డిజిటల్ సర్వేకు డ్రోన్లు.!

డిజిటల్ సర్వేకు డ్రోన్లు.!
  • సర్వేకు డ్రోన్లు! లేదంటే డీజీపీఎస్ విధానంలో..
  • సర్కార్ కు మూడు ప్రపోజల్స్
  • రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్ భూసర్వే కోసం సర్వే సెటిల్ మెంట్ అండ్​ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్​మెంట్ డ్రాఫ్ట్ ​సిద్ధం చేసింది. ఇందులో మూడు పద్ధతులను ప్రతిపాదించింది. ఒక్కో విధానంలో ఉండే లోటు పాట్లు, అయ్యే ఖర్చు, పట్టే సమయాన్ని రిపోర్టులో వివరించినట్లు తెలిసింది. సర్కార్ కు ప్రతిపాదించిన మూడు విధానాల్లో.. డ్రోన్ టెక్నాలజీ అత్యాధునికమైనదని అధికారులు సిఫార్సు చేసినట్లు సమాచారం. డిజిటల్ భూసర్వేను ఒకట్రెండు ఏజెన్సీలకే అప్పగిస్తే ఏడాది నుంచి రెండేండ్లు పట్టొచ్చని.. అలా కాకుండా రెండు, మూడు జిల్లాలకో ఏజెన్సీకి పనులు అప్పగిస్తే 6 నెలల్లోపే సర్వే పూర్తి చేయొచ్చని సూచించినట్లు తెలిసింది. సర్వే ఏజెన్సీలకు చదరపు కిలోమీటర్ కు ఇంత అని ధర చెల్లించాల్సి ఉంటుందని.. ఈ లెక్కన సర్వేకు రూ.400 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఖర్చు కావచ్చని ఓ ఉన్నతాధికారి చెప్పారు.

ఇవీ ప్రతిపాదనలు..

  •  12 ఏళ్ల క్రితం భూభారతి ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన సర్వే మోడల్ ఒకటి. ఈ జిల్లాలోని 911 గ్రామాల్లో ప్రైవేట్​ఏజెన్సీ ద్వారా సర్వే చేశారు. ఎయిర్ క్రాఫ్ట్స్​ను వినియోగించి భూముల ఫొటోలు తీసి సర్వే మ్యాపులు సిద్ధం చేశారు. వీటిని రెవెన్యూ రికార్డులతో అనుసంధానిస్తే సర్వే పూర్తయ్యేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఈ పథకం నిలిచిపోయింది. ఈ పైలట్​ ప్రాజెక్టును కంటిన్యూ చేయొచ్చని, అధికారులు ప్రపోజల్ పెట్టారు. ఇందులో 5 నుంచి 10 మీటర్ల కచ్చితత్వం ఉండే అవకాశముంది.
  •  మేడ్చల్ జిల్లా శామీర్​పేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో భూవివాదాల పరిష్కారానికి సీఎం కేసీఆర్​ చేయించిన సర్వేను మరో ప్రపోజల్ గా చేర్చారు. ఈ గ్రామంలో రెండేండ్ల క్రితం గొలుసు పద్ధతిలో కాకుండా డిఫరెన్షియల్ ​గ్లోబల్ ​పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్)లో శాటిలైట్‌‌‌‌ ఇమేజెస్​తీశారు. ఇందులో 40 సెంటిమీటర్ల మేర కచ్చితత్వం ఉంటుంది. ప్రస్తుతం 28 సెంటిమీటర్ల మేర కచ్చితత్వం ఉండే టెక్నాలజీ కూడా వచ్చింది.
  •  రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వెల్జాల గ్రామంలో 50 ఏళ్లకుపైగా నడుస్తున్న 620 ఎకరాల భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం డ్రోన్ సర్వే చేపట్టింది. అధికారులు దీన్ని మరో ప్రతిపాదనగా చేర్చారు.