
ఎక్కడో దూరంలో యాక్సిడెంట్ జరిగింది. వెంటనే రక్తం కావాలి. ఓ మారు మూల పలెల్లో, కొండ ప్రాంతంలో తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడో పేషెంట్. అతడి రక్తం శాంపిల్‌ను పంపాలి. ఓ నగరంలో భారీ ట్రాఫిక్ జాం. మరోవైపుకు అర్జెంటుగా రక్తం అందించాలి. ఇలాంటి కష్ట సమయాల్లో చటుక్కున రక్తాన్ని, శాంపిల్‌ను పంపేందుకు ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేసిన సరికొత్త ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా మనుషులు వెళ్లలేని ఓ మారుమూల ప్రాంతం నుంచి రక్తాన్ని డ్రోన్ ద్వారా పంపి సక్సెసయింది. ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లా నంద్‌గావ్‌లో ఈ ప్రయోగం జరిగింది. తెహ్రీ ఘర్‌వాల్ టెలీ మెడిసిన్ ప్రాజెక్టులో భాగంగా చేశారు. నంద్‌గావ్ పీహెచ్‌సీ నుంచి తెహ్రీలోని బురారీ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి బ్లడ్ శాంపిల్‌ను డ్రోన్ ద్వారా పంపారు. 36 కిలోమీటర్ల దూరాన్ని 18 నిమిషాల్లో ఎక్కడా సమస్య లేకుండా ఆ డ్రోన్ చేరుకుందని అధికారులు చెప్పారు. బ్లడ్ శాంపిల్ పాడవకుండా కూలింగ్ కిట్‌లో పెట్టి పంపారని వివరించారు. డ్రోన్‌ను సీడీ స్పేస్ రోబోటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. 500 గ్రాముల బరువుతో 50 కిలోమీటర్ల వరకు ఆ డ్రోన్ వెళ్లగలదని తయారీదారు నిఖిల్ ఉపాధ్యాయ్ చెప్పారు. ఒక్కో డ్రోన్‌కు సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతాయట.