లైబ్రరీల డిజిటల్​ అనుసంధానం

లైబ్రరీల డిజిటల్​ అనుసంధానం

దేశంలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి, గ్రంథాలయాల ఆధునీకరణకు, గ్రంథాలయాల డిజిటలైజేషన్‌‌‌‌ ను ప్రోత్సహించడానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కేంద్ర న్యాయశాఖ, పార్లమెంట్ అఫైర్స్ శాఖ సంయుక్తంగా ‘లైబ్రరీస్ ఫెస్టివల్ 2023’ నిర్వహిస్తున్నది.  ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఆగస్టు 5 నుంచి జరిగే ఈ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం, విలువైన చేతి రాత పత్రాలు భద్రపరచి, చరిత్రకు, భవిష్యత్తుకు అనుసంధానం ఏర్పాటు చేయడం. ప్రధాని మోడీ ఆలోచన అయిన ‘వన్ నేషన్ వన్ లైబ్రరీ’లో భాగంగా దేశవ్యాప్తంగా ఆన్​లైన్ డిజిటల్ రిపాజిటరీని(ఒక విద్యా సంస్థ లేదా పరిశోధనా సంస్థ మేధోపరమైన లేదా పుస్తక వనరులు, డిజిటల్ కాపీలను సేకరించడం, భద్రపరచడం, వ్యాప్తి చేయడం) తయారు చేయడం. 

దేశవ్యాప్తంగా ఉన్న పౌర, విద్యా, స్పెషల్ గ్రంథాలయాలు రిపాజిటరీ నుంచి పుస్తకాలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. ఈ రిపాజిటరీలో జాతీయ గ్రంథాలయం, పార్లమెంట్ గ్రంథాలయం, ప్రధానమంత్రి మ్యూజియం, గ్రంథాలయం, భారత రాష్ట్రపతి గ్రంథాలయంలో ఉన్న పుస్తక వనరులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆన్​లైన్ రిపాజిటరీ లెక్చరర్లకు, టీచర్లకు, గ్రంథ పాలకులకు, పరిశోధకులకు, సాహితీవేత్తలకు, రచయితలకు ఉపయోగపడుతుంది. 

చారిత్రక సంపదను కాపాడాలి

తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద 13 ప్రముఖ గ్రంథాలయాలు, భారత జాతీయ గ్రంథాలయం కలకత్తా, ఖుదాబక్ష ఓరియంటల్ పౌర గ్రంథాలయం పాట్నా, సెంట్రల్ సెక్రటేరియట్ గ్రంథాలయం న్యూఢిల్లీ, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ గ్రంథాలయాలని ఎంపిక చేశారు. ఈ డిజిటల్ ఆన్​లైన్ రిపాజిటరి ఇండియన్ కల్చర్ అనే పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా ఆన్​లైన్ రిపాజిటరీలోని వనరులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  రేపటి నుంచి జరగబోయే బుక్ ఫెస్టివల్ సందర్భంగా ఆన్​లైన్ డిజిటల్ రిపాజటరీ విధి విధానాలపై, అమలు తీరుపై చర్చ జరగనుంది. దేశంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థల గ్రంథాలయాల, పరిశోధన సంస్థల గ్రంథాలయాల, జాతీయ సంస్థల గ్రంథాలయాలు, ఐఐటీ ఖరగ్​పూర్ సాయంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే హార్వెస్టింగ్ మెటాడేటాను తయారు చేయడం వల్ల దాదాపు రూ.9 కోట్ల పైచిలుకు వనరులు ప్రతి పౌరుడు వాడుకునే వీలు కలిగింది. 

మానవ-కేంద్రీకృత అభివృద్ధిలో గ్రంథాలయాలు ముఖ్యమైన భాగమైనందున గ్రంథాలయాల అభివృద్ధికి పాలకులు పాటు పడాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఎన్నో గొప్ప, ఫిజికల్ మోడ్‌‌‌‌లో ఉన్న గ్రంథాలయాలు గర్వించదగిన స్థానాన్ని ఆక్రమించాయి.16వ శతాబ్దం నాటి తంజావూర్ లోని సరస్వతి మహల్ గ్రంథాలయం నుంచి మొదలు.. నేటి వరకు ఎన్నో ఉన్నాయి. వాటిని పరిరక్షించి, డిజిటల్ రూపంలోకి మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. చారిత్రక, వారసత్వ సంపదగా ఉన్న గ్రంథాలయాలను భవిష్యత్ తరాలకు అందించాలి.

