- ఓపెన్ కాస్ట్ గని మేనేజర్, డ్రైవర్ సురక్షితం
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా కల్యాణి ఖని ఓపెన్ కాస్ట్ గనిలో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ బొలెరోను డోజర్ వెహికల్ ఢీకొంది. ప్రమాదం నుంచి ఓసీపీ మేనేజర్, డ్రైవర్ తృటిలో తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డారు.
గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓసీపీలోని 820 ఆర్ఎల్, 2 బీసీము వద్ద మట్టి వెలికితీత పనులు జరుగుతుండగా.. ఆ పనులను పర్యవేక్షించేందుకు బోలెరో వాహనంలో గని మేనేజర్ రామరాజు అక్కడి చేరుకున్నారు. కొద్ది దూరంలో ఉన్న పనులు చూసేందుకు మేనేజర్ వెళ్లగా డ్రైవరు మున్నా అదే బోలెరోలో కూర్చున్నాడు. కొద్దిసేపటికే ఓ డోజర్వాహనం బొలెరోను వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో డ్రైవర్ మున్నాకు స్వల్ప గాయాలయ్యాయి. సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఓపెన్ కాస్ట్ గనిలో స్వింగ్ ఏరియా (మట్టివెలికితీసే ప్రాంతం)కు 30 మీటర్ల దూరంలో ఇతర వాహనాలు నిలిపివేయాల్సి ఉంది.
కానీ మేనేజర్ వచ్చిన బోలెరోను 30 మీటర్ల లోపు ప్రాంతంలోనే ఉంచడం.. దాన్ని డోజర్ డ్రైవర్ గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని ఏరియా జీఎం రాధాకృష్ణ సీరియస్ గా పరిగణిస్తున్నట్లు సమాచారం.
