అస్తవ్యస్త డ్రైనేజీలతోనే.. కామారెడ్డి ఆగమాగం..వాగుపై కబ్జాలు.. ఇండ్లల్లోకి వరద నీరు

 అస్తవ్యస్త డ్రైనేజీలతోనే.. కామారెడ్డి ఆగమాగం..వాగుపై కబ్జాలు.. ఇండ్లల్లోకి వరద నీరు
  • ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పట్టణమంతా అతలాకుతలం
  • గంటల తరబడి జలదిగ్బంధంలోనే జనం
  • ధ్వంసమైన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
  • పెద్ద డ్రైనేజీలు నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం
  • అధికార యంత్రాంగం స్పందించాలని స్థానికుల వేడుకోలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వాగు, నాలాలపై నిర్మాణాలు జరగడం, పలు కాలనీల్లో మెయిన్ రోడ్లకు సరైన డ్రైనేజీలు లేక వర్షాకాలంలో వరద ముప్పు తప్పట్లేదు. కొన్ని చోట్ల రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న డ్రైనేజీలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పట్టణమంతా అతలాకుతలం కావడమే అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం. 

వరద నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు గంటల తరబడి జలదిగ్భందంలో చిక్కుకున్నారు. పదుల సంఖ్యలో కుటుంబాలు రూ.లక్షలు నష్టపోయాయి. రహదారులు కొట్టుకుపోవడంతోపాటు కాలనీల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

వాగు కబ్జాలతోనే ఇండ్లల్లోకి వరద నీరు.. 

కామారెడ్డి పెద్ద చెరువు నుంచి మాచారెడ్డి వైపు వాగు ప్రవహిస్తోంది. టౌన్ పరిధిలో వాగు సైజు తగ్గింది. చెరువు కింద నుంచి పట్టణం దాటే వరకు వాగును లోపలికి ఒత్తుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. వాగు 10 మీటర్ల వెడల్పులో ఉండాలి. దానికి ఇరువైపులా బఫర్ జోన్‌‌‌‌గా 2 మీటర్లు వదలాలి. దీనికి విరుద్ధంగా పర్మిషన్లు ఇవ్వడంతో వెంచర్లు, ఇండ్లు నిర్మించారు. ఈసారి భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహించి జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలు మిద్దెలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. సామగ్రి పాడై పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది.  

అర్ధంతరంగా పనులు.. సమస్యలు యథాతథం 

2017లో కొత్త బస్టాండ్ -సీఎస్ఐ చర్చి నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు ఇరువైపులా పెద్ద డ్రైనేజీల నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించారు. కానీ పనులు సగం వరకు చేసి వదిలేశారు. నిర్మాణం కూడా సక్రమంగా లేకపోవడంతో రహదారులపై నీరు ప్రవహిస్తోంది. డిగ్రీ కాలేజీ ఏరియా, కాకతీయనగర్, ఎన్జీవోస్ కాలనీ నుంచి వచ్చే వరద నీరు సరిగా పారక, విద్యానగర్ కాలనీలోకి చేరుతోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

చిన్న డ్రైనేజీలు, పెద్ద సమస్యలు 

సాయిబాబా గుడి ఏరియా, జన్మభూమి రోడ్డులో డ్రైనేజీ చిన్నగా ఉండటంతో మురుగు నీరు, వర్షపు నీరు రోడ్డుపై నిలుస్తోంది. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు డ్రైనేజీ చిన్నగా ఉంది.  నిజాంసాగర్​ రోడ్డు నుంచి చెరువు వైపు వెళ్లే నాలా కబ్జాకు గురైంది. స్టేషన్ రోడ్డులో ఇరువైపులా డ్రైనేజీలు లేకపోవడం, పాత డ్రైనేజీ పూడుకుపోవడంతో  వర్షం పడితే రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలిగిస్తోంది. రైల్వే బ్రిడ్జి దగ్గర, పోలీస్ స్టేషన్ ఎదురుగా వాన నీళ్లు నిలిచి సమస్యలు సృష్టిస్తున్నాయి. అశోక్ కాలనీ, సిరిసిల్లా రోడ్డు, టీచర్స్ కాలనీ, అయ్యప్పనగర్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.  

స్థానికుల విన్నపం.. 

‘ప్రతి ఏడాది వరద ముప్పు తప్పట్లేదు. యంత్రాంగం స్పందిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వాగు, డ్రైనేజీలపై కబ్జాలను తొలగించి, సక్రమ డ్రైనేజీలను నిర్మిస్తేనే ఇబ్బందులు తొలుగుతాయి’ అని స్థానికులు అధికార యంత్రాంగానికి విన్నవిస్తున్నారు.