యూనివర్శిటీల్లో కామన్ బోర్డుపై డౌట్లు

యూనివర్శిటీల్లో కామన్ బోర్డుపై డౌట్లు
  • యూజీసీ రూల్స్​కు విరుద్ధం
  • ఒడిశాలో పోస్టుల భర్తీ 
  • ప్రక్రియపై సుప్రీంకోర్టు స్టే
  • నాలుగేండ్ల కింద ఏపీలోనూ విఫల ప్రయోగం..
  • రాత పరీక్ష తర్వాత రద్దయిన నోటిఫికేషన్లు 
  • తెలంగాణలోనూ ఇదే పరిస్థితి తలెత్తవచ్చని అనుమానాలు
  • బోర్డులో ఐఏఎస్​ల పెత్తనంపైనా విమర్శలు 
  • ప్రశ్నార్థకంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన కామన్ బోర్డు చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే రిక్రూట్మెంట్ ప్రక్రియ యూజీసీ నిబంధనలకు విరుద్ధమని, న్యాయపరమైన చిక్కులు తలెత్తే చాన్స్ ఉందని సీనియర్ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. నాలుగేండ్ల కింద ఆంధ్రప్రదేశ్​లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్లు ఆ తర్వాత రద్దయ్యాయని, ఇటీవల ఒడిశాలో ఒడిశా పబ్లిక్​ సర్వీస్ కమిషన్, స్టేట్ సెలక్షన్​ బోర్డు ద్వారా చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రాసెస్​పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని వారు గుర్తుచేస్తున్నారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల అనుభవాల దృష్ట్యా రాష్ట్రంలో కామన్ బోర్డుతో యూనివర్సిటీల్లో నియామకాలు జరగడం కష్టమేనని సీనియర్​ ప్రొఫెసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీ, ఒడిశాలో ఏం జరిగిందంటే..

  •   ఆంధ్రప్రదేశ్​లోని వివిధ వర్సిటీల్లో 1,100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(ఏపీపీఎస్సీ) 2018లో రాత పరీక్ష నిర్వహించింది. తీరా రాత పరీక్ష పూర్తయ్యాక పోస్టుల భర్తీ విధానం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని, ఇంటర్వ్యూ పద్ధతిలో యూనివర్సిటీల ద్వారానే నియామకాలు చేపట్టాలంటూ కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. దీంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. కేసు విచారణలో ఉండగానే.. ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి వచ్చాక పాత నోటిఫికేషన్లు రద్దు చేశారు. 
  • ఒడిశా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్​ టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్​ చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునేందుకు ఒడిశా యూనివర్సిటీల చట్టం – 1989ని 2020లో సవరించింది. ఈ సవరణ ద్వారా ఒడిశా పబ్లిక్​ సర్వీస్ కమిషన్​(ఓపీఎస్​సీ), స్టేట్ సెలక్షన్ బోర్డు(ఎస్​ఎస్​బీ)లాంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు వర్సిటీల్లో పోస్టుల భర్తీని అప్పగించింది. అయితే 2018 యూజీసీ నిబంధనల ప్రకారం.. రిక్రూట్ మెంట్  సెలక్షన్​ కమిటీల ఏర్పాటు, అసిస్టెంట్​ ప్రొఫెసర్ల నియామకంపై కేవలం యూనివర్సిటీలకే అధికారం ఉంది. చట్ట సవరణపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. సవరణను కోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ లో జేఎన్​యూ రిటైర్డ్ ప్రొఫెసర్​ అజిత్​ మొహంతి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఒడిశాలో యూనివర్సిటీ టీచింగ్​ స్టాఫ్​ రిక్రూట్‌‌మెంట్‌‌పై స్టే విధించింది. స్టే ను పట్టించుకోకుండా ఓపీఎస్​సీ మే 23, 24  టీచింగ్ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీంతో మే 28న కొందరు ప్రొఫెసర్లు ఒడిశా గవర్నర్ గణేషీ లాల్‌‌కు ఫిర్యాదు చేయగా.. మే 28న ప్రక్రియను నిలిపివేశారు. ఆ తర్వాత మే 31న ఉత్కల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాండా, మరికొందరు ప్రొఫెసర్లు హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాలరాసేలా ఒడిశా యూనివర్సిటీస్​ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసిందని వారు వాదిస్తున్నారు. 

