విదేశాల్లో మన పండుగలపై తిరుగుబాటు

విదేశాల్లో మన పండుగలపై తిరుగుబాటు

ఈ దీపావళి పండుగ తరువాత అమెరికాలో, కెనడాలో,  ఆస్ట్రేలియాలో మన దేశస్తులు అక్కడ పండుగలు జరుపుకునే పద్ధతి కొంత బలమైన తిరుగుబాటు దాల్చింది.  దీపావళి సందర్భంగా క్రాకర్లు చాలా దేశాల్లో కాల్చినందువల్ల కొన్ని ఇండ్లు తగలబడ్డాయి.  రోడ్లపై ఇండియాలో కాల్చినట్టే  క్రాకర్లు కాల్చడంతో  ఆయా దేశాల ప్రజలు చాలా అసహనానికి గురయ్యారు.  టెక్సాస్​ వంటి రాష్ట్రంలో అలా జరుపుకోవడానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు కూడా జరిగాయి. ఇంతేకాదు  ఈ మధ్యకాలంలో మన దేశస్తులపై  దాడులు,  అకస్మాత్తుగా హత్యలు జరగడం అమెరికాలో చాలా కనిపిస్తోంది. ఈ పరిస్థితి విదేశాల్లో సెటిల్ అయినవారికి, కొత్తగా వెళ్లాలనుకునేవారికి చాలా ఆందోళనకరమైన సమస్య. అక్కడకిపోయి చదువుకునే విద్యార్థులకు కూడా అవి అన్నిరకాల భయాందోళనలకు సంబంధించిన సమస్య కూడా.  ట్రంప్​ రెండోసారి అధ్యక్షుడయ్యాక అన్ని రకాలుగా ఇండియన్లపై ఆంక్షలు, తిరుగుబాటులు కనిపిస్తున్నాయి.  ఈ  తిరుగుబాట్లు మతరూపం కూడా తీసుకుంటున్నాయి.  ‘ఇండియన్​ గో బ్యాక్’ అంటూ నినాదాలు ఇవ్వడమే కాకుండా ఇతరత్రా మతపర దూషణలు అందరినీ కలిపి చేస్తున్నారు.  గత ఐదారేండ్లలో ఇండియన్​ ఎన్ఆర్ఐ (నాన్​ రెసిడెంట్ ఇండియన్స్) మీద ఇటువంటి తిరుగుబాటు ఎక్కువైంది. 

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇండియన్​ మైగ్రెంట్ల మీద అమెరికా, ఆస్ర్టేలియా వంటి దేశాలలో ఇండియన్లకు  ఆదరణ బాగా పెరిగిందని అక్కడ పండుగలు, పబ్బాలు ఎక్కువ చేయడం, ప్రధానమంత్రితో సహా మంత్రులు, ఇతర పార్టీ నాయకులు అక్కడ బహిరంగ సభలు, హాలు సభలు పెట్టడం ఎక్కువైంది. ఇస్లాంపై అక్కడ వ్యతిరేకత పెరుగుతుందని, ఇండియన్లు ధనవంతులు, మధ్య తరగతివారు అమెరికా యూరప్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు చాలా ఎక్కువ మైగ్రెట్ కావడం కూడా మొదలైంది.  తెలంగాణ  కులగణన  లెక్కల్లో స్పష్టంగా కనిపించింది ఏమిటంటే ఆగ్రకులాలవారు విద్యకోసం, సుఖవంతమైన జీవితంకోసం, అమెరికా భూమి స్వర్గమైనట్టు ఎక్కువ మైగ్రెట్ కావడం స్పష్టంగా కనిపించింది.  ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆ స్థాయిలో మైగ్రెట్ కాలేదు.  అయితే, అన్ని రాష్ట్రాల నుంచి మైగ్రెట్ అయినవారు కూడా తమతోపాటు ఇక్కడ  పండుగల పద్ధతులు, ఆచార వ్యవహారాలు, తిండి అలవాట్లను సహజంగానే  అన్ని దేశాలకు తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్న జాతీయవాద ప్రచారం, అక్కడ సంస్థల స్థాపన, బాహాటంగా వీధి పండుగలు చెయ్యడం మొదలుపెట్టారు. 

పండుగల తీరు

మనదేశంలో రెండు రకాల పండుగలు ఉన్నాయి. 1. ప్రకృతిని ఆరాధించే పండుగలు. అవి పంటలను, నీటివనరులను, కాయపండ్ల సీజన్లను ఆరాధించేవి. అటువంటివే  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ వంటి పండుగలు.  చరిత్ర  పొడవునా ఇవి ఇండ్లల్లో మహాయితే హాలు మీటింగుల ద్వారా సెలబ్రేషన్​ జరిగేది. ఇప్పుడు దాదాపు అలానే జరుగుతాయి. 2. మతపర పండుగలు. చారిత్రకంగా మతపర పండుగలు పలు మతాలున్న ఈ దేశంలో ఇండ్లలోనూ, దేవాలయంలోనూ చేసుకునేవారు. క్రమంగా మతపర పండుగలను ఈ దేశంలో పరస్పర పోటీ పండుగలుగా, వీటిని క్రమంగా రాజకీయ పండుగలుగా జరపడం స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మొదలైంది. ఈక్రమంలోనే పండుగల్లో ఊరేగింపులు, పరస్పర ఘర్షణలు కూడా మొదలయ్యాయి. ఇండ్లల్లో, గుడుల్లో జరుపుకునే 
వినాయకచవితిని మొదట మహారాష్ట్రలో, దుర్గాపూజ పండుగను బెంగాల్లో జాతీయోద్యమ కాలంలో రోడ్ల మీదకి తెచ్చారు. 

