,717 ఇళ్లు సిద్ధంగా ఉన్నా యి. మరో 643 ఇళ్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. నల్లగొండలోని గొల్లగూడలో 552,  మిర్యాలగూడలోని గుమ్మస్తా కాలనీలో 560 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.  కనగల్​ మండలం పొనుగో డు, నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడెం, నేరేడుగొమ్ము, చింతపల్లి మండం అనాజిపూర్​, మిర్యాలగూడ మండలం కొత్తగూడెం, తుం గపహాడ్​, ఆలగడప, శాలిగౌరారం మండం బైరవోని బండ, తక్కెళ్ల ప హాడ్​ గ్రామాల్లో 295 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 

చిట్యాల, కట్టంగూరు, చింతపల్లి, నేరేడుగొమ్ము, అడవిదేవులపల్లి, శాలిగౌరా రం మండలాల్లోని మరికొన్ని గ్రామాల్లో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాలేదు. బుధవారం జిల్లా కలెక్టర్​ ఇలా త్రిపాఠి నల్లగొండ మండలం దోమలపల్లిలో 70 ఇళ్లకు గాను వివిధ దశల్లో ఉన్న 56 ఇళ్లకు తక్షణమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.

 సూర్యాపేట జిల్లా పరిధిలో 600 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో గాంధీ నగర్ లో 60 ఇండ్లు, తిరుమలగిరి మున్సిపాలిటీ, హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.  సూర్యాపేట జిల్లాలో సుమారు 2 వేల మంది లబ్ధిదారులు ఎల్2  కేటగిరీలో ఎంపిక చేశారు.  ఆసక్తి ఉన్న వారికి మొదట పంపిణీ చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. 

పాత నిబంధనలు రద్దు 

డబుల్​బెడ్ రూమ్​ఇళ్ల పంపిణీకి గత ప్రభుత్వం పెట్టిన షరతులను కాంగ్రెస్​ ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం,  మైనార్టీలకు 7 శాతం ఇళ్లు ఇవ్వాలని పెట్టిన రూల్​తొలగించింది. గత ప్రభుత్వం హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు కాకుండా ప్రస్తుతం ఇండ్లు, స్థలం లేని నిరు పేదలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేసుకునే వెసులుబాటు కల్పించగా రెండో  విడతలో ఎల్ 2 లబ్ధిదారులకు అందించనున్నారు.