చెస్ ఒలింపియాడ్ బరిలో నిండు గర్భిణి హారిక

చెస్ ఒలింపియాడ్ బరిలో నిండు గర్భిణి హారిక

చెస్ ఒలింపియాడ్కు సర్వం సిద్ధమైంది. జులై 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో చెస్ ఒలింపియాడ్‌ జరగనుంది. తొలిసారి భారత్ ఆతిధ్య ఇవ్వబోతున్న ఈ మెగా టోర్నీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ 44వ ఎడిషన్ మహాబలిపురంలో జరగబోతుంది. ఈ టోర్నీని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారు. 

30 మంది క్రీడాకారులు..
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్ మూడు జట్లతో బరిలోకి దిగనుంది. సాధారణంగా ఈ టోర్నీలో మెన్స్, ఉమెన్స్ టీమ్స్ ఆడతాయి. అయితే హోస్ట్ కంట్రీకి మాత్రం మూడో జట్టును ఆడించే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే  ఎ, బి జట్లను ఎంపిక చేశారు. టాప్‌-5లో ఉన్న ప్లేయర్లతో ఎ- జట్టు... 5 నుంచి 10 స్థానాల్లో ప్లేయర్లు బి- జట్టులో ఉన్నారు. అయితే టోర్నీలో పాల్గొంటున్న దేశాల సంఖ్య బేసి నంబర్గా ఉండటంతో  సి- జట్లను కూడా ఎంపిక చేశారు. దీంతో భారత్ తరపున 30  మంది క్రీడాకారులు టోర్నీలో ఆడబోతున్నారు.  చెస్‌ ఒలింపియాడ్‌లో దేశం నుంచి ఇంత మంది క్రీడాకారులు ఆడనుండటం ఫస్ట్ టైం. 

నిండు గర్భిణి.. అయినా ఆడతా..
చెన్నైలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న చెస్ ఒలింపియాడ్లో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణివల్లి హారిక కూడా ఆడాలని నిర్ణయించుకుంది. నిండు గర్భిణిఅయినా..ఈ టోర్నీలో ఆడబోతున్నట్లు ఆమె చెప్పింది. చెస్ ఒలింపియాడ్‌ అనేది తమకు ఒలింపిక్స్‌తో సమానమని...అయితే తాను  నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ టోర్నీలో ఆడతానని వెల్లడించింది. చెస్‌ ఒలింపియాడ్‌ తొలిసారి మన దేశంలో జరుగుతోందని... సొంతగడ్డపై ఆడకుంటే తనకు కష్టంగా ఉంటుందని చెబుతోంది.  చెన్నైకి ఫ్లైట్లో  గంట ప్రయాణమే కాబట్టి..ఎలాంటి ఇబ్బంది ఉండదంటోంది. చెస్ ఒలింపియాడ్ కోసం చాలా రోజుల నుంచి సాధన చేస్తున్నానని..అన్ని గేమ్స్లో పాల్గొనకపోయినా..వివిధ దశల్లో కొన్నైనా ఆడతానని హారిక తెలిపింది. చెస్ ఒలింపియాడ్లో ఆడతానని డాక్టర్ను అడిగితే వారు కూడా ఆడొచ్చని సలహా ఇచ్చారని హారిక వెల్లడించింది. ఈ టోర్నీలో  గతంలో 4  నెలల గర్భిణులు పాల్గొని ఉండొచ్చని..అయితే ఎక్కువ నెలలతో ఆడుతున్న ప్లేయర్ ని మాత్రం తానే  కావొచ్చని వివరించింది. 

ఐదేళ్ల తర్వాత ప్రత్యక్షంగా..
చెస్ ఒలింపియాడ్లో భారత్ బలంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో భారత్ మహిళ జట్టు టాప్ సీడ్గా బరిలోకి దిగుతోంది. పురుషుల టీమ్ రెండో సీడ్గా ఆడబోతుంది. ఇది స్విస్‌ ఫార్మాట్‌.  మొత్తం11 రౌండ్లుంటాయి. కరోనా కారణంగా 2020, 2021లలో ఆన్‌లైన్‌లో ఒలింపియాడ్‌ జరిగింది. 2020లో రష్యాతో కలిసి భారత్ గోల్డ్ మెడల్ సాధించగా.. 2021 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. 2018లో చివరి సారిగా ప్రత్యక్షంగా టోర్నీని నిర్వహించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షంగా టోర్నీ జరగబోతుంది.  ఈ టోర్నీలో మెన్స్, ఉమెన్స్ విడివిడిగా గేమ్స్ జరుగుతాయి. ఐదుగురు ప్లేయర్లలో  నలుగురు గేమ్‌లు ఆడతారు. ఒకరు రిజర్వ్‌గా ఉంటారు.