లక్కీ డ్రా తీసిన చోటా డబుల్​ ఇండ్లు ఇస్తలే..

లక్కీ డ్రా తీసిన చోటా డబుల్​ ఇండ్లు ఇస్తలే..
  • లక్కీ డ్రా తీసిన చోటా డబుల్​ ఇండ్లు ఇస్తలే..
  • రాష్ట్రంలో లక్షకుపైగా ఇండ్లు రెడీగా ఉన్నా పంచట్లే
  • సీఎం ఇలాకా గజ్వేల్​లోనూ ఇదే పరిస్థితి
  • 50 రోజులు దాటినా అలాట్​చేయలే 
  • పేదలకు తప్పని ఎదురుచూపులు

నెట్​వర్క్/సిద్దిపేట​,  వెలుగు:  లక్కీ డ్రాలో డబుల్​ బెడ్​రూం ఇండ్లు వచ్చాయన్న సంబురం లబ్ధిదారులకు లేకుండా పోయింది.  ‘ఇదిగో .. అదిగో’ అని ఊరిస్తూ ఇప్పటికే ఎనిమిదేండ్లు గడిపిన రాష్ట్ర ప్రభుత్వం తీరా ఎంపిక పూర్తయిన చోట్ల కూడా ఇండ్లు పంచుతలేదు. ఈ ఏడాది సంక్రాంతికే ఇండ్లు అలాట్​ చేస్తామని, పండుగ పూటే  కొత్త ఇండ్లలో పాలు పొంగించుకోవచ్చని సర్కారు పెద్దలు చెప్తే లబ్ధిదారులు పొంగిపోయారు. ఎలక్షన్ ​ఇయర్​ కూడా కావడంతో ఈసారి ఖాయమనుకున్నారు. తీరా సంక్రాంతి, ఆ తర్వాత ఉగాది పోయినా ఇండ్లు జాడలేవు. ఫిబ్రవరి నుంచి పలుచోట్ల లక్కీ డ్రాలు తీసి ఫైనల్ ​లిస్టులు కూడా ప్రకటిస్తున్నారు. కానీ ఆయా చోట్ల రాజకీయ కారణాలకు తోడు, మౌలిక వసతులు పూర్తికపోవడంతో ఎవరికీ ఇండ్లు అప్పగించడం లేదు. 

లక్షకు పైగా ఇండ్లు పంపిణీకి రెడీ..

పేదల సొంతింటి కల నిజం చేస్తామంటూ 2015లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర సర్కారు గడిచిన ఎనిమిదేండ్లలో సగం లక్ష్యం కూడా చేరలేదు. మొదటి విడత స్టేట్ ​వైడ్​  2,92,057  ఇండ్లు(జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష, జిల్లాల్లో 1,92,057) సాంక్షన్​ చేశారు. కానీ, ఈ ఏడాది  ఇప్పటి వరకు  జీహెచ్ఎంసీ పరిధిలో 67,893 ఇండ్లు, జిల్లాల్లో 73,571 ఇండ్లు మాత్రమే   నిర్మించారు. మొత్తం 1,41,464 ఇండ్లు పూర్తికాగా, ఇందులో 25వేల లోపే పంపిణీ చేశారు. మిగిలిన లక్షకు పైగా ఇండ్లను పంపిణీ చేసే అవకాశమున్నా రకరకాల కారణాలతో వాయిదా వేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి  పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అలాట్​ చేస్తామని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్​రెడ్డి ప్రకటించారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి అయితే ఆఫీసర్లతో పలుమార్లు రివ్యూ మీటింగులు పెట్టి, ఇక ఇండ్లు వచ్చేసినట్టే అన్నంత హడావిడి చేశారు. ఎలక్షన్​ ఇయర్​ కావడంతో ఈసారి ఎలాగైనా ఇండ్లు వస్తాయని లబ్ధిదారులు కూడా ఆశించారు. కానీ సంక్రాంతి పోయి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇండ్లు అలాట్​ చేయడం లేదు. కొన్నిచోట్ల  మౌలిక వసతులు పూర్తికాలేదని, ఇంకొన్ని చోట్ల ఫైనల్ ​లిస్టులపై గొడవలు జరుగుతున్నాయని  పక్కనపెడ్తున్నారు. నిజానికి జిల్లాల్లో ఆఫీసర్లు  ఫిబ్రవరి నుంచే లక్కీడ్రాలు తీసి, లిస్టులు ఫైనల్​చేస్తున్నారు. కానీ రాజకీయ జోక్యం వల్ల డ్రాలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలకే ఇండ్లు వస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ సాకుతోనూ పంపిణీ వాయిదా వేస్తున్నారు. కానీ ఏ సమస్య లేని చోట్ల కూడా ఇండ్ల అలాట్​మెంట్​ ఆపడంపై విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అంతకు రెండు నెలల ముందు ఇండ్లను పంపిణీ చేస్తే, రాజకీయంగా తమకు కలిసివస్తుందనే ఆలోచనతోనే బీఆర్ఎస్​ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇండ్ల పంపిణీ వాయిదా వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

మిగిలిన చోట్లా ఇదే సీన్​..

కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంలో దాదాపు 850కి పైగా డబుల్ బెడ్ రూం ఇండ్లను ఐదేండ్ల కింద ప్రభుత్వం చేపట్టింది. పనులు పూర్తికాకముందే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు హడావుడిగా ఎంపిక చేపట్టారు. నెలన్నర కింద కొత్తగూడెం క్లబ్​లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రోగ్రాంలో  దాదాపు 720కిపైగా డబుల్ బెడ్​రూం ఇండ్లకు డ్రా తీశారు. ఇండ్లు పూర్తికాకపోవడంతో ఇంకా గృహప్రవేశం చేయించడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. సిరిసిల్ల ఆర్బన్  పరిధిలో 2,052 డబుల్ బెడ్​రూం ఇండ్లు  కంప్లీట్ కాగా,  ఇప్పటి వరకు  డ్రా తీసి 1200 ఇండ్లు పంపిణీ చేశారు. ఇంకా, 852 ఇండ్లను పంపిణీ చేయలేదు. ఫ్లోర్ల వారీగా లబ్దిదారుల లిస్ట్ తయారు చేస్తున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు.  సూర్యాపేట జిల్లాలో కోదాడ టౌన్ లో 520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రెండు నెలల కింద  డ్రా తీశారు. నేటి వరకు అలాట్ ​చేయలేదు. నాగర్ కర్నూల్ జిల్లా  అచ్చంపేట, కల్వకుర్తిలో ఈ నెల 6 న డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 

కానీ, ఇప్పటికీ ఇండ్ల పంపిణీ జరగలేదు. కామారెడ్డిలో  700 ఇండ్లకు మార్చిలో లక్కీ డ్రా తీసినా లబ్ధిదారులకు అందజేయలేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్​ నగర్​లో 
నిర్మించిన 330 డబుల్ బెడ్​రూం ఇండ్లకు మార్చి 17న డ్రా తీశారు. ఎంపికైన వారిలో అనర్హులు ఉన్నట్టు ఆరోపణలు రాగా,  ఎంక్వయిరీ  నిర్వహించి ఫైనల్ చేశారు. ఇండ్ల నిర్మాణాలు కంప్లీటైనా రోడ్లు, కరెంట్​ లైన్లు, డ్రైనేజీలు తదితర  వసతులు కల్పించలేదు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 288  డబుల్ బెడ్ రూం ఇండ్లకు డ్రా తీసినా లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించలేదు.  మంచిర్యాల జిల్లా మందమర్రిలో   400, క్యాతనపల్లిలో 286 ఇండ్ల కోసం  ఫిబ్రవరిలోనే లబ్ధిదారులను  ఎంపిక చేశారు. కానీ,  లిస్టులో  అనర్హుల పేర్లు ఉన్నాయని  దరఖాస్తుదారులు  ఆందోళన చేయడంతో మళ్లీ సర్వే చేయాలని  నిర్ణయించారు. పెద్దపల్లి జిల్లాలో నియోజకవర్గానికి 500 చొప్పున 1500 ఇండ్లకు డ్రా తీశారు. కానీ రోడ్లు, కరెంట్​, వాటర్​  ఫెసిలిటీస్​ ఏర్పాటు చేస్తున్నామని, పనులు  పూర్తికాగానే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. 

సీఎం నియోజకవర్గంలో ఇలా..   

సీఎం కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న  గజ్వేల్ మున్సిపాల్టీలో జీ ప్లస్ వన్ తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి దాదాపు మూడేండ్లు కావస్తున్నా పంపిణీ చేయడం లేదు. గత మార్చి  31న  1100 డబుల్  బెడ్​రూం ఇండ్ల కోసం మహతి ఆడిటోరియంలో లక్కీ డ్రా తీశారు. లబ్ధిదారులను వారం రోజుల్లో గృహప్రవేశం చేయిస్తామని చెప్పిన ఆఫీసర్లు 50 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఇండ్లు అప్పగించలేదు. ఈ క్రమంలో ఇప్పటికే  లబ్ధిదారులు ఒకసారి ఆందోళనకు దిగడమే కాకుండా ఓ యువకుడు పెట్రోల్ చల్లుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఆ టైంలో పెద్దఎత్తున మంటలు లేచినా పోలీసులు అలర్ట్​గా ఉండడంతో ప్రాణనష్టం తప్పింది.