సెకండరీ స్కూల్ లెవల్స్​లో డ్రాపౌట్స్ పెరిగినయ్

సెకండరీ స్కూల్ లెవల్స్​లో డ్రాపౌట్స్ పెరిగినయ్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సెకండరీ లెవల్ స్కూల్ డ్రాపౌట్ రేటు.. ఏడు రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైంది. 2021–22లో డ్రాపౌట్ నేషనల్ యావరేజ్ 12.60 శాతంగా ఉంది. అయితే, గుజరాత్, బీహార్, కర్నాటక, అస్సాం, పంజాబ్​తో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో డ్రాపౌట్ రేటు భారీ గా పెరిగింది. 2023–24లో ‘‘సమగ్ర శిక్ష” కార్యక్రమం అమలుపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ (పీఏబీ) మీటింగ్​లు జరిగాయి. ఈ క్రమంలో సెకండరీ స్కూల్ డ్రాపౌట్స్ లెక్కలు బయటికొచ్చాయి.

ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్యలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పీఏబీ మీటింగ్​లు కేంద్రం నిర్వహించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా.. 2030 నాటికి పాఠశాల స్థాయిలో 100 శాతం గ్రాస్ ఎన్​రోల్​మెంట్ రేటు (జీఈఆర్) సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, డ్రాపౌట్స్ సమస్య జీఈఆర్ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బీహార్​లో 20.46 శాతం

దేశవ్యాప్తంగా 2021–2022 అకడమిక్ ఇయర్​లో డ్రాపౌట్ రేటు అత్యధికంగా మేఘాలయలో 21.70 శాతంగా నమోదైంది. తర్వాత బీహార్​లో 20.46 శాతం, అస్సాంలో 20.30 శాతం, గుజరాత్​లో 17.85 శాతం, ఆంధ్రప్రదేశ్​లో 16.70 శాతం, పంజాబ్​లో 17.20 శాతం, కర్నాటకలో 14.60 శాతం ఉంది. ఈ రాష్ట్రాల డ్రాపౌట్ రేటు.. నేషనల్ యావరేజ్ (12.60 శాతం) కంటే ఎక్కువగా నమోదైంది. వెస్ట్ బెంగాల్​లో 2020 – 2021తో పోలిస్తే 2021–2022 అకడమిక్ ఇయర్​లో డ్రాపౌట్ రేటు భారీగా తగ్గినట్లు పీఏబీ మీటింగ్​లో స్పష్టమైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో చాలా మంది బడి మానేసిన పిల్లలు ఉన్నారు.

మధ్యప్రదేశ్​లో తగ్గిన డ్రాపౌట్స్

మధ్యప్రదేశ్​లో సెకండరీ లెవల్ డ్రాపౌట్ రేటు భారీగా తగ్గింది. 2020 – 21 అకడమిక్ ఇయర్​లో 23.80 శాతం ఉంటే.. 2021–2022 నాటికి 10.10 శాతానికి తగ్గింది. డ్రాపౌట్స్ తగ్గించేందుకు మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఏడాదీ స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్​ చేస్తుంటుంది. దీనికోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్​ను రూపొందించింది. కాగా, ఉత్తరప్రదేశ్​లోని కొన్ని జిల్లాల్లో యానువల్ యావరేజ్ డ్రాపౌట్ రేటు భారీగా ఉంది. నిరుడు యునైటెడ్ నేషన్స్ చిల్ర్డన్స్ ఫండ్ (యునిసెఫ్) చేసిన సర్వే ప్రకారం.. ఇండియాలో 33 శాతం మంది బాలికలు ఇళ్లల్లో పని కారణంగా చదువుకు దూరం అవుతున్నట్లు తేలింది.