రాజకీయ సమీకరణలకు సాధనంగా పండుగలు

ఈ పండుగలను రాజకీయ సమీకరణలకు సాధనంగా వాడుకోవడం బ్రిటిష్​ వ్యతిరేక దృష్టితో ప్రారంభమై క్రమంగా ఆచారంగా మార్చారు. ఈ క్రమంలో ముస్లింలు కూడా పండుగల సందర్భంగా ఊరేగింపులు, పెద్ద ఎత్తున పురుషుల  సమీకరణలు ప్రారంభమై ఆ పద్ధతి ఒక ఆచారంగా మార్చారు. అవి కేవలం పురుష ఊరేగింపులుగా సాగుతాయి. ఇక్కడ కూడా స్త్రీ, పురుష అసమానత అడ్డుగోడ  ఇండియన్​ ఇస్లాంలోనూ కొనసాగుతోంది. రోడ్లమీద  మండపాలు కట్టడం, వారాల  తరబడి  పండుగ ప్రక్రియ జరపడం ఈ దేశంలో అలవాటైంది. అది ఓట్ల రాజకీయాలతో ముడేసి జనసమీకరణలు,  ఐడియాలజికల్​ ఓట్ల మలుపుకు కూడా పండుగలు ఉపయోగపడుతున్నాయి. ఈ దేశంలో రోడ్లపైన, వందల వేల జనసమీకరణ ద్వారా పండుగలు జరుపుకోవడాన్ని వ్యతిరేకించి, వాటిని ఇండ్లకు,  గుడులకు, మసీదులకు మాత్రమే పరిమితం చేయగలిగే స్థితి చేయిదాటిపోయింది. ఇప్పుడు అదే పద్ధతులను విదేశాలకు ఎగుమతి చేసేవరకు, ఇప్పడు అది ప్రపంచీకరణ బతుక్కు తీవ్రమైన సమస్యలుగా  వస్తున్నాయి.

దీపావళి

దీపావళి గత కొంతకాలంగా దీపాల పండుగగా అంటే ( ఎ ఫెస్టివల్ ఆఫ్​ లైట్స్)గా  అమెరికాలో కొంత ప్రాచుర్యం పొందింది.  క్రమంగా  ఒబామా టైమ్​లో అక్కడి ఇండియన్లు  ఆయనను  ప్రభావితం చేయడంతో  వైట్​హౌస్​లో  లైటింగ్​లాంప్​ పండుగగా సెలబ్రేట్​ చేయడం మొదలైంది. అమెరికాలో, ఇంగ్లాండు, కెనడాలో ఇండియన్​ ఓటర్ల సంఖ్య పెరిగింది కనుక ఇది ఒక అప్పీజ్​మెంట్ పండుగగా కూడా మారింది. ఈ పండుగను ఒక ఇండియన్​ కల్చరల్​ సింబల్​గా కూడా ప్రచారం చేశారు.  కానీ, ఈ  సంవత్సరం కథ కాస్త అడ్డం తిరిగింది.  ఈ పండుగ సందర్భంగా కాలుస్తున్న క్రాకర్స్,  గాలిపైన,  దేశ వాతావరణంపై చర్చ చాలాకాలంగా జరుగుతోంది. కానీ,  రైట్​వింగ్ రాజకీయ  శక్తులు తమ ఇష్టమొచ్చినట్టు ప్రజలను జరుపుకోనివ్వాలని, క్రాకర్స్​ రోడ్లమీద, దుకాణాల వద్ద అతిగా చేసినా అడ్డుకోకూడదనే  రాజకీయం నడుస్తూ వచ్చింది. ఈ సంవత్సరం ఢిల్లీ నగరం బీజేపీ ముఖ్యమంత్రి నేతృత్వంలో  ఈ పండుగకి, ముఖ్యంగా  క్రాకర్​ ఇండస్ట్రీకి, యధేచ్ఛగా కాల్చుకునే అవకాశమిచ్చారు.  దానివల్ల 4, 5 రోజులు ఢిల్లీ  ప్రజలు ఆక్సిజన్​ పీల్చుకోలేని స్థితిలోకి నెట్టబడ్డారు. ఈ జోరునే ఈ సంవత్సరం అమెరికాలో చూపించారు.  ఫలితం చాలా ఇండ్లు కాలిపోవడం,  దాన్ని అమెరికావాసులు ఒక అసభ్య సెలబ్రేషన్​గా పరిగణించడం మొదలైంది.  ట్రంప్​ నామమాత్రంగా దీపావళి జరిపినా, దీనిపై 
తిరుగుబాటు వచ్చింది. 

