ఇండ్లు, జాగలు కొనేటోళ్ల మీద డబుల్​ బాదుడు

ఇండ్లు, జాగలు కొనేటోళ్ల మీద డబుల్​ బాదుడు
  • మార్కెట్ వాల్యూ 20 నుంచి 50% పెంపు
  • రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5 శాతానికి పెరుగుదల
  • పెరిగిన ల్యాండ్ వాల్యూస్, చార్జీలు రేపటి నుంచే అమల్లోకి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌‌మెంట్లలో ఫ్లాట్ల మార్కెట్ వాల్యూను  భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచేసింది. పెరిగిన కొత్త విలువలు, చార్జీలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన భూముల విలువలకు అనుగుణంగా ఇప్పటికే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖలు డేటాను సిద్ధం చేశాయి. మార్కెట్ వాల్యూను, రిజిస్ట్రేషన్ చార్జీలను ఒకేసారి పెంచడంతో గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ చార్జీలు చాలాచోట్ల దాదాపు డబుల్ కానున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ చార్జీలు భారంగా మారనున్నాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే  మంగళవారం సాయంత్రం 5 గంటలకే ఆయా శాఖల ఉన్నతాధికారులు వెబ్ సైట్ల సర్వర్లు డౌన్ చేసి రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. చార్జీలు పెరగకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసుల్లో క్యూలో నిల్చున్న కొనుగోలుదారులు నిరాశతో వెనుదిరిగారు.
ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ విలువలు ఇలా..
ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటిదాకా మినిమం మార్కెట్ వాల్యూ గ్రామాల్లో చదరపు గజానికి  రూ.100 ఉంది. ఇప్పుడు చదరపు గజానికి మినిమం వాల్యూను రూ.200కు పెంచారు. మండల కేంద్రాలు, 50 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో మినిమం వాల్యూ రూ.300.. 50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.400.. వీటీడీఏ మినహా ఇతర పురపాలికలు, కార్పొరేషన్లలో రూ.500.. హెచ్‌‌‌‌ఎండీఏ-1లో రూ.1,500.. హెచ్‌‌‌‌ఎండీఏ-2లో రూ.800.. జీహెచ్‌‌‌‌ఎంసీలో రూ.3 వేలుగా నిర్ధారించారు. హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లలో చాలా చోట్ల రెసిడెన్షియల్ ఏరియాల్లో చదరపు గజం వాల్యూ రూ.3 వేలుగా ఉంది. ఈ వాల్యూను రూ.4,500కు పెంచారు. రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్‌‌‌‌లోని జూబ్లీహిల్స్‌‌‌‌ (కమర్షియల్‌‌‌‌ ఏరియా)లో ప్రస్తుతం గజం రూ.65 వేలుగా ఉంది. పెరిగిన ధరల ప్రకారం ఇక్కడ గజం ధర రూ.74,500 కానుంది.
అపార్ట్‌‌‌‌మెంట్ ఫ్లాట్ల విలువ ఇలా..
అపార్ట్‌‌‌‌మెంట్లలో ఫ్లాట్ల విలువ గతంలో చదరపు అడుగుకు మినిమం వాల్యూ రూ.800 ఉండేది. ఇప్పుడు ఈ మినిమం వాల్యూను రూ.1,000కి పెంచారు. ఫ్లాట్ల విషయంలో మాత్రం తక్కువ వాల్యూ ఉన్న చోట 20 శాతమే పెంచారు. ఎక్కువ విలువ ఉన్న దగ్గర 30 శాతం వరకు పెంచారు. బోడుప్పల్ ఫ్లాట్ వాల్యూ చదరపు అడుగుకు రూ.1,200 ఉండేది. ఇప్పుడు ఈ వాల్యూను రూ.1,700కు పెంచినట్లు తెలిసింది.
వ్యవసాయ భూముల విలువలు ఇలా..
వ్యవసాయ భూములకు తక్కువ ధర పలికే చోట ఎకరానికి మినిమం మార్కెట్ వాల్యూను రూ.75,000గా నిర్ణయించారు. వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ చాలా తక్కువగా ఉన్న చోట 50 శాతానికి పెంచారు. ఈ లెక్కన ప్రస్తుతం ఎకరాకు సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ రూ.2 లక్షలుగా ఉన్న చోట రూ.3 లక్షలకు పెరగనుంది. మార్కెట్ వాల్యూ మధ్య రకంగా ఉన్న చోట వాల్యూను 40 శాతానికి పెంచారు. ఇప్పటికే అత్యధికంగా మార్కెట్ వాల్యూ ఉన్న చోట 30 శాతానికి పెంచారు.
మరికొన్ని సర్వీసులకు చార్జీల పెంపు
స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు రిజిస్ట్రేషన్ శాఖ అందించే మరికొన్ని సర్వీసుల చార్జీలను ప్రభుత్వం పెంచినట్లు తెలిసింది. సేల్ అగ్రిమెంట్‌‌‌‌/జీపీఏ, డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌, డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌, ఫ్యామిలీ మెంబర్స్ పార్టిషియన్ రిజిస్ట్రేషన్‌‌‌‌ చార్జీలు, కుటుంబ, కుటుంబేతరుల మధ్య అగ్రిమెంట్లు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, టైటిల్‌‌‌‌ డీడ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌, జీపీఏ (ఆథరైజేషన్‌‌‌‌తో, ఆథరైజేషన్‌‌‌‌ లేకుండా), వీలునామా, లీజు సహా ఇతర సేవల చార్జీలు పెరగనున్నాయి.
రూ.12 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా..
ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చివరిసారిగా 2013 ఆగస్టులో భూముల మార్కెట్ విలువలు పెంచారు. ఆ తర్వాత పెంపు ఇప్పుడే. 2020 మార్చిలో మార్కెట్ వాల్యూ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా.. కరోనా, లాక్ డౌన్ తో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పాత విలువలే అమలవుతున్నాయి. గత ఏడాది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుందని ఆశిస్తే.. కరోనా, లాక్ డౌన్, ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో అందులో సగం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో 2021–22 ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ ను రూ.12 వేల కోట్లకు పెంచారు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూముల మార్కెట్ వాల్యూస్ ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

