జనగామలో డబుల్‌‌ రిజిస్ట్రేషన్ల దందా .. సీపీ వద్దకు చేరిన పంచాయితీ

జనగామలో  డబుల్‌‌ రిజిస్ట్రేషన్ల దందా .. సీపీ వద్దకు చేరిన పంచాయితీ
  • జనగామ శివారులో ప్లాట్లను డబుల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ చేసిన రియల్టర్లు
  • రంగంలోకి దిగిన పోలీసులు
  • ముగ్గురు రియల్టర్లపై కేసు నమోదు, ఫీల్డ్‌‌ లెవల్‌‌లో ఎంక్వైరీ

జనగామ, వెలుగు : జనగామలో ప్లాట్ల డబుల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ దందా పెరిగిపోతోంది. జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత వేగంగా విస్తరిస్తుండడంతో కొందరు రియల్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉన్న లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ భూములు, ప్లాట్లను యథేచ్ఛగా డబుల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ చేస్తున్నారు. ఫలితంగా ఒక్కో రూపాయి కూడబెట్టుకొని ప్లాట్లు కొన్న బాధితులు లబోదిబోమంటున్నారు.

ప్లాట్లు తమవేనని చెబుతున్న ఒరిజినల్‌‌ ఓనర్లపై దళారులు బెదిరింపులకు దిగుతున్నారు. జనగామ జిల్లా కేంద్రం శివారు ప్రాంతాలైన కల్లెం బైపాస్‌‌, నెల్లుట్ల, శామీర్‌‌పేట, హైదరాబాద్, హనుమకొండ, సూర్యాపేట రోడ్లలో ఇలాంటి దందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కళ్లెం రోడ్డులో 1990లో కొన్న ప్లాట్లు ప్రస్తుతం డబుల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ అయిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఇదే విషయంపై కొందరు బాధితులు గత నెల 29న వరంగల్‌‌ సీపీ అంబర్‌‌ కిశోర్‌‌ ఝాకు ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

1990లో అమ్మిన పాట్లకు తాజాగా రిజిస్ట్రేషన్‌‌

జనగామ జిల్లా కేంద్రం శివారులోని కళ్లెం బైపాస్‌‌ రోడ్డులో 315, 316, 317 సర్వే నంబర్లలలో సుమారు 33 ఎకరాల వరకు భూమి ఉంది. ఇందులో 9.14 ఎకరాలను 1990లోనే ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. సుమారు 540 వరకు ప్లాట్లు చేయగా ఎక్కువ మొత్తం ప్లాట్లు అమ్మకం కాగా కొన్ని మిగిలిపోయాయి. ఈ ఏరియాలో స్థలాలు కొన్న వారు ఇటీవల వచ్చి చూడగా తమ ప్లాట్ల చుట్టూ ప్రహరీ కనిపించింది.

317 సర్వే నంబర్‌‌లోని మొత్తం ప్లాట్లు, 316లోని సగానికి పైగా ప్లాట్లు కబ్జాకు గురైనట్లు గుర్తించి భూమి కొన్న వారిని నిలదీశారు. దీంతో ఆ భూమిని తాము కొనుగోలు చేశామని, డీటీసీపీ లేఅవుట్‌‌ కోసం అప్లై చేసినట్లు చెప్పుకొచ్చారు. పర్మిషన్‌‌ రాగానే అమ్మకాలు కూడా చేపడుతామని చెప్పడంతో ప్లాట్ల ఓనర్లు ఆందోళనకు గురయ్యారు.

సీపీకి ఫిర్యాదు.. ఎంక్వైరీకి ఆదేశాలు

ఆయా సర్వే నంబర్లలో ప్లాట్లు కొన్న వారు గత నెల 29న వరంగల్‌‌ సీపీ అంబర్‌‌ కిశోర్‌‌ ఝాను కలిసి తమ గోడును విన్నవించారు. 1990లో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను ఓ ముగ్గురు రియల్టర్లు అక్రమంగా డబుల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు. ఆ భూమిని ప్లాట్లుగా మార్చి మరోసారి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దీంతో కమిషనర్‌‌ జనగామ డీసీపీకి రెఫర్‌‌ చేశారు.

డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ దేవేందర్‌‌రెడ్డి ఎంక్వైరీ ప్రారంభించారు. 1990లో ఇద్దరు వ్యక్తులు భూ యజమాని వద్ద జీపీఏ చేయించుకుని ప్లాట్లు విక్రయించారు. 2019లో భూ యజమాని వారసుల సాయంతో ముగ్గురు రియల్టర్లు ఆ భూమిని రెండో సారి రిజిస్ట్రేషన్‌‌ చేయించుకున్నట్లు ఆరోపించారు. దీంతో ఈ అక్రమ వ్యవహారం పై నిగ్గు తేల్చేందుకు పోలుసులు విచారణ వేగం పెంచారు.

ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఫీల్డ్‌‌ వెరిఫికేషన్‌‌ చేసి డబుల్‌‌ రిజిస్ట్రేషన్‌‌పై వివరాలు తెలుసుకున్నారు. డబుల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ వ్యవహారంలో బాధితుడు ఆంజనేయులు ఫిర్యాదు తో బెడిదె యాదగిరి, జిట్టా నర్సింహులు, చాడ వెంకట్‌‌రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దేవేందర్‌‌రెడ్డి చెప్పారు.