ఇదొక హెచ్చరిక

గతంలో యూరోపియన్​ దేశాల్లో ముస్లిం మైగ్రెట్స్​లోని  కల్చరల్​ ప్రాక్టీసెస్​ ముఖ్యంగా స్త్రీల హిజాబ్, బుర్ఖావంటి అంశాలపై చాలా అభ్యంతరాలు వచ్చాయి. ముస్లిం దేశాలలో బతుకలేక వలసవెళుతున్న ప్రజలను చాలా దేశాల్లో రానివ్వమని అక్కడి ప్రజలు గొడవలు చేశారు. ఆ దశలో ఇండియన్​ మైగ్రెట్స్​తమ హద్దులో ఉంటారనే అభిప్రాయం కూడా పాశ్చాత్య దేశాల్లో ఉండేది. కానీ, క్రమ క్రమంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ దేశ మైగ్రెట్స్​ తమ మత ప్రాక్టీసును రోడ్లమీదకు తేవడం,  ఆ ప్రాక్టీస్​ ఆయా దేశాల్లోని మత ప్రాక్టీసులకు చాలా భిన్నంగా ఉండడం వారిలో కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది.  ఆయా దేశాల్లో హిందూత్వ మత సంస్థలు పెట్టి బాహాటంగా పండుగలు, ప్రచారం చేయడం ఎక్కువైంది. ట్రంప్​ రెండోసారి గెలిచాక అమెరికాలో, యూరప్​ దేశాల్లో కూడా తమతమ మత రాజకీయవాదం సెక్యులర్​ రాజ్యవ్యవస్థలోకి చొచ్చుకు రావడం మొదలైంది. 

గత 30 ఏండ్లు ఇక్కడి ఇంజినీరింగ్​ కాలేజీల నుంచి అమెరికా, యూరప్​లలో ఉద్యోగాల కోసం అన్నట్టు డబ్బులతో డిగ్రీలు పొందడం, అక్కడికిపోయి చిన్న, చితక ఉద్యోగాల్లో చేరి రాజకీయ ప్రచారకులుగా మారడం కూడా మొదలైంది.  గ్లోబలైజ్ ప్రపంచంలో  సంస్కృతులు ఒక దేశం నుంచి మరో దేశం పోకుండా ఉండయి.  కానీ, మత సంబంధిత సంస్కృతులు ఇండ్లకు, గుడులకు, మసీదులకు, చర్చిలకు పరిమితమైతే తప్ప క్రిస్టియానిటీ, హిందూయిజం, ఇస్లాం దేశాల్లో రాజ్యవ్యవస్థ సజావుగా సాగడం కష్టం.  బుద్ధిజం ఇటువంటి సాంస్కృతిక సంఘర్షణలలో తక్కువగా కనబడుతుంది. ఉదాహరణకు చైనా, ఇతర బుద్ధిస్టు దేశాల నుంచి వచ్చిన ప్రజలు కూడా అమెరికా, యూరప్​ దేశాల్లో బలంగా ఉన్నారు. కానీ, వాళ్లు పండుగలతోగాని, జీవన విధానంతోగాని పాశ్చాత్య దేశాలతో సంఘర్షణ పడటం లేదు.  వాళ్లకు  తమతమ పండుగలు లేవని కాదు.  కానీ, వారు ఇంటికి పరిమిత సంస్థలకు, విహారాలకు మాత్రమే జరుపుతుంటారు. భారతీయులు కూడా విదేశాల్లో ఉండి అభివృద్ధి చెందాలంటే ఆయా దేశ నిబంధనల్లో బతకడం మంచిది. లేకపోతే మునుముందు ఆయా దేశాల్లోని భారతీయులందరికి తీవ్రమైన సమస్యలు తెస్తాయి. 

తెలంగాణ ఉద్యమం, బతుకమ్మ

తెలంగాణలోని  బతుకమ్మ  కేవలం  ప్రజల పండుగ.  దాన్ని  కేసీఆర్​ కుటుంబం అమెరికాలో ఉన్న కవితను దింపి రాజకీయ పండుగ చేసింది. దాన్ని అమెరికాలో,  ఇంగ్లాండ్​లో,  దుబాయిలో స్ట్రీట్ పండుగగా మార్చి డబ్బులు వసూలు చేయడం, ఇక్కడి నుంచి ఫోక్​ సింగర్స్​ను అక్కడికి తీసుకెళ్లడం  మొదలుపెట్టారు.  ఇప్పుడు దీపావళితోపాటు బతుకమ్మ కూడా అమెరికా, బ్రిటిష్​ ప్రజల కోపాగ్నికి గురయ్యే పండుగగా మారింది. 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​