తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో ఒక పిల్లర్‌గా ఉన్న అడ్వకేట్లు తమ భద్రత గురించి భయపడే దుస్థితి ఏర్పడింది. ప్రొఫెషన్ కారణంగా అడ్వకేట్లు తమ ప్రాణాలకే ముప్పు ఎదుర్కోవాల్సి రావడం శోచనీయం. అడ్వకేట్ల రక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోవడంతో దాడులకు గురైన న్యాయవాదులకు సత్వర న్యాయం కూడా లభించడంలేదు. దాడుల కారణంగా న్యాయవాద కుటుంబ సభ్యులు సైతం తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి రావడానికి యువకులు సంకోచించే దుస్థితి ఏర్పడుతోంది.
దాడులతో అడ్వకేట్స్ ఆందోళన
రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు న్యాయవాదులపై పదుల సంఖ్యలో దాడులు జరిగాయి. గత మార్చి 24న న్యాయవాది ఎర్రబాబు హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 7న సీనియర్ అడ్వకేట్ ఎండి.ముజ్తబా ఆలీపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆగస్టు 26న కోర్టు ఆదేశాలు అమలు చేస్తున్న క్రమంలోనే తన్నీరు శ్రీకాంత్ అనే న్యాయవాదిపై దుండగులు దాడి చేశారు. దాంతో ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ మూడు దుస్సంఘటనలు ఎక్కడో మారుమూల కుగ్రామాల్లో జరగలేదు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డునే జరిగాయి. వరంగల్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మల్లారెడ్డిని కారు నుంచి బయటికి లాగి కత్తులతో పొడిచి చంపేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. అయినా, ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోవడం విచారకరం. 2024 ఆగస్టులో జనగామలో అడ్వకేట్ దంపతులు అమృతరావు, కవితలపై పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పోలీసులు చేయిచేసుకున్నారు. ప్రభుత్వం స్పందించి అప్పటి సీఐ, ఎస్ఐలపై కేసు నమోదు చేశారు.
వామన్‌రావు దంపతుల హత్య
నాలుగేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిలను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ఇటీవల సీబీఐకి అప్పగించింది. ఈక్రమంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయినా, ఇప్పటివరకు ప్రభుత్వం సదరు చట్టం తేలేదు. దీంతో రాష్ట్రంలో అడ్వకేట్లు మానసికంగా, శారీరకంగా దాడులకు గురవుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
తెలంగాణలో చట్టం తేవాలి
దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని అమలు చేస్తున్నాయి. కర్నాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగువేసి న్యాయవాదుల రక్షణకు చట్టపరమైన బలాన్ని ఇచ్చాయి. కర్నాటకలో న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారికి మూడేండ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, రాజస్థాన్‌లో రెండేండ్లు జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించేలా చట్టాలను అమల్లోకి తెచ్చారు. తెలంగాణలో సైతం ఇదే తరహా చట్టం తేవాల్సి ఉంది. దీనికోసం చట్టం పకడ్బందీగా రూపొందించాలి. న్యాయవాదుల రక్షణ అంటే కేవలం వారి వ్యక్తిగత భద్రత మాత్రమే కాదు, అది న్యాయం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన అంశంగా విస్తృత కోణంలో చూడాల్సి ఉంది.
సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలి
అత్యంత ప్రాధ్యాన్యతగల ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్వరం దృష్టి పెట్టాలి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను రాష్ట్రంలో తేవడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 50,785 మంది న్యాయవాదుల భద్రత, వారి కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ఈ చర్యలు తప్పనిసరి. ఉమ్మడి రాష్ట్రంలో2008లో ‘ఏపీ మెడికేర్ సర్వీస్ పర్సన్స్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్స్ యాక్ట్’ చేసి వైద్యులు, నర్సులు, సిబ్బంది, హాస్పిటల్స్‌కు భద్రత కల్పించారు. ఈ చట్టం ప్రకారం వైద్యులు, ఆస్పత్రులపై దాడులు చేసేవారికి మూడేండ్లు జైలుశిక్ష, రూ.50 వేలు జరిమానా విధించవచ్చు. ఇదే తరహాలో న్యాయవాదుల రక్షణ కోసం కూడా ఒక ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉంది.
- మానేటి ప్రతాపరెడ్డి,
అడ్వకేట్
