యాంటీబాడీ టెస్ట్ కిట్.. రూ.75 కే ఒకరికి టెస్ట్

యాంటీబాడీ టెస్ట్ కిట్.. రూ.75 కే ఒకరికి టెస్ట్
  • అభివృద్ధి చేసిన డీఆర్డీవో
  • జూన్ మొదటి వారంలో మార్కెట్లోకి రిలీజ్
  • 75 నిమిషాల్లోనే రిజల్ట్.. రూ. 75కే ఒకరికి టెస్ట్ 
  • ఒక్క కిట్​తో వంద టెస్టులు చేయొచ్చు


న్యూఢిల్లీ:  కరోనా పేషెంట్లకు బాగా ఉపయోగపడే 2డీజీ మందును ఇటీవలే రిలీజ్ చేసిన డీఆర్డీవో.. కరోనా యాంటీబాడీలను గుర్తించే టెస్ట్ కిట్ ను కూడా త్వరలో విడుదల చేయనుంది. ‘డిప్ కొవాన్’ పేరుతో డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ కిట్​తో 99 శాతం కచ్చితత్వంతో కరోనా వైరస్​ను గుర్తించొచ్చని శుక్రవారం రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? సంబంధిత వ్యక్తులకు ఇప్పటికే కరోనా సోకిందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు డిప్ కొవాన్ కిట్లు బాగా ఉపయోగపడతాయని తెలిపారు.  ఢిల్లీలోని డీఆర్డీవోకు చెందిన డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డీఐపీఏఎస్), వాన్ గార్డ్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ టెస్ట్ కిట్​ను సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కొవిడ్ దవాఖాన్లలో వెయ్యి మంది పేషెంట్ల నుంచి సేకరించిన శాంపిల్స్ ను డిప్ కొవాన్ తో టెస్ట్ చేయగా మంచి ఫలితాలు వచ్చాయని రక్షణ శాఖ తెలిపింది. డిప్ కొవాన్ ఉత్పత్తి, అమ్మకానికి ఐసీఎంఆర్, డీసీజీఐ, సీడీఎస్సీవో అనుమతులు కూడా వచ్చాయని పేర్కొంది.

డిప్​కొవాన్​ టెస్ట్​ కిట్

మనుషుల సీరం (ప్లాస్మా)లో కరోనా వైరస్ యాంటీజెన్ లకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇమ్యునోగ్లోబులిన్ జీ ప్రొటీన్ (యాంటీబాడీ)లను డిప్ కొవాన్ గుర్తిస్తుంది. దీనితో 75 నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది. ఒక్కో కిట్ షెల్ఫ్​లైఫ్​18 నెలలు ఉంటుంది. ఒక్కో కిట్ తో వంద టెస్టులు చేయొచ్చు. రూ. 75కే ఒక టెస్టును నిర్వహించొచ్చు. డిప్ కొవాన్ కిట్లను వాన్ గార్డ్ కంపెనీ జూన్‌ మొదటి వారంలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. మొదట100 కిట్లు (10 వేల టెస్టులు చేయొచ్చు) మార్కెట్లోకి విడుదల కానున్నాయి. తర్వాత ప్రతి నెలా 500 కిట్లు (50 వేల టెస్టులు చేయొచ్చు) అందుబాటులోకి రానున్నాయి.