టన్నెల్ పైనుంచి కూడా.. నిట్టనిలువునా డ్రిల్లింగ్

టన్నెల్ పైనుంచి కూడా.. నిట్టనిలువునా డ్రిల్లింగ్
  • మెషిన్ లోపంతో శుక్రవారం నిలిచిన డ్రిల్లింగ్ 
  • శనివారం మళ్లీ ప్రారంభం
  • వారంరోజులుగా టన్నెల్ లోనే 41 మంది కార్మికులు 
  • ఆందోళనలో వర్కర్ల కుటుంబసభ్యులు

ఉత్తరకాశి:  ఉత్తరాఖండ్ లోని టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు శనివారం మళ్లీ ప్రారంభమయ్యాయి. కార్మికులను కాపాడేందుకు 60 మీటర్ల మేరకు శిథిలాల గుండా సమాంతరంగా డ్రిల్లింగ్ చేసి, భారీ పైపులతో ఎస్కేప్ రూట్ సిద్ధం చేయాల్సి ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటల వరకు 24 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయింది. ఆ తర్వాత మెషిన్ మొరాయించడంతో పనులు నిలిపివేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి మరో మెషిన్ తెప్పించారు. భారీ డ్రిల్లింగ్ యంత్రాన్ని శనివారం ఎయిర్ ఫోర్స్ విమానంలో మూడు భాగాలుగా ఉత్తరాఖండ్ కు తరలించి పనులు ప్రారంభించారు. అలాగే టన్నెల్ పైవైపు నుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ చేపట్టారు. 

కుటుంబసభ్యుల పడిగాపులు.. 

కార్మికులు టన్నెల్ లో చిక్కుకుని వారం రోజులవుతోంది. కానీ రెస్క్యూ ఆపరేషన్ లో ఎలాంటి పురోగతి లేదని కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యల్లో ఆలస్యమవుతోందని ఆవేదన చెందుతున్నారు. రోజులు గడిచే కొద్దీ తమవాళ్ల ఆరోగ్యం దెబ్బతింటోందని వాపోతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు చాలామంది టన్నెల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు.  

ఎస్కేప్ రూట్ నిర్మించలే.. 


టన్నెల్ నిర్మాణంలో అతిపెద్ద లోపం బయటపడింది. ఎస్కేప్ రూట్ నిర్మించడాన్ని కన్ స్ట్రక్షన్ కంపెనీ విస్మరించిందని తెలిసింది. 3 కి.మీ.పైగా పొడవు ఉండే టన్నెల్స్ నిర్మిస్తే, ఎస్కేప్ రూట్ కూడా ఉండాలి. టన్నెల్ లో ప్రమాదం జరిగితే, అక్కడ చిక్కుకున్నోళ్లను రక్షించేందుకు ఎస్కేప్ రూట్ ఉపయోగపడుతుంది. ప్రస్తుత టన్నెల్   4.5 కి.మీ. ఉన్నందున ఎస్కేప్ రూట్ నిర్మించాలని ప్లాన్ లో ఉన్నా.. కంపెనీ దీనిని అమలు చేయలేదు.