
జొహన్నెస్‌బర్గ్: వన్డే కెప్టెన్సీ విషయంలో వివాదంలో చిక్కుకున్నప్పటికీ గత 20 రోజులుగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా గొప్పగా ముందుకెళ్లాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. విరాట్ గొప్ప లీడర్ అని కితాబిచ్చాడు. కొంతకాలంగా ఫామ్‌లో లేని కెప్టెన్ తొందర్లోనే పెద్ద స్కోర్లు చేస్తాడన్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు వన్డే కెప్టెన్‌గా తనను తప్పించిన విషయంలో బీసీసీఐ గంగూలీ వ్యాఖ్యలతో విభేదించిన తర్వాత కోహ్లీ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. మ్యాచ్‌లకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కూడా రాకపోవడంతో వివాదం ఇంకా ముగిసిపోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో సెకండ్ టెస్టుకు ముందు ఆదివారం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్ ఈ విషయాలపై స్పందించాడు. ‘బయట చాలా గందరగోళ పరిస్థితి ఉందని నాకు తెలుసు. ఈ మ్యాచ్‌కు ముందూ అలానే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్‌లోనూ కోహ్లీ తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, టీమ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా చూసుకుంటున్నాడు. ఇది చాలా కష్టమైన పని. అయినా గత 20 రోజుల నుంచి కోహ్లీ అద్భుతంగా పని చేస్తున్నాడు. తను ట్రెయినింగ్, ప్రాక్టీస్‌లో పాల్గొనడం నుంచి టీమ్‌మేట్స్‌తో కనెక్ట్ అవుతున్న విధానం అద్భుతం. తనో గొప్ప లీడర్’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇక, విరాట్ మీడియాకు దూరంగా ఉండటం వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేదన్నాడు. ఈ సిరీస్‌లో థర్డ్ టెస్టు కోహ్లీకి వందో మ్యాచ్ అని, దానికి ముందు తను మీడియాతో మాట్లాడి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడని చెప్పాడు.