కూకట్‌‌‌‌పల్లి ఏరియాలోని అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు ప్రభుత్వ మార్కెట్ వాల్యూ రూ.1,900గా ఉంది. వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఆ ఫ్లాట్ విలువను రూ.19 లక్షలుగా సబ్ రిజిస్ట్రార్ నిర్ధారించే వారు. ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి 6 శాతం చెల్లించాల్సి ఉండేది. ఈ ప్రకారం రూ.లక్షకు రూ.6 వేల చొప్పున 1.14 లక్షలు చెల్లించేవారు. తాజా పెంపు ప్రకారం.. చదరపు అడుగు ప్రభుత్వ మార్కెట్ వాల్యూ రూ.2,400గా నిర్ణయించారు. దీంతో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ వాల్యూ రూ.24 లక్షలకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5 శాతానికి పెరగడంతో రూ.లక్షకు రూ.7,500 వేల చొప్పున 1,80,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కొనుగోలుదారుపై 66,000 అదనపు భారం పడనుంది.

బోడుప్పల్ పరిధిలోని నారపల్లిలో ప్రస్తుతం గజం సబ్ రిజిస్ట్రార్ వాల్యూ రూ.3 వేలు. ఇక్కడ 200 గజాల ఓపెన్ ప్లాటు కొంటే.. ఆ ప్లాటు సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం రూ.6 లక్షలు. ఏ ప్రాపర్టీ కొన్నా వివిధ చార్జీలు కలిపి సబ్ రిజిస్ట్రార్ వాల్యూలో 6 శాతం చెల్లించాలి. ఇలా లక్షకు రూ.6 వేల చొప్పున రూ.6 లక్షలకు రూ.36 వేలు రిజిస్ట్రేషన్ చార్జీలు అవుతాయి. తాజాగా పెరిగిన విలువ ప్రకారం.. నారపల్లిలో గజం ధరను రూ.4,500గా నిర్ణయించారు. చార్జీలను 7.5 శాతానికి పెంచారు. దీంతో అదే 200 గజాల ప్లాటు సబ్ రిజిస్ట్రార్ వాల్యూ రూ.9 లక్షలుగా లెక్కకడుతారు. దీనిపై 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీల లెక్కన.. రిజిస్ట్రేషన్‌‌కు రూ.67,500 అవుతుంది. అంటే అదనంగా రూ.30,500 భారం పడనుంది.