రాష్ట్ర జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న వెనుకబడిన కులాలకు దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ ఆర్థికరంగాల్లో రావలసిన అవకాశాలలో 15 నుంచి 20% కూడా అందడం లేదు. జీవనాధారాలైన కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోయాయి. బీసీలు ప్రస్తుత అభివృద్ధి రంగాల్లో స్థానం లభించక వెనుకకు నెట్టి వేయబడ్డారని గత కొద్ది నెలలుగా బీసీ నాయకులు, అనేక సంఘాలు, మేధావులు సభలు, చర్చలు నిర్వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి విద్య, ఉద్యోగ అవకాశాలలో స్థానిక సంస్థల పదవులలో కల్పిస్తామని చెప్పింది. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ అనేక కుంటిసాకులు చెప్పుతూ రాజ్ భవన్ అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా తగువిధంగా స్పందించలేదు. ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత సామాజిక వర్గాలవారికి చట్టసభలలో ఆమోదించి రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చి ప్రధానమంత్రి మోదీ ఈ డబ్ల్యూఎస్ జీవోను జారీ చేశారు. అప్పటి సీఎం కేసీఆర్‌కూడా యధాతథంగా అమలుపరిచారు. అందుకు సమాజంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ, తెలంగాణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన ప్రక్రియకు కొందరు ఆధిపత్య వర్గాల వారు అడ్డు తగలడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
బీసీలకు దక్కని సీఎం పదవి
గత 79 ఏళ్లుగా కనీసం ఒక్క బీసీ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీలను మరింత అణచివేతకు గురి చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్లో కేవలం నిధులు లేని మంత్రి పదవులు రెండు మూడు కులాలకు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారు పాలకులు. శాసనమండలి, శాసనసభలలో వెనుకబడిన కులాల అభ్యర్థులు ఏనాడు 19 శాతం నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. 35 సంవత్సరాల నుంచి అమలుపరచిన ప్రైవేటీకరణ బీసీ ప్రజల పాలిట శాపంగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అభివృద్ధికి కావలసిన వనరులన్నీ ఆధిపత్య వర్గాలు సొంతం చేసుకున్నారు. బీసీ ప్రజలు క్రమంగా ఉపాధి, ఉద్యోగ, విద్య, వైద్య అవకాశాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎజెండాతో శాసనసభ ఎన్నికలకు వచ్చినప్పుడు మెజారిటీ బీసీ ప్రజలు మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందనేది ఒక వాస్తవం.
బీసీ బంద్ విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపిన బీసీ బిల్లు ఆమోదం పొందకపోవడంతో గత 50 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్న బీసీ నాయకులు, మేధావులు, కులసంఘాల వేదికలు సమష్టిగా బంద్‌కు పిలుపు ఇచ్చి మద్దతు పలికారు. ఈ నెల 18న నిర్వహించిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విచిత్రమేమంటే జాతీయస్థాయిలో బిల్లును సమర్థించని పార్టీలు, ఇంతకాలం బీసీలను అణచివేసిన పార్టీలు, నాయకులు కూడా తమ వంతు కర్తవ్యంగా బంద్‌కు మద్దతు పలికారు. బీసీ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాసు, ఇటీవల పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి చిరంజీవి, అనేక సంఘాలు, వేదికలు బీసీలకు జరుగుతున్న వివక్ష, అణచివేతను ముక్తకంఠంతో ఖండించారు. బీసీ ప్రజలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు, ఇతర వర్గాల ప్రజలు, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, రవాణా సంస్థలు యజమానులు కూడా బంద్‌కు తమ వంతు మద్దతు పలికారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో కూడా బీసీ బంద్ ప్రభావం చూపడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం.
జూబ్లీహిల్స్ గెలుపు బీసీ వాదానికి మలుపు
ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల ముగ్గురు అభ్యర్థులలో కాంగ్రెస్ తరఫున బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ఉన్నాడు. మూడు ప్రధాన పార్టీల్లో ఇద్దరు ఆధిపత్య కులాలకు సంబంధించిన అభ్యర్థులే అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఆధిపత్య వర్గాల ఓట్లు 50–-60 వేలకు మించకపోవచ్చు. బీసీ సామాజిక వర్గాలకు, నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక ఒక అందివచ్చిన అవకాశంగా భావించాలి. బీసీ సంఘాలు, నాయకులు, బీసీ వేదికలు, మేధావులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు బీసీలకు సంబంధించిన వివిధ పార్టీలలో మనుగడ సాగిస్తున్న బీసీ రాజకీయ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించి గెలిపించవలసిన అవసరం ఉంది. ఇక్కడ విజయం బీసీ సామాజిక ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని వేరే చెప్పనవసరం లేదు. బీసీ బంద్‌కు మద్దతు ఇచ్చినవారందరూ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచినప్పుడు తప్పక బీసీ వాదం గెలుస్తుంది. మున్ముందు బీసీవాదం మరింత ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.
బీసీ వాదాన్ని సమర్థించాలి
ఈ సందర్భంలో బీసీవాదులు, బీసీవాదాన్ని సమర్థించే సామాజిక వర్గాలు కూడా అదే స్పిరిట్‌తో మద్దతు పలకడం అవసరం. బీసీ ఉద్యమ చరిత్రలో ఈ ఎన్నిక బీసీ ప్రజలకు ఒక ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణించాలి. ఇంతకాలం నుంచి బీసీ ప్రజలను అణచివేస్తున్న పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థి విజయం ఒక కనువిప్పుగా మారుతుంది. బీసీ నినాదం ఒక ఉద్యమ స్వరూపాన్ని పొందుతున్న దశలో బీసీ బిడ్డను గెలిపించుకోవలసిన బాధ్యత బీసీలపై ఉంది. బీసీ కులాల సానుభూతిపరులైన మైనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఓటర్లు, నాయకులు కూడా బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలకాలి. పార్టీలకు అతీతంగా బీసీలకు సంబంధించిన ఓటర్లు, నాయకులు, సంఘాలు కృషి చేయవలసిన సందర్భం ఇది. ఈసారి తప్పిదం చేస్తే అది అత్యంత ఖరీదైనదిగా భావించాల్సిన దుర్గతి ఏర్పడుతుంది.
- ప్రొఫెసర్ కూరపాటి
వెంకట్ నారాయణ
