
- క్వింటాల్ రేటు రూ.10 వేల నుంచి రూ.14,500 వరకు
- ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి జోరుగా ఆర్డర్లు
- సాగు విస్తీర్ణం పావు వంతుకు పడిపోవడంతో రేట్లు పైపైకి
- గత నెలతో పోలిస్తే అన్ని రకాలకు క్వింటాల్ రూ.500 పెరిగింది
- కోల్డ్ స్టోరేజీల్లో భారీగా మిర్చి నిల్వలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ మిర్చి యార్డుల్లో ఎండుమిర్చికి ధరలు పెరుగుతున్నాయి. చైనా, థాయ్‌లాండ్, శ్రీలంక, మస్కట్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఎగుమతి ఆర్డర్లు పెరగడం, సరుకు లభ్యత తగ్గడంతో ధరలు పుంజుకుంటున్నాయి. గత నెలతో పోలిస్తే అన్ని రకాల మిర్చి ధరలు క్వింటాల్‌కు రూ.500 పైగా పెరిగాయి. ఖమ్మం మార్కెట్‌లో నాణ్యమైన తేజా రకం ఎండుమిర్చి ధర బుధవారం క్వింటాల్‌కు రూ.14,500, గురువారం రూ.14,400, మంగళవారం రూ.14,350 వరకు పలికింది. సగటు ధరలు రూ.13,500 నుంచి రూ.14,000 మధ్యలో ఉన్నాయి. నాణ్యమైన సరుకు ఉంటే వ్యాపారులు ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని రైతులు, వ్యాపారులు ఆచితూచి మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తున్నారు.
విదేశీ వ్యాపారుల కోనుగోళ్లు
సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీలకు కారంపొడి ఎగుమతులు జోరందుకున్నాయి. ధరలు కాస్త తక్కువగా ఉండటంతో విదేశీ వ్యాపారులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో మిర్చి సాగు తగ్గుతుందన్న అంచనాలు కొనుగోళ్లకు ఊతమిచ్చాయి.
తగ్గిన.. సాగు, దిగుబడులు
ఈ సీజన్‌లో మధ్యప్రదేశ్‌లో పచ్చిమిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పంట కోసి విక్రయిస్తున్నారు. అయితే, ఎండుమిర్చి దిగుబడి తక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో మిర్చి నాట్లు ఊపందుకోవాల్సి ఉండగా, ఇంతవరకు సాగు ముమ్మరం కాలేదు. ఎకరాకు నాటు నుంచి దిగుబడి వచ్చే వరకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి ఖర్చవుతున్నది. గతేడాది గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి రాక పోగా, అదనపు భారం పడింది. కొందరు రైతులు ధర వస్తుందనే ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కొందరు రైతులు నిల్వ చేద్దామన్నా అప్పటికే కోల్డ్ స్టోరేజీలు నిండిపోవడంతో అగ్గువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మిరప సాగు పావు వంతకు పడిపోయింది.
ఈ నెలాఖరుకు సాగుపై స్పష్టత
రాష్ట్రంలోని మిర్చి విత్తన మార్కెట్, నర్సరీల్లో మర్చి నారు సందడి లేకపోవడంతో మిరప సాగు విస్తీర్ణంపై స్పష్టత లేకుండా ఉంది. ఆగస్టు నెలాఖరుకు సాగు వివరాలు స్పష్టమైతే, మార్కెట్ ధోరణి అందుకు అనుగుణంగా ఉంటుందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగుమతి గిరాకీ, తగ్గుతున్న సాగు విస్తీర్ణం నేపథ్యంలో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.