బీఆర్ఎస్ పార్టీ బీసీలను రౌడీలంటుంది. మరి బీసీలు ఏమంటారు? నన్ను అడిగితే బీఆర్ఎస్ నాయకులకు కండ్లు, చెవులు మూసుకుపోయినట్టు అనిపిస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం ముందుకువస్తుంటే బీసీలను రౌడీలు అనే దమ్ము, ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? 10 సంవత్సరాలు తెలంగాణను లూట్ చేసినందుకా? బిలియనీర్లుగా ఓట్లను కొంటాం అనే ధైర్యమా? అందుకేనా ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలలో బిలియనీర్ సైన్యాన్ని పెంచుకున్నది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు సమాజ్‌వాది పార్టీ మద్దతు ప్రకటించింది.ముఖ్యంగా సామాజిక, న్యాయ ఉద్యమానికి దశాబ్దాలుగా సోషలిస్టు/ సమాజ్‌వాదీలు ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో 2024 జనరల్ ఎన్నికలలో రాహుల్ గాంధీ సామాజిక న్యాయాన్ని జాతీయస్థాయిలో ముఖ్య ఎజెండాగా ప్రచారం చేసిండ్రు. అదేవిధంగా అఖిలేశ్‌యాదవ్ ఇండియా కూటమిలో తోడై కులగణన, అధికారం, అభివృద్ధిలో భాగస్వామ్యం, రిజర్వేషన్ల ఎజెండాతో బీజేపీని నిలువరించారు. దాంతో, సామాజికన్యాయ శక్తులు రాజ్యాంగాన్ని రక్షించుకోగలిగారు.
బీఆర్ఎస్కు ఓటమి భయం
బీసీ ఉద్యమ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలమైన బీసీ అభ్యర్థిని పోటీలో కాంగ్రెస్ ఉంచడంతో వారు గెలుపు అంచుల్లో నిలిచారు. ఓటమికి భయపడిన బీఆర్ఎస్ బీసీ ఉద్యమాన్ని కించపరుస్తూ బీసీ నాయకులను రౌడీలుగా ప్రచారం చేస్తోంది. బీజేపీతో కుమ్మక్కై బీఆర్ఎస్ ప్రచార హోరును పెంచింది. దీంతో ఉప ఎన్నికల కేంద్రంగా బీసీ నాయకత్వం పనికిరాదనే ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నారు. ఈ ఎన్నికలలో స్థానిక నాయకులుగా, మాస్ లీడర్లుగా, పేదల పక్షాన గత ఐదు దశాబ్దాలుగా సుపరిచితులుగా ఉన్న కుటుంబాన్ని అవహేళన చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ముందుకుపోతోంది. నికార్సైన తెలంగాణ భూమి పుత్రులుగా, సామాజిక న్యాయానికి బలమైన ప్రతినిధిగా కాంగ్రెస్ అభ్యర్థి ముందుకురావడం బిలియనీర్ రాజకీయాలకు ఎదురుదెబ్బగా బీఆర్ఎస్ భావిస్తోంది. బలమైన సామాజికవర్గ నేపథ్యంతో యువ నాయకుడు ముందుకువస్తే స్థానికేతర రాజకీయాలకు ముగింపు మొదలవుతుందనే భయంతో
బీఆర్ఎస్ బీసీలను రౌడీలు అంటున్నారు. ఎదుగుతున్న ప్రతి ఎస్సీ, బీసీ నాయకున్నీ అధికారాన్ని, పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని, అవమాన పరుస్తూ, రౌడీ షీటరుగా ప్రచారం చేస్తున్నది ఎవరు? పాలకవర్గంలో ఒక రౌడీషీటర్ కూడా ఎందుకు కనిపించరు? రాజ్యాంగ అధికారాన్ని కోరుకునే ప్రతి సామాజిక వర్గం ప్రశ్నించాలి.
అవినీతి అనకొండలను పెంచిన బీఆర్ఎస్
మరి రౌడీలు ఎవరు? పది సంవత్సరాల తెలంగాణ పాలనలో అవినీతి అనకొండలను పెంచింది బీఆర్ఎస్ అని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నది నిజం కాదా? అవినీతి అనకొండలను పోషించే నాయకత్వాన్ని రౌడీలందామా? గూండాలందామా? గజదొంగలని అందామా? గుడిసెవాసుల పట్ల, పేదలపట్ల గల్లీగల్లీనా కుటుంబ సంబంధాలతో నిలిచినవారిని రౌడీలందామా? తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 1,200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలు కాదా? అందులో 550
కుటుంబాలకు మాత్రమే కొంత సహాయం దొరికింది. మిగిలిన కుటుంబాలను విస్మరించి అగౌరవపరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇది అంటున్నది ఎవరో కాదు. బీఆర్ఎస్ మహానాయకుని కుటుంబ సభ్యులే? కనీసం అమరులైన ప్రాంతాలలోని స్కూళ్లకు, కాలేజీలకు వారి పేరు పెట్టినవారిని గౌరవించినవారుగా మిగులుతుండే.చదువును కోల్పోయి అవకాశాలకు దూరమై ఉద్యమంలో ముందున్న విద్యార్థులకు మీరు చేసింది ఏమిటి? 2014లో 11% గా ఉన్న విద్యా బడ్జెట్‌ను ఆరు శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్ ది కాదా? సమాజ అభివృద్ధికి విద్య కీలకమని తెలిసి కూడా కిందివర్గాల ప్రభుత్వ విద్యతో ఆడుకోవడం ద్రోహం కాదా? మరి బీఆర్ఎస్ మహా నాయకులను తెలంగాణ ద్రోహులు అని అందామా? త్యాగాన్ని కూడా గౌరవించని మీ సంస్కృతిని ఏమందాం?
బీసీల రిజర్వేషన్లు తగ్గించిన బీఆర్ఎస్
తెలంగాణ పోరుబాటలో అడుగడుగునా నిలబడి కొట్లాడింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదలు, స్త్రీలు, రైతులు, వ్యాపారులు కాదా? విధ్వంసానికి గురవుతున్న కులవృత్తుల ప్రదర్శనలతో రాష్ట్ర, దేశ రాజకీయాలను జాగృతం చేసిన సామాజిక వర్గాల నాయకులను రౌడీలు అంటావా? భౌగోళిక తెలంగాణ ముసుగులో సామాజిక తెలంగాణను అడ్డుకున్నది మీరు కాదా? కుట్రలతో, కుతంత్రాలతో మెజారిటీ సామాజికవర్గాల ఉద్యమ ఫలితాలను అనుభవిస్తూ వారిని అధికారంలో లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? స్థానిక సంస్థలలో దశాబ్దాలుగా 34 శాతాన్ని రిజర్వేషన్లు పొందుతున్న బీసీలను 22 శాతానికి తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? 60 శాతంగా ఉన్న బీసీలకు 22% చేసి ఏడు శాతంగా ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించింది బీఆర్ఎస్, బీజేపీలు కావా? బహుజనుల అధికార దోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్, ఓట్లు అడిగే హక్కు ఉన్నదా? విద్య, వైద్యాన్ని వ్యాపారంగా మార్చి తల్లుల పుస్తెలను తాకట్టుపెట్టిన స్థితికి దిగజార్చింది మీరు. పేద, మధ్యతరగతిని అప్పులపాలుచేసి అవినీతి అనకొండలుగా పాలించిన మీరు ఏ మొహంతో ప్రజల ముందుకు వస్తున్నారు? మీ పది సంవత్సరాల పాలనలో ఏ ఉద్యోగానికి నోచుకోక, నిరుద్యోగులను, విద్యావంతులను జీవచ్ఛవాలుగా మార్చింది బీఆర్ఎస్.
సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం
బీజేపీ గత 11 సంవత్సరాలుగా విద్వేషాన్ని పంచుతూ, రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తూ, మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తూ వస్తోంది. మత ఘర్షణలు సృష్టించడం, ప్రజాస్వామిక శక్తులమీద కేసులు పెట్టి జైలు పాలు చేయడం, ప్రజలలో నిరంతరం భయాన్ని నింపుతోంది బీజేపీ కాదా? రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడం జరుగుతోంది. ఓట్లచోరీకి ఎగబడి అధికారాన్ని చేపడుతోంది. ప్రచారవ్యవస్థను భయాందోళనలకు గురిచేస్తోంది. అలాంటి బీజేపీని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పార్లమెంటులో నిరంతరం సమర్థించారు. గత లోక్‌సభ ఎన్నికలలో 8 మంది బీజేపీ ఎంపీలను పరోక్షంగా సహకరించి గెలిపించింది బీఆర్ఎస్ కాదా? బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి రాజ్యాంగాన్ని మార్చాలన్నది నిజం కాదా? ఇన్ని రకాల దుశ్చర్యలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మభ్యపెడుతూ, మోసం చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి? ఇలాంటి రాజకీయులను ఓడించకుంటే రాష్ట్రానికి, దేశానికి ప్రమాదంగా మారుతాయి. కులతత్వ రాజకీయ కీచకలను ఓడిద్దాం. సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం. సామాజిక తెలంగాణ
రాష్ట్రాన్ని నిర్మించుకుందాం.
- ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి,
రాష్ట్ర అధ్యక్షుడు,
సమాజ్‌వాది పార్టీ తెలంగాణ