లైబ్రరీల అభివృద్ధికి కృషి..

రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ వారు దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా పౌర, రాష్ట్ర, ప్రాముఖ్యత కలిగిన గ్రంథాలయాలను దీనిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా100 జిల్లాల నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, గ్రంథాలయ డైరెక్టర్లు, గ్రంథాలయాల సెక్రటరీలు, లైబ్రేరియన్లు, గ్రంథాలయాల ప్రేమికులు, విద్యావేత్తలతో ఆరోగ్యవంతమైన చర్చలు జరిపి వారి సలహా, సూచనలతో గ్రంథాలయాలను చదువరులకు ఎలా అందుబాటులోకి తీసుకెళ్లాలి? గ్రంథాలయాలను రీడింగ్ సెంటర్లుగా మాత్రమే కాకుండా కమ్యూనిటీ సెంటర్ గా ఎలా మార్చాలి? ప్రస్తుత పాఠకుల అవసరాలు, భవిష్యత్తు పాఠకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయాలను ఉన్నతీకరించడం, ఈ దేశ యువతను పాఠకుల దేశంగా మార్చేందుకు, జ్ఞాన సంపన్నమైన దేశంగా రూపుదిద్దుకోవడానికి కావాల్సిన ఒక రోడ్డు మ్యాప్ కోసం కృషి చేస్తున్నది. 

రూ.100 కోట్ల బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం 2014లో నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గ్రంథాలయాలను అభివృద్ధి పరచడం, గ్రంథాలయాల సేవలను ఉన్నతీకరించడం, గ్రంథాలయాలను శాస్త్ర సాంకేతిక పద్ధతులను ఉపయోగించి మోడల్ గ్రంథాలయాలుగా తీర్చిదిద్దడం, జిల్లా కేంద్ర గ్రంథాలయంతో అనుసంధానం చేయడం తదితర కీలక అంశాలపై నేషనల్ మిషన్ ఆన్ ​లైబ్రరీస్​ కార్యక్రమం పనిచేస్తున్నది. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ లైబ్రరీస్​ ఫెస్టివల్​లాగానే.. ప్రతి రాష్ట్రంలో ఏటా ఓ ఫెస్టివల్ ​నిర్వహించి గ్రంథాలయాల అభివృద్ధికి ఆయా ప్రభుత్వాలు కృషి చేయాలి.

22 భాషల్లో కర్సివ్ ​రైటింగ్ ​పుస్తకాలు

ప్రముఖ గ్రంథాలయాల డైరెక్టరీని తయారు చేయడం వాటిని అందరికీ అందుబాటులో ఉంచడం. పాట్నా ఖుదాబక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ,  రాంపూర్ రజా లైబ్రరీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్ పర్షియన్ రీసెర్చ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ దీర్ఘకాలిక సహకార కార్యక్రమాల కోసం ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఈ మూడు గ్రంథాలయాలను అనుసంధానిస్తున్నారు. దేశంలో 22 స్థానిక భాషల్లో కర్సివ్ రైటింగ్ పుస్తకాలను చదువరులకు ఈ రెండు రోజుల ఫెస్టివల్​లో భాగంగా ఉచితంగా అందించనున్నారు. ఈ బుక్ ఫెస్టివల్​లో రౌండ్‌‌‌‌టేబుల్ చర్చలు, ప్యానెల్‌‌‌‌లు డిస్కషన్స్ జరగనున్నాయి. వాటిలో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ప్రముఖ గ్రంథపాలకులు, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు, యువ రచయితలు, సాహితీవేత్తలు, పుస్తక ప్రచురణ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా కార్టోగ్రఫీ, కాలిగ్రఫీ, కర్సివ్ రైటింగ్, ట్రైబల్ ఫాంట్స్, స్క్రిప్ట్‌‌‌‌లకు సంబంధించి10 ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. 

డా. రవికుమార్ చేగోని ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం