
ఓ మధ్య తరగతి వ్యక్తి. భార్యాపిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. అంతలో ఓ వ్యక్తి వారి జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. వారి చేతుల్లోనే కన్ను మూస్తాడు. ఆ మర్డర్ కేసులో ఇరుక్కోకుండా తన ఫ్యామిలీని కాపాడుకోడానికి ఆ తండ్రి ఎలా ఆరాటపడ్డాడో, ఆ గండం నుంచి ఎలా బయటపడ్డాడో ‘దృశ్యం’లో చూశారు ప్రేక్షకులు. అప్పుడు క్లోజైపోయిన కేసును ఇప్పుడు మళ్లీ తిరగదోడితే ఆ వ్యక్తి సంఘర్షణ ఎలా ఉంటుందో ‘దృశ్యం 2’లో చూడ బోతున్నారు. వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ తీసిన ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ఒక పాట రిలీజయ్యింది. ‘ఎన్నో కలలు కన్నా.. అన్నీ కలతలేనా.. చుట్టూ వెలుతురున్నా.. నాలో చీకటేనా.. ఇంకా ఎన్నాళ్లో కన్నీళ్లూ, ఇంకా ఎన్నేళ్లో భయాలు.. ఇకపై ముగిసేనా ఏకాంతాలు’ అంటూ సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. ‘ఏది నిజమో, ఏది మాయో.. ఏది పగలో, ఏది రాత్రో తెలియకుండా బ్రతుకుతున్నానిలా.. అలజడులలో అలసి పోయానిలా’ అంటూ హీరో పరిస్థితిని చాలా చక్కగా వివరిస్తూ రాశారు చంద్రబోస్. అనూప్ రూబెన్స్ ట్యూన్, శ్రేయా ఘోషల్ సింగింగ్ ఆకట్టుకుంటున్నాయి.