
విశాఖపట్నం: బంగ్లాదేశ్‌ను అక్రమ రవాణా అవుతున్న బంగారాన్ని నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి యశ్వంత్‌పూర్ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బండిలో దాదాపు నాలుగు కిలోల బంగారంతో ఓ స్మగ్లర్ ప్రయాణిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు పక్కా సమాచారం అందింది. విశాఖ స్టేషన్‌కు రైలు చేరుకోగానే స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 3.98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చి, దానిని కోల్‌కతాలో కరిగించి గాజులు, అచ్చుల రూపంలోకి మార్చి తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఆర్‌ఐ వెల్లడించింది. తాము స్వాధీనం చేసుకున్న బంగారం కోటీ 91 లక్షల రూపాయల వరకు విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన స్మగ్లర్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జుడిషియల్ కస్టడీ విధించినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని విశాఖపట్నం డీఆర్‌ఐ రీజినల్ ఆఫీస్ వెల్లడించింది.