బోర్డులో ఐఏఎస్​ల పెత్తనం
సర్కారు ప్రకటించిన కామన్ బోర్డులో ఐఏఎస్​ల పెత్తనం కనిపిస్తున్నది. బోర్డులోని నలుగురిలో  ముగ్గురు కూడా సీనియర్ ఐఏఎస్​లే. వీరిలో విద్యాశాఖ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కళాశాల విద్యాశాఖ కమిషనర్​ ఉన్నారు. ఈ ముగ్గురిని కాదని ప్రత్యేకంగా బోర్డు చైర్మన్  నిర్ణయం తీసుకోగలుగుతారా అనే ప్రశ్న మొదలైంది. నియామకాలను సర్కారు ప్రభావితం చేసే అవకాశమూ లేకపోలేదని ప్రొఫెసర్లు అంటున్నారు. బోర్డులోని నలుగురూ ప్రస్తుతం వివిధ బాధ్యతలు కూడా చూస్తున్నారు. దీంతో వీరు ప్రత్యేకంగా కామన్ రిక్రూట్మెంట్​పై దృష్టి పెట్టే అవకాశాలు తక్కువేననే సీనియర్​ ప్రొఫెసర్లు అంటున్నారు. బాసర విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో డమ్మీ కమిటీని నియమించించిందనే ఆరోపణలు వస్తున్నాయి.  అయితే ఇటీవల రిలీజ్ చేసిన జీవో16 డ్రాఫ్ట్​లో చివరి నిమిషంలో మా ర్పులు జరిగినట్టు తెలిసింది. కామన్ బోర్డులో 2 వర్సిటీల వీసీలను సభ్యులుగా పెట్టగా.. చివరి నిమిషంలో ఆ 2పేర్లను తీసేశారనే ప్రచారం జరుగుతున్నది. 

ప్రపోజల్ ఒకటి.. అమలు మరొకటి 
రాష్ట్రంలోని వర్సిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ పై కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో దీనిపై హయ్యర్ ఎడ్యుకేషన్​ కౌన్సిల్ ఇతర రాష్ట్రాల్లోని తీరుతెన్నులను పరిశీలించింది. బీహార్ మోడల్ అంటూ సర్కారుకు ప్రపోజల్ కూడా పంపింది. టీఎస్​పీఎస్సీ మాదిరిగా అటానమస్​ బాడీగా ఉండేలా కమిషన్​ వేయాలని సూచించింది. దీంట్లో 62 ఏండ్లు నిండిన సీనియర్ అకాడమిషన్ ను చైర్మన్​గా పెట్టాలని, అన్ని వర్సిటీల వీసీలు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రాతినిధ్యం ఉండాలని పేర్కొంది. ఇలా అయితే కోర్టు కేసుల నుంచి తప్పించుకునే అవకాశముంటుందని భావించింది. రిక్రూట్మెంట్ కోసం ఏదో ఒకరకమైన స్ర్కీనింగ్ టెస్టు పెట్టాలని సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. సెపరేట్​ చైర్మన్​, సెపరేట్​ మెంబర్లతో ప్రత్యేకంగా బోర్డు/ కమిషన్​ వేయకుండా.. ఇతర బాధ్యతలు చూస్తున్నవారితోనే బోర్డు ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. 
ప్రశ్నార్థకంగా వర్సిటీల స్వయంప్రతిపత్తి 
నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి రావడం, వైస్​ చాన్స్​లర్ల నియామకాలన్నీ  పొలిటికల్​ అపాయింట్​మెంట్లుగా మారడంతో ఇప్పటికే యూనివర్సిటీల ప్రతిష్ట మసకబారింది. ఇప్పుడు  యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్​ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సెంట్రలైజ్ ​చేయడంతో వర్సిటీల స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారనుందని సీనియర్​ ప్రొఫెసర్లు అంటున్నారు. అక్రమాలు జరగకుండా, రూల్స్​ వాయిలెట్​ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ నామినీల ద్వారా పర్యవేక్షించాలే తప్ప రిక్రూట్​మెంట్​నే  చేతుల్లోకి తీసుకోవడం సరికాదని చెప్తున్నారు. 
వీసీల నియామకంలోనూ రూల్స్​ బ్రేక్​
గతంలో కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేవాళ్లు. అయితే ఈ పోస్టుల భర్తీలో కొన్ని వర్సిటీల్లో అక్రమాలు జరగడం, కొందరు వీసీలు మెరిట్ ఉన్నోళ్లను కాదని తమకు కావాల్సినోళ్లను సెలక్ట్  చేశారనే ఆరోపణలు వచ్చాయి. పదేండ్లు ప్రొఫెసర్ గా అనుభవం లేని వ్యక్తిని, యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇటీవల ఒక ప్రముఖ వర్సిటీకి వీసీగా ప్రభుత్వం నియమించింది. దీనిపై హైకోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. వీసీల నియామకంలోనే యూజీసీ రూల్స్ బ్రేక్ చేసిన ప్రభుత్వం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో బ్రేక్​ చేయదంటే నమ్మడం కష్టమే. 
- డాక్టర్ మామిడాల ఇస్తారి, జనరల్ సెక్రటరీ,
 అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్)
యూజీసీ రూల్స్​ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తాం
యూజీసీ నిబంధనల ప్రకారమే కామన్​ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టులను భర్తీ చేస్తాం. చట్టపరమైన, న్యాయపరమైన  అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిక్రూట్మెంట్ నిర్వహిస్తాం. బీహార్​లో ప్రత్యేక కమిషన్​ ద్వారానే వర్సిటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అన్ని వర్సిటీ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చిన తర్వాతే, పోస్టులను భర్తీ చేస్తాం. ఒక్కో వర్సిటీలో ఒక్కోసారి రిక్రూట్మెంట్ జరగడంతో ఒక వర్సిటీలో జాబ్​ వచ్చిన తర్వాత మరో వర్సిటీలో జాబ్​ వస్తే  అటు వెళ్తున్నారు. దీంతో మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయి. బోర్డు ఏర్పాటుతో టైమ్​ కూడా సేవ్ అవుతుంది. 
- ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్