కర్నాటక టెంపుల్స్​లో డ్రెస్​ కోడ్​!

కర్నాటక టెంపుల్స్​లో డ్రెస్​ కోడ్​!
  •  అమలుకు ఆ రాష్ట్ర దేవాలయాల సమాఖ్య ప్రతిపాదనలు

బెంగళూరు: కర్నాటకలోని ఆలయాల్లో భారతీయ సంస్కృతికి అనుగుణంగా డ్రెస్​ కోడ్ అమలుచేయాలని ఆ రాష్ట్ర దేవాలయాల సమాఖ్య ప్రతిపాదించింది. బెంగళూరులోని 50 టెంపుల్స్​ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 500కు పైగా ఆలయాల్లో దీనిని అమలు చేయాలని యోచిస్తున్నది. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో డ్రెస్‌‌‌‌ కోడ్‌‌‌‌ను అమలు చేయాలని ఆ శాఖ మంత్రి రామలింగారెడ్డికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. 

ఈ మేరకు కర్నాటక దేవస్థానం -మఠం మట్టు ధార్మిక సంస్థల మహాసంఘ కన్వీనర్ మోహన్ గౌడ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కొన్ని ఆలయాల్లో డ్రెస్‌‌‌‌ కోడ్‌‌‌‌ అమలవుతుంటే.. కొందరు అభ్యుదయవాదులు, హేతువాదులు, భావప్రకటన స్వేచ్ఛా వాదులు గొంతు చించుకుంటున్నారని.. ఇతర మతాల వారు తెల్లటి, నల్లటి డ్రెస్​లు ధరించినా వారు వ్యతిరేకించరని విమర్శించారు.

 దైవ దర్శనం కోసం సంప్రదాయేతర దుస్తుల్లో వెళ్లడం భావప్రకటన స్వేచ్ఛ కాదన్నారు. ప్రతి ఒక్కరికి ఇంట్లో, బహిరంగంగా తమకు నచ్చిన బట్టలు ధరించే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, కానీ, ఆలయాలు, మతపరమైన ప్రదేశాల్లో అక్కడి సంప్రదాయం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.