రాష్ట్రపతి ఎన్నికలు.. వర్మ మరో ట్వీట్

రాష్ట్రపతి ఎన్నికలు.. వర్మ మరో ట్వీట్

కాంట్రావర్సికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ (RGV) చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది. ఎన్డీఏ (NDA) అభ్యర్థిగా రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ద్రౌపతి ముర్ము (Draupadi Murmu)పై వర్మ వివాదాస్పద ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆబిడ్స్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో వివాదానికి ముగింపు పలికేలా ఆయన ప్రయత్నం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చారు. మహాభారతంలో ద్రౌపది పాత్ర తనకు నచ్చుతుందని, ద్రౌపది పేరు చాలా అరుదుగా ఉంటుందని ట్వీట్ లో తెలిపారు. ఆ పేరు వినగానే తనకు ఇతర పాత్రలు గుర్తుకొచ్చాయని వెల్లడించారు. ఎవరి సెంటిమెంట్ లను గాయపరిచాలనే ఉద్దేశ్యం తనకు లేదని మరోసారి చెప్పారు వర్మ. 

అసలేం జరిగింది ? 
భారతదేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24వ తేదీతో ముగియనుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. యశ్వంత్ సిన్హా పేరును విపక్షాలు, ద్రౌపది ముర్మును ఎన్డీయే ప్రకటించాయి. ఇప్పటికే ముర్ము నామినేషన్ దాఖలు చేయగా.. యశ్వంత్ సిన్హా (yashwant sinha).. ఈ నెల 27న నామినేషన్ వేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక (President Election) పోలింగ్ జరగనుంది. ఇక్కడి దాక బాగానే ఉన్నా... రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన అనంతరం దర్శకుడు వర్మ ఓ ట్వీట్ చేశారు. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు ? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.  ఆదివాసీ మహిళను కించపరిచేలా కామెంట్ చేసిన వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్మపై బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ మరో ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ తో వివాదానికి చెక